పోలీస్‌ హై అలర్ట్‌! | Maoists Attack On MLA, ex MLA shot Case Adilabad | Sakshi
Sakshi News home page

పోలీస్‌ హై అలర్ట్‌!

Published Mon, Sep 24 2018 8:30 AM | Last Updated on Mon, Sep 24 2018 8:30 AM

Maoists Attack On MLA, ex MLA shot Case Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒకప్పటి మావో యిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు హత్య చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నందున భద్రత పెంచాలని రాష్ట్ర పోలీస్‌ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు తమ పర్యటనల వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు.

మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను ఆనుకొని ఉమ్మడి ఆదిలాబాద్‌ ఉండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఇద్దర్ని ఒకేసారి హత్య చేసిన మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు తెలంగాణలో సైతం దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్‌ ఎస్‌పీలు, రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల డీసీపీ తమ పరిధిలోని పోలీస్‌ యంత్రాంగానికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
 
21న మావోయిస్టు పార్టీ ఆవిర్భావం     – వారం పాటు ఉత్సవాలు
దేశంలో విప్లవ పంథాలో సాగే పార్టీలన్నీ కలిసి 2004 జనవరి 21న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)గా ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వరకు విప్లవ పోరాట పంథా సాగించిన పీపుల్స్‌వార్‌ పార్టీ కూడా సీపీఐ(మావోయిస్టు)లో భాగమైంది. ఈ నేపథ్యంలో 21వ తేదీ నుంచి 27 వరకు పార్టీ 14వ ఆవిర్భావ   వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు అన్ని స్థాయిల్లోని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, పాటల ద్వారా ప్రచారం చేసి, సభలు, సమావేశాల ద్వారా కళా ప్రదర్శనలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు.

ఈ మేరకు కుమురంభీం–మంచిర్యాల డివిజన్‌ కమిటీ తరఫున మావోయిస్టు నేత చార్లెస్‌ ఈ నెల 19న ఐదు పేజీల పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలకు పిలుపునిచ్చిన రోజుల్లోనే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాప్రతినిధులను మావోలు హత్య చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement