అరకు–డుంబ్రిగుడ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్‌స్క్వాడ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం యుద్ధభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఉద్రిక్త పరిస్థితే. మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ ఎత్తున సాయుధ బలగాలు మోహరించాయి. అంతటా గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్‌పీఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ దళాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)తో పాటు విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కూంబింగ్‌ను ప్రారంభించాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు మార్గాల్లో వీరు కనిపిస్తున్నారు. కేంద్ర పారామిలటరీ దళాలను కూడా పంపడానికి కేంద్ర హోంశాఖ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని రోడ్ల వెంబడి సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. మన్యంలోని పలు ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్‌లు, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు మంచి పట్టుంది. దీంతో ఒకపక్క కూంబింగ్, మరోపక్క మావోయిస్టుల స్థావరాలపై పోలీసులు మరింత దృష్టి సారిస్తున్నారు.వివిధ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సానుభూతిపరులు, అనుమానితులను ఆరా తీస్తున్నారు. మరోపక్క పోలీసులను ఎదుర్కోడానికి మావోయిస్టులూ సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో పోలీసులు మరింతగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుబెట్టిన తర్వాత మావోయిస్టులు ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. తాము హతమార్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెలను కావడంతో అది తమ గొప్ప విజయంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏవోబీలో కూంబింగ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మందుపాతర్లను అమర్చినట్టు సమచారం. తామున్న ప్రాంతానికి వచ్చే సాయుధ దళాలను మట్టుబెట్టే వ్యూహంగా పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి మావోయిస్టు విలీన వారోత్సవాల సందర్భంగా చత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు, కోందు దళాలను ఇప్పటికే ఏవోబీలోకి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు ఎన్‌కౌంటర్లకు సైతం వెరవకుండా దాడులకు పాల్పడతారన్న పేరుంది. ఇరు వర్గాలు పగ, ప్రతీకారాలతో ఉన్నందున ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విశాఖ మన్యం వాసులు భయం గుప్పెట కాలం గడుపుతున్నారు. అనుమానితుల పేరిట ప్రశ్నించడానికి పోలీసులు ఎవరిని ఎప్పుడు తీసుకుపోతారోన్న భయం వీరిని వెంటాడుతోంది. ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు.
లివిటిపుట్టులో డీజీపీ
డుంబ్రిగుడ(అరకులోయ): ప్రజల కోసం పని చేసే మంచి గిరిజన ప్రజాప్రతినిధులను కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన మండలంలోని లివిటిపుట్టు గ్రామాన్ని, సంఘటన స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం నిశితంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. ఏజెన్సీ గ్రామాలు ఒడిశాకు సరిహద్దుగా ఉండటంతో తరచూ మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయన్నారు. మున్ముందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో క్లిప్పింగ్‌లు, ప్రత్యక్ష సాక్షులు, ఫొటోల ఆధారంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఓఎస్డీ సిద్ధార్థకౌశల్, ఏఎస్పీ అమిత్‌బర్దర్, డీసీపీ ఫకీరప్ప ఉన్నారు.
సోమ కుటుంబానికి పరామర్శ
అరకులోయ: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని డీజీïపీ ఆర్‌పీ ఠాకూర్ పరామర్శించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ముందుగా సోమ ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ భార్య బిచ్చావతి, కుమారులు అబ్రహం,సురేష్,ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు.
అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు..
ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు తన భర్తను అన్యాయంగా మావోయిస్టులు పొట్టనపెట్టుకుని,తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని సోమ భార్య బిచ్చావతి డీజీపీ ఎదుట రోదించారు. తమను వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ హత్యగా విచారణ చేపట్టాలి..
తన తండ్రిని మావోయిస్టులు అన్యాయంగా చంపారని,రాజకీయ హత్య కోణంలో విచారణ చేపట్టాలని సోమ కుమారులు అబ్రహం, సురేష్‌లు డీజీపీకి విన్నవించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోయారని, డుంబ్రిగుడ ఎస్‌ఐ విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదు చేశారు.
అన్ని విధాల న్యాయం చేస్తాం..
మావోయిస్టులు ఇద్దరు నాయకులను హత్య చేయడం బాధాకరమని, మీ కుటుంబానికి అన్ని విధాల సాయం చేస్తామని డీజీపీ ఠాకూర్, సోమ భార్య, కుమారులకు హమీ ఇచ్చారు.
సిట్ దర్యాప్తుతో అన్నీ వెలుగులోకి..
పాడేరు: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై సిట్‌తో విచారణ చేపడుతున్నందున అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ ఆర్.పి. ఠాకూర్ అన్నారు. బుధవారం రాత్రి పాడేరులోని కిడారి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కిడారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం కిడారి భార్య పరమేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమారు గంటసేపు కిడారి భార్య పరమేశ్వరితో పలు విషయాలపై ఆంతరంగికంగా చర్చించారు. తమకు జరిగిన అన్యాయం గురించి, కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆమె డీజీపీకి వివరించారు. తమకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరారు. కిడారి సర్వేశ్వరరావు వద్ద పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, అనుచరుల వ్యవహార శైలి, తదితర వాటిపై డీజీపీ కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు డీజీపీ వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏఎస్పీ అమిత్ బర్దర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment