డుంబ్రిగుడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళుతున్న పోలీసు ప్రత్యేక బలగాలు
కొద్ది వారాలుగా రెక్కీ.. రెండు మూడు రోజులపాటు మకాం.. గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహణ.. కాల్పులతో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ పూర్తి.. ఆపైన తాపీగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన మావోయిస్టులు.. సంచలనానికి వేదికైన లివిటిపుట్టు ఆదివారంనాటి దారుణ ఘటనకు మౌనసాక్షి. మావోలు బలహీనపడ్డారని, పోలీసులు పైచేయి సాధించారని భావిస్తున్న తరుణంలో ఉరుములేని పిడుగులా సంభవించిన ఈ సంఘటన దేనికి సంకేతం? గిరిజనులను ప్రేరేపించిన.. మావోయిస్టులకు పరోక్షంగా సహాయపడిన అంశాలేమిటి? సర్కారు దోపిడీ విధానంపై మన్య ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికీ, అసహనానికీ దీనిని ఓ ఉదాహరణగా భావించవచ్చా? ప్రజల్లోనూ, ప్రభుత్వ పెద్దల్లోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్..
సాక్షి, విశాఖపట్నం : ఏదైనా ఆపరేషన్‌లో పాతిక మందో.. ముప్ఫైమందో మావోయిస్టులు పాల్గొంటారు. తమ ఇన్‌ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పని ముగించుకుని వెళ్లిపోతుంటారు. అంతేకాని గ్రామాల్లో మాటు వేసిన సందర్భాలు చాలా అరుదు. ఎక్కడైనా మారుమూల అటవీ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా గిరిజనులందరినీ తమ వద్దకు రప్పించుకుంటారే తప్ప మావోలు గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందడం ఉండదు. కానీ నిన్నటి లివిటిపుట్టు ఘటనలో 60–70 మంది పాల్గొనగా.. చుట్టుపక్కల వివిధ బృందాలుగా ఏర్పడి మరో 70 మందికి పైగా పహారా కాశారని చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 150 మంది మావోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం చిన్న విషయం కాదు. పైగా డుంబ్రిగుడ మండలం కోండ్రుం పంచాయతీ సోరాయి గ్రామానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెళ్తున్నారన్న సమాచారం నాలుగైదు రోజుల ముందే ఇన్‌ఫార్మర్ల ద్వారా తెలియడంతో పక్కా ప్లానింగ్‌తో ఈ ఆపరేషన్‌కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మావోయిస్టులపై గిరిజనులకు గురి కుదిరిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల, ప్రభుత్వ, దోపిడీ విధానాలతో విసిగి వేసారడం వలనే గిరిజనులు మావోలను మళ్లీ విశ్వసిస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం బలం చేకూరుస్తుంది.
మావోయిస్టులు బృందాలుగా ఏర్పడి రెండ్రోజులు ముందుగానే లివిటిపుట్టు పరిసర గ్రామాలకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్‌ఫార్మర్లు, మిలిషీయా సభ్యుల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో సురక్షిత ప్రాంతాల్లో మకాం వేసినట్టు తెలియవచ్చింది. కనీసం ఒకటి రెండ్రోజుల ముందు ఈ ప్రాంతానికి చేరుకున్నారని భావించినా వారికి ఆశ్రయం ఇచ్చే విషయంలో గిరిజనులు ఎంతో కొంత సహకారం అందించి ఉంటారని భావిస్తున్నారు. వీరు ఆశ్రయం ఉన్న గ్రామాలు చాలా వరకు సెల్ నెట్‌వర్కు పనిచేసే గ్రామాలే. పైగా మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, అరుకులోయకు 17 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. నిజంగా పోలీసులకు సమాచారం చేరవేయాలన్నా.. స్వయంగా చెప్పాలన్నా ఏమంత కష్టమైన పనికాదు. ఏ మార్గంలో వెళ్లినా ఒకటి రెండు గంటల్లోనే సమాచారాన్ని చేరవేయొచ్చు. కానీ ఆశ్రయం ఇచ్చిన గిరిజనులు, మిలిషీయా సభ్యులు ఎక్కడా ఏ రూపంలోనూ ఎవరికి సమాచారం చెప్పలేదు. సమాచారం చేరవేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపైన, అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల పైన నమ్మకం పూర్తిగా సడలడమే అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దోపిడీ విధానాల వల్లే గిరిజన యువతకు మళ్లీ మావోలపై గురికుదిరిందన్న వాదన బలంగా విన్పిస్తుంది.
గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ నేతలు గిరి సంపదను అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా తమను అన్ని విధాలుగా దోపిడికి గురిచేయడం వలనే వారి పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు కేంద్రానికి రాష్ట్రం ద్వారా ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల గిరిజన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గిరిజన మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరపనీయమని చెప్పినా గిరిజనుల విశ్వసించడం లేదు. మరోవైపు ఫిరాయించిన పార్టీ నేతలు గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం అడ్డుకట్టవేయలేకపోవడం.. తమకు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టడం.. తమ సమస్యలను పట్టించుకోకపోవడం వంటి విషయాల్లో గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఈ కారణంగానే నిన్నటి ఘటనలో వలనేనన్న భావన బలంగా విన్పిస్తుంది. ఈ కారణంగానే తమ చెంతనే మావోలు ఉన్నçప్పటికీ వారు నోరు మెదపలేదంటున్నారు. మావోలు ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో ఆయా గ్రామాల్లోని పోలీస్ ఇన్‌ఫార్మర్లను నోరుమెదిపే సాహసం చేయలేకపోయారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment