సాక్షి, విశాఖపట్నం: అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం టీడీపీలో చేరారు.
కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. దాడి గురించి తెలియగానే బాధపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఓ ప్రకటననువిడుదల చేశారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడిన సీఎం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment