సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చింది మావోయిస్టు మహిళా యాక్షన్ టీం పనేనని అనుమానిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద వారిని అటకాయించిన మావోల్లో 30 మందికిపైగా మహిళలే ఉన్నారని, వీరిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మావోయిస్టుల్లో మహిళా యాక్షన్ టీం సభ్యులు నిబద్ధతతో, చురుగ్గా ఉంటారని పేరు. వీరు ఎన్‌కౌంటర్‌లలో గాని, సాయుధ దాడుల్లో గాని వెనకడుగు వేయరని, అందుకే వీరికి దళంలో అధిక ప్రాధాన్యం ఉంటుందని చెబుతారు. ఈ మహిళా యాక్షన్ టీంలో ఏపీకంటే ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన వారే అధికంగా ఉంటారని తెలుస్తోంది. కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా యాక్షన్ టీమ్ సభ్యులు పాల్గొని ఉంటారని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి.
విలీన వారోత్సవాల ఆరంభంలోనే!
సీపీఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ)లు విలీనమై 2004 సెప్టెంబర్ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. అప్పట్నుంచి ఏటా సెప్టెంబర్ 21 నుంచి వారం రోజులపాటు మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా జూలై 28 నుంచి వారం పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కూడా జరుపుతుం టారు. అలాగే డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల సమయంలో తమ ఉనికిని చాటుకోవడానికి విధ్వంసాలకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇన్‌ఫార్మర్లను హతమార్చడం వంటి దుశ్చర్యలకు దిగుతుంటారు. అందువల్ల ఆయా సమయాల్లో పోలీసులు అప్రమత్తమవుతారు. ప్రజాప్రతినిధులను మన్యంలోకి వెళ్లవద్దని సూచిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలతో కూంబింగ్, గాలింపు చర్యలు వంటివి ఉధృతం చేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విలీన వారోత్సవాలను పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఇదే అదనుగా మవోలు వారిని చంపగలిగారని చెబుతున్నారు. ఏవోబీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
ప్రజా కోర్టు పెట్టి కాల్చివేత
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి
కిడారి సర్వేశ్వరరావు, సోమలతో పాటు వెళ్లిన అరకు మాజీ సర్పంచ్ చటారి వెంకటరాజు కళ్ల ముందే.. మావోయిస్టులు హతమార్చారు. మావోలను చూసి లివిటిపుట్టులోని ఓ ఇంటిలోకి వెంకటరాజు పరుగులు తీశారు. ఆయన్ని పట్టుకుని మావోయిస్టులు రోడ్డు మీదకు తీసుకువచ్చారు. దీంతో అతను విలవిల్లాడిపోయి తనను ఏమీ చేయొద్దని మావోలను శరణువేడాడు. కొద్ది నిమిషాలు ప్రజా కోర్టు పెట్టి ఆయన ఎదురుగా ఒకరి తరువాత ఒకరిని కాల్చి చంపారు.
కిడారికి పలుమార్లు హెచ్చరికలు
ఎమ్మెల్యే కిడారి కొంతకాలంగా ఏజెన్సీలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. హుకుంపేట మండలం గూడలో నల్లరాయి క్వారీని ఎమ్మెల్యే తన అనుచరుల చేత నడుపుతున్నారు. ఇక అనంతగిరి మండలంలోని నిమ్మల పాడు క్వారీలో ఆయనకు వాటాలున్నట్లు సమాచారం. గూడ క్వారీలోని పేలుళ్లతో తమ గ్రామానికి ప్రమాదం ఉందని, ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత 3 నెలల నుంచి గూడ గిరిజనులు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వారీ మూసివేయాలనే డిమాండ్‌తో ఉద్యమం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వారీ వ్యాపారాన్ని మానుకోవాలని మావోయిస్టులు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
గ్రామదర్శినికి వెళ్లవద్దన్నా కిడారి వినలేదు
విశాఖ క్రైం/సామర్లకోట(పెద్దాపురం): తమ ఉనికి కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, సోమను మావోయిస్టులు హత్య చేశారని ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలున్న ప్పటికీ.. ఏపీలో మాత్రం ఇప్పటివరకూ లేవన్నారు. రాష్ట్రంలో కూడా ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ హత్యలు చేశారన్నారు. ఈ దాడిలో 50 మంది మావోలు పాల్గొన్నారని చెప్పారు. విస్తృతంగా కూంబింగ్ నిర్వ హిస్తున్నట్టు తెలిపారు. మావోల వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. గ్రామదర్శినికి వెళ్లవద్దని పోలీసులు సూచించినా వినకుండా ఆయన వెళ్లారన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేశ్వరరావు, సోమ మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం సోమవారం అరకులోయలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అక్కడే స్థూపం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment