సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే దానిపై ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో 30 కుటుంబాల్లో 200 మంది నివశిస్తున్నారు. గ్రామస్తుల్లో చాలామంది క్రైస్తవులు. వీరిలో కొంతమంది ప్రతి ఆదివారం ఉదయం సమీపంలోని భల్లుగూడ, స్వర్ణాయిగూడ, కొరంజుగూడల్లో ప్రార్థనలకు వెళ్లి సాయంత్రానికి తిరిగివస్తారు. మిగిలిన వారు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు, అటవీ పనులకు వెళ్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత ఆదివారం (23న) డుంబ్రిగూడ మండలం కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామంలో గ్రామవికాసంలో పాల్గొనాలని కార్యకర్తలు ఆహ్వానించడంతో ఎమ్మెల్యే కిడారి వారం రోజుల క్రితమే అంగీకరించారు. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మావోయిస్టులకు ఈ సమాచారం చేరింది. అప్పట్నుంచి వారు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ గ్రామానికి డుంబ్రిగూడ నుంచి వచ్చే ఏకైక మార్గం లివిటిపుట్టే. దీంతోపాటు గ్రామానికి చుట్టూ ఉన్న మూడు దట్టమైన కొండలు అనువుగా మారాయి.
అంతేకాకుండా డుంబ్రిగూడ మండలం వైపు పోలీసులు దృష్టి సారించడం లేదన్న నమ్మకంతో వీరు ముందుగా అక్కడకు చేరుకుని ఆ దారిలో వచ్చే కిడారిని మట్టుబెట్టవచ్చని వ్యూహరచన చేశారు. కిడారి వచ్చే రూటు, గ్రామ పరిసరాలు, రాకపోకలు సాగించే దారులను క్షుణ్నంగా పరిశీలించారు. ముందురోజు గ్రామానికి 250 మీటర్ల ముందు రోడ్డుపై ఒక మందుపాతరను అమర్చారు. అక్కడ కొంతమంది మావోయిస్టులు పహరా కాశారు. గ్రామం దాటాక 250 మీటర్ల దూరంలో గుంటసీమ రోడ్డులో మరో మందుపాతరను పెట్టారు. అక్కడికి సమీపంలో మరికొందరిని పెట్టారు. ఇంకొందరు మావోయిస్టులు ఊరికి ఆనుకుని ఉన్న కొండల్లో మాటు వేశారు. గ్రామస్తులు కొందరు చర్చిలకు వెళ్లిపోగా మిగిలిన వారిని తమ అదుపులోకి తీసుకున్నారు.
కిడారి బృందం బయలుదేరిందని పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు కిడారి, సోమల వాహనాలు ఊర్లోకి చేరగానే అడ్డంగా నిలబడ్డారు. ఆ సమయంలో డుంబ్రిగూడ–లివిటిపుట్టు, లివిటిపుట్టు–గుంటసీమ రోడ్డులో గంటకు పైగా రాకపోకలను నిలిపేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కొద్ది దూరం తీసుకెళ్లిన అనంతరం పలు ప్రశ్నలు వేసి కాల్చి చంపారు. తర్వాత ‘ఆపరేషన్ సక్సెస్’ అంటూ తమ వద్ద ఉన్న వాకీటాకీల్లో సహచరులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులంతా అడవుల్లోకి వెళ్లిపోయారు. ఒకవేళ తమ నుంచి ఎలాగైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నా, పోలీసులు ప్రవేశించినా తప్పించుకునే వీలు లేకుండా పేల్చేయడానికి ఊరి మొదలు, చివర్లలో మందుపాతర్లను పెట్టినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మావోయిస్టులు 100 నుంచి 120 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
నిస్సహాయ స్థితిలో గన్‌మెన్లు
ప్రజాప్రతినిధులకు రక్షణ కవచంలా ఉండేందుకు ప్రభుత్వం వారికి గన్‌మెన్లను నియమిస్తుంది. అలాంటి అంగరక్షకులే ఆపదలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా 100 నుంచి 120 మంది మావోయిస్టులు ఏకే–47 తుపాకులు చేతపట్టి నలువైపులా చుట్టుముట్టడంతో ఉన్న ముగ్గురు గన్‌మెన్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయారు. కిడారికి ఇద్దరు గన్‌మెన్లు, సివేరికి ఒక గన్‌మెన్ ఉన్నారు.
మాకేం తెలియదు..
గత ఆదివారం ఏం జరిగిందో తమకేమీ తెలియదని లివిటిపుట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ‘ఎప్పటిలాగే భల్లుగూడ, స్వర్ణాయిగూడ, కొరంజుగూడల్లోని చర్చిలకు ఉదయాన్నే వెళ్లిపోయా.. సాయంత్రం వచ్చేటప్పటికి ఊళ్లో జనం మూగి ఉన్నారు. ఎమ్మెల్యే గారిని చంపేశారని చెబితే షాకయ్యాం’ అని శెట్టి లక్ష్మి చెప్పింది. ‘మావోయిస్టులకి మేం ఏనాడూ అంబలైనా పెట్టలేదు.. కానీ మేం ఆదరించామని పోలీసులు మా మొగోళ్లను అన్యాయంగా తీసుకుపోయేరు’ అని రాజేశ్వరి అనే యువతి వాపోయింది.
తమవాళ్లను తీసుకెళ్లడంపై ఆందోళన
విచారణ పేరిట పోలీసులు లివిటిపుట్టుకు చెందిన 20 మంది పురుషులను బుధవారం తెల్లవారుజామున తీసుకెళ్లారు. దీంతో తమ వారిని ఏంచేస్తారోనంటూ భార్యలు, పిల్లలు ఇళ్ల వద్దనే వంటా వార్పూ లేకుండా గడిపారు. మధ్యాహ్నం పాడేరు ఏఎస్పీ అమిత్ బర్దర్ లివిటిపుట్టును సందర్శించారు. ఆ గ్రామ మహిళలు తమకే పాపం తెలియదని, తమ వారిని విడిచిపెట్టాలని ఆయన కాళ్లపై పడి రోదించారు. సాయంత్రానికి వారిని విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఊరట చెందారు. కాగా, కిడారి, సివేరిల హత్యలో ప్రత్యక్ష సాక్షులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు గన్‌మెన్లతోపాటు ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, మరికొందరు టీడీపీ నాయకులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిచ్చే సమాధానం, సమాచారం ఆధారంగా ఓ నిర్ధారణకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment