ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ | Maoist Meena killed in police firing at AOB | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ

Published Sat, Oct 13 2018 3:46 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

Maoist Meena killed in police firing at AOB - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు/మల్కన్‌గిరి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు– మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాం డర్‌ మీనా మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు ఓ మిలీషియా సభ్యు డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 23న విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చాక మావోల కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్‌వోజీ, డీఓబీ జవాన్లతోపాటు ఆంధ్రా గ్రేహౌండ్స్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 7న ఏవోబీ పరిధిలోని సుంకి అటవీ ప్రాం తంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ సంఘటనలో మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్‌ను కోరాపుట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసు లు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం తెల్లవారుజామున చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆండ్రపల్లి–బెజ్జంగి మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పంచాయతీ కేంద్రమైన ఆండ్రపల్లి సమీపంలో ఇరు వర్గాల మధ్య రెండు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు నిలిచిపోయినప్పటికీ పోలీసులు మాత్రం కాల్పులు కొనసాగించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్టు పార్టీ డిప్యూటీ దళ కమాండర్‌/డివిజన్‌ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న మీనా అలియాస్‌ జిలానీ బేగం అలియాస్‌ నిడిగొండ ప్రమీలగా నిర్ధారించారు. మృతురాలు మావోయిస్టు కీలక నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ భార్యగా గుర్తించారు. కిడారి, సోమ జంట హత్య కేసులో మీనా 21 వ ముద్దాయిగా ఉన్నట్టుగా నిర్ధారించారు. 

గ్రామస్తుల అడ్డగింత 
మహిళా మావో మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న మావోలను గ్రేహౌండ్స్‌ పోలీసులు మల్కన్‌గిరికి తరలిస్తుండగా బెజ్జంగి జంక్షన్‌ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆండ్రపల్లి, పనసపట్టు, జూడం పంచాయతీల్లోని 60 పల్లెలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా గిరిజనులు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. గ్రేహౌండ్స్‌ పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశా రు. పోలీసుల వాహనాలను వెంబడించారు. అదుపులో తీసుకున్నవారిని విడిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రేహౌండ్స్‌ దళాలను చుట్టుముట్టారు. రామగుడ ఎన్‌కౌంటర్, లివిటిపుట్టు ఘటనల తర్వాత ఆంధ్రా గ్రేహౌండ్స్‌ బలగాలే తమ ప్రాంతాల్లోకి వచ్చి గాలింపు చర్యల పేరిట తమను వేధిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లోకి చొరబడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అకారణంగా గ్రామస్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారని, సమాచారం చెప్పడం లేదంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుం దని భావించిన గ్రేహౌండ్స్‌ బలగాలు గాల్లో  కాల్పులు జరిపాయి. దీంతో గిరిజనులు చెదురుమదురు కావడంతో పోలీసు వాహనాలు ముందుకు వెళ్లాయి. 

అగ్రనేతలు తప్పించుకున్నారు: విశాఖ ఎస్పీ 
ఏవోబీలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వెల్లడించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలని, ఆ రోజు ఆపరేషన్‌లో ఆమె కీలకంగా పాల్గొన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల ఘటన మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోది కావడంతో ఆమె మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న నలుగురిని అక్కడకు తరలించామని చెప్పారు. ఏవోబీలో నిరంతరాయంగా కూంబింగ్‌ చేస్తున్నామన్నారు. 

50 ఘటనల్లో మీనా: మల్కన్‌గిరి  ఎస్పీ  
మీనా గత 20 ఏళ్లుగా ఏవోబీలో డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తోందని మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్‌ మిన్నా చెప్పారు. జిల్లాలోని రామగుడ ఎన్‌కౌంటర్, ఐఏఎస్‌ అధికారి వినీల్‌ కృష్ణ అపహరణ, ఇన్‌ఫార్మర్స్‌ నెపంతో హత్యలు ఇలా సుమారు 50 ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందన్నారు. మీనాపై ఆంధ్రా ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు.

మల్కన్‌గిరికి తరలింపు 
ఘటనా స్థలంలో మహిళా మావోలు.. జయంతి అలియాస్‌ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్‌ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్‌ కర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళా మావోయిస్టులూ కటాఫ్‌ ఏరియా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురితోపాటు మీనా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement