ఆందోళనకారుల దాడిలో తగలబడుతున్న అరకు పోలీస్‌స్టేషన్
సాక్షి విశాఖపట్నం/ పాడేరు రూరల్/అరుకులోయ/డుంబ్రిగుడ/ఎంవీపీకాలనీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడంతో అరకులోయ అట్టుడికిపోయింది. వారి అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఎమ్మెల్యే కార్యక్రమ వివరాలు శనివారం సాయంత్రం డుంబ్రిగుడ పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆదివారం కిడారికి పోలీసులు రక్షణ కల్పించలేదని.. ఇది అదునుగా చూసి మావోలు వారిని చంపేశారని పోలీసులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీఐ వెంకునాయుడితో వాగ్వాదానికి దిగారు. రక్షణ కల్పించాలని సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మూడు రోజులుగా మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసినా తమ నేతలకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ ఎస్‌ఐ ఆమనరావును ఇక్కడకు తీసుకురావాలని, జరిగిన హత్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
మృతదేహాలను విశాఖ తరలించనివ్వం..
లివిటిపుట్టు నుంచి మృతదేహాలను తరలించేందుకు పోలీసులు రాకపోవడంతో నేతల అనుచరులు వారి వాహనాల్లోనే అరకుకు తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారు పోలీస్ స్టే్టషన్ సమీపానికి చేరుకోగానే అరకు సీఐ వచ్చి.. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని, అక్కడే పోస్టుమార్టం చేస్తారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. మృత దేహాలను విశాఖకు తరలించడానికి అంగీకరించబోమని మృతదేహాలతో తీసుకుని రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు. ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే వరకు మృతదేహాలను కదలనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు.
బందోబస్తును పట్టించుకోని పోలీసులు
వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తరువాత ఎమ్మెల్యే కిడారి ఏజెన్సీకి రావడం తగ్గించేశారు. అరకు నియోజకవర్గంలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని, గ్రామ వికాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో కొద్ది రోజులుగా అరకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మావోల ముప్పు ముందు నుంచి ఊహిస్తున్న కిడారి... బందోబస్తు కోసం శనివారం రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఆయన పీఏ అప్పారావు చెప్పారు. తనతో ఎస్‌ఐ అమ్మనరావుకు ఫోన్ చేయించారని, అయినా సరే పోలీసులు ఆదివారం నాటి పర్యటనకు బందోబస్తు కల్పించలేదని వివరించారు. పోలీసులురూట్ వాచ్ కూడా చేయలేదన్నారు.రూరల్ ఏస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అరకులోయలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో టీడీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
నేడు హోంమంత్రి రాక..
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతదేహాలను ఆదివారం రాత్రి అరకులోయలోని వారి క్యాంపు కార్యాలయాలకు తరలించారు. ఏపీ సీఎం అమెరికా పర్యటనలో ఉండటంతో హోంమంత్రి చినరాజప్ప సోమవారం ఉదయం అరకులోయకు చేరుకుంటారు. మంత్రి సమక్షంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరుకు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మాదెల పంచాయతీ బట్టివలస గ్రామానికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతితో విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీస్ స్టేషన్లకు నిప్పు..
పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రెండు మృతదేహాలను స్టేషన్ల వద్దకు తీసుకువచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులు, మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. దీంతో వాహనాలు, స్టేషన్ రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను బయటకు తీసుకెళ్లడంతో అవి మంటలబారిన పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment