
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఉద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు, వారి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై మళ్లీ నిఘా ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలకు ఒకప్పుడు గుండెకాయలాంటి ఉత్తర తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టిందని ఇంటెలిజెన్స్ తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చింది.
అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామ పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యా హ్నం మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు బాస్ మహేందర్‌రెడ్డి కూడా ఈ జిల్లాల పోలీసు అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది.
కొత్తగా కమిటీలు
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలను పునరుద్ధరించిన సంగతిని కూడా ఇంటెలిజెన్స్ సంబంధిత అధికారులకు సూచించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్–భూపాలపల్లి జయశంకర్–వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలు ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల– కొమురంభీం (ఎం.కె.బి.) డివిజనల్ కమిటీకి ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు.
ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్–సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం– తూర్పుగోదావరి డివిజనల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే చర్ల–శబరి ఏరియా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్లు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలం గాణలోనూ దాడుల కోసం మావోయిస్టులు అదను కోసం చూసే అవకాశం లేకపోలేదని, గతంలో హిట్‌లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. గతంలో హెచ్చరికలు ఉన్న ప్రజాప్రతినిధులు ఒంటరిగా తిరగొద్దని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని, గతంలో టార్గెట్లుగా ప్రకటించిన వారిని అప్రమత్తం చేస్తున్నారు.
సరిహద్దుల్లో జల్లెడ
సాక్షి, కొత్తగూడెం: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యాన్ని అణువణువూ జల్లెడ పట్టేందుకు హైదరాబాద్ నుంచి భారీగా అదనపు బలగాలను దించారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో నుంచి ఈ బలగాలు దండకారణ్యంలోకి చేరుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు, మంథని భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోయిస్టులు పలువురు నేతలపై రెక్కీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.
ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి!
ఆంధ్రా ఒడిశా సరిహద్దు రాష్ట్ర కమిటీ నేతృత్వంలో అరకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, రాష్ట్ర మిలటరీ కార్యదర్శి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, బెల్లి నారాయణస్వామి, చెల్లూరి నారాయణస్వామి అలియాస్ సోమన్న, అరుణల ఆధ్వర్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment