కాల్పుల ప్రాంతంలో లభించిన మావోయిస్టుల సామగ్రి
మణుగూరురూరల్: మణుగూరు సబ్ డివిజన్ ఏజెన్సీ ప్రాంతంలో అలజడి మొదలైంది. బుధవారం మణుగూరు అట వీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయం కావడంతో పోలీసులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలు స్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దళాన్ని మట్టుపెట్టాలని వెళ్లిన పోలీసులకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం మణుగూరును ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ రమణారెడ్డి సైతం సందర్శించారు. స్థానిక అడిషనల్ ఎస్పీ శబరీష్‌తో మాట్లాడి ఎదురుకాల్పుల తీరుతెన్నులు తెలుసుకున్నారు. అక్కడ లభించిన సామగ్రిని పరిశీలించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ గాయపడగా, ప్రతికారం తీర్చుకునేందుకు అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. భారీగా పోలీస్ బలగాలను దింపి ఏజెన్సీ లో మారుమూల వలస గిరిజన గ్రామాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. కొత్తగా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వివరాలను ఆరా తీస్తున్నారు.
కిట్‌బ్యాగ్‌లు లభ్యం
ఎదురు కాల్పుల ప్రాంతంలో లభించిన మావోయిస్టుల సామగ్రి వివరాలను ఎస్పీ సునీల్‌దత్, ఏఎస్పీ రమణారెడ్డి, మణుగూరు అడిషనల్ ఎస్పీ శబరీష్ వెల్లడించారు. మణుగూరు మండలం మల్లెతోగు అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు కూంబింగ్ చేస్తున్న పోలీసులకు దళం తారసపడిందని తెలిపారు. లొంగిపోవాలని చెప్పినప్పటికీ వారు కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమారు 10 నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని వివరించారు. మావో యిస్టులు తమ సామగ్రి వదిలి పారిపోయారని తెలిపారు. సంఘటన స్థలంలో 8ఎంఎం రైఫిల్ ఒకటి, 10 కిట్‌బ్యాగ్‌లు, మెడికల్ కిట్‌లు, విప్లవ సాహిత్యం, ఐఈడీ ఒకటి, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లభించినట్లు తెలిపారు.
పోలీసుల అదుపులో ముగ్గురు ?
మావోయిస్టులు దొరికినట్లు దొరికి తప్పించుకుపోవడంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులైన ముగ్గురు వలస గిరిజనులను అదుపులోకి తీసుకున్నట్లు
సమాచారం. ఈ విషయాలను పోలీసులు మాత్రం ధ్రువీకరించడంలేదు. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుపుతున్నమాట వాస్తవమేకాని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో ఆదివాసీ వలస గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment