women Maoist
-
మావోయిస్టు ఆజాద్ భార్య అరెస్ట్
సాక్షి, బీజాపూర్: దివంగత మావోయిస్టు అగ్రనేత ఆజాద్ భార్య, మహిళా మావోయిస్టు నాయకురాలు సుజాత అలియాస్ నాగరం రూపాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మహిళా మావోయిస్టు నేత రూప అరెస్ట్‌ను బీజాపూర్ ఎస్పీ దివ్యంగ్ పటేల్ ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, డీవీపీ సభ్యురాలిగా సుజాత మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కర్ణాటకతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో కూడా ఆమె పనిచేసింది. మావోల కదలికలపై కన్నేసిన పోలీసులు రూపను ఎట్టకేలకు పట్టుకున్నారు. సుజాతను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఇది నక్సల్ కేసులలో ఇప్పటివరకు సాధించిన ఘన విజయంగా పోలీసులు పేర్కొంటున్నారు. -
మంగ్లీ అరెస్ట్
సాక్షి, వరంగల్ : కరుడు గట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని అరెస్ట్ చేశామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. మల్కన్‌గిరి మావోయిస్టు సభ్యురాలైన మంగ్లీపై రూ. 5లక్షల రివార్డు ఉంది. 2011 నుంచి మవోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడి చేసిన కేసుల్లో నిందితురాలిగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. 2011 నుంచి మంగ్లీపై 10 కేసులు ఉన్నాయని చెప్పారు. 2016లో సీఆర్ పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్ లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలని ఎస్పీ పేర్కొన్నారు. దంతెవాడ స్థానిక పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు కలిసి గాలింపు జరిపి మహిళా మావోయిస్టు మంగ్లీని అరెస్టు చేశారని ఎస్పీ వివరించారు. -
మీనా ఎన్కౌంటర్.. స్పందించిన మావోలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)వద్ద ఈ నెల 12 జరిగిన మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాండర్ మీనా ఎన్కౌంటర్, మరి కొంత మంది అరెస్ట్‌లపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆడియో టేప్ విడుదల చేశారు. ఏవోబీ డివిజన్ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి పేరిట రిలీజ్ చేసిన ఆడియో టేప్‌లో సరిహద్దుల్లో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘కామ్రేడ్ మీనా మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేసుకుంటూ అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శత్రువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రే హౌండ్స్ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి ఏకదాటిగా రాపిడ్ ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్‌కు తూటాలు తగిలిన మీనా తీవ్రంగా గాయపడింది. గ్రే హౌండ్స్ పోలీస్లే మీనాను హత్య చేశారు. గత వారం రోజుల నుంచి కాల్పులతో పోలీస్‌లు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కట్ ఆఫ్ ఏరియాలో ప్రధానంగా ఆంధ్రలో పెద బయలు, ముంచంగిపుట్టు, ఒడిశాలోని మల్కన్ గిర, ఆండ్రపల్లి, జంత్రీ వంటి గిరిజన గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆండ్రపల్లిలోని మహిళలందరినీ హింసించారు. పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను నిర్బంధించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలి’అంటూ ఆడియో టేప్‌లో మావోలు కోరారు. చదవండి: ‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’ ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
ఆమెను ముందే అదుపులోకి తీసుకున్నారా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పోలీసులు–మావోల ఎదురుకాల్పుల ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు నేత మీనా అలియాస్ జిలానీ మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది కీలక నేతలు తప్పించుకున్నారని చెబుతున్న పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపాక పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. రెండేళ్ల కిందట రామగుడ ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోలను చావు దెబ్బతీశామని భావిస్తున్న పోలీసులకు లివిటిపుట్టు ఘటన కోలుకోలేని షాక్‌నిచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతూ వస్తున్నారు. (చదవండి: ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ) మావోయిస్టులు పోలీసుల కూంబింగ్‌ను లెక్కచేయకుండా ఏవోబీలోనే ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. ఒడిశాలోని జన్‌బై వద్ద నిర్మిస్తున్న గురుప్రియ వంతెనను వ్యతిరేకిస్తూ ఈనెల 2న ఏవోబీలోనే భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత 7న సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు, దళ సభ్యులు సమావేశం కాగా పోలీసులు కాల్పులు జరిపారు. కూంబింగ్‌ను కూడా లెక్క చేయకుండా మావోలు ఏవోబీలోనే మకాం వేయడం, కటాఫ్ ఏరియాలోని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ పోలీసులు వెళ్లలేకపోవడం, లివిటిపుట్టు ఘటన జరిగి దాదాపు మూడు వారాలవుతున్నా పోలీసుల అదుపులోకి పరిస్థితులు రాకపోవడం వెరసి వ్యూహాత్మకంగానే పోలీసులు ఎదురుకాల్పుల ఘటనను సృష్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీనాను ముందే అదుపులోకి తీసుకున్నారా? ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్య మీనా అలియాస్ జిలానీ కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యమానికి దూరంగానే ఉన్నారని చెబుతున్నారు. లివిటిపుట్టు ఆపరేషన్‌లో ఆమె పాల్గొన్నారా.. లేరా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పోలీసులు ఆమెను కిడారి, సివేరిల హత్య కేసులో 21వ నిందితురాలిగా చూపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా మీనా మల్కన్‌గిరి జిల్లాలోని ఆండ్రపల్లిలో తలదాచుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఆండ్రపల్లిని గురువారం రాత్రే ముట్టడించారని తెలుస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనారోగ్యంతో ఉన్న తాను లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పినా.. ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల కథ సృష్టించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మ నెల రోజులుగా ఇదే గ్రామంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నెన్నో అనుమానాలు? ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్న మీనా మృతదేహాన్ని మీడియాకు, గ్రామస్తులకు పోలీసులు చూపించలేదు. గ్రామస్తులు చుట్టుముట్టినా మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం తెల్లవారుజామున మొత్తం ఏడుసార్లు మాత్రమే కాల్పుల శబ్దం వినపడిందని, ఎదురుకాల్పుల ఘటనల్లో లెక్కకు మించి కాల్పుల శబ్దాలు వస్తాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఘటన జరిగిన ఆండ్రపల్లి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోనిది కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కిడారి హత్య దరిమిలా మూడు వారాలుగా మావోయిస్టులకు సవాల్ విసరాలని భావిస్తున్న పోలీసులు చివరికి.. అనారోగ్యంతో లొంగిపోవాలని చూస్తున్న ఓ మహిళా మావోయిస్టు నేతను ఎదురుకాల్పుల పేరిట మట్టుబెట్టి కలకలం సృష్టించేందుకు యత్నించారన్న వాదనలకే బలం చేకూరుతోంది. -
ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు/మల్కన్‌గిరి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు– మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాం డర్ మీనా మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు ఓ మిలీషియా సభ్యు డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 23న విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చాక మావోల కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్‌వోజీ, డీఓబీ జవాన్లతోపాటు ఆంధ్రా గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 7న ఏవోబీ పరిధిలోని సుంకి అటవీ ప్రాం తంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్‌ను కోరాపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసు లు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం తెల్లవారుజామున చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆండ్రపల్లి–బెజ్జంగి మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పంచాయతీ కేంద్రమైన ఆండ్రపల్లి సమీపంలో ఇరు వర్గాల మధ్య రెండు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు నిలిచిపోయినప్పటికీ పోలీసులు మాత్రం కాల్పులు కొనసాగించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్టు పార్టీ డిప్యూటీ దళ కమాండర్/డివిజన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న మీనా అలియాస్ జిలానీ బేగం అలియాస్ నిడిగొండ ప్రమీలగా నిర్ధారించారు. మృతురాలు మావోయిస్టు కీలక నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్యగా గుర్తించారు. కిడారి, సోమ జంట హత్య కేసులో మీనా 21 వ ముద్దాయిగా ఉన్నట్టుగా నిర్ధారించారు. గ్రామస్తుల అడ్డగింత మహిళా మావో మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న మావోలను గ్రేహౌండ్స్ పోలీసులు మల్కన్‌గిరికి తరలిస్తుండగా బెజ్జంగి జంక్షన్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆండ్రపల్లి, పనసపట్టు, జూడం పంచాయతీల్లోని 60 పల్లెలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా గిరిజనులు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. గ్రేహౌండ్స్ పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశా రు. పోలీసుల వాహనాలను వెంబడించారు. అదుపులో తీసుకున్నవారిని విడిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రేహౌండ్స్ దళాలను చుట్టుముట్టారు. రామగుడ ఎన్కౌంటర్, లివిటిపుట్టు ఘటనల తర్వాత ఆంధ్రా గ్రేహౌండ్స్ బలగాలే తమ ప్రాంతాల్లోకి వచ్చి గాలింపు చర్యల పేరిట తమను వేధిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లోకి చొరబడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అకారణంగా గ్రామస్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారని, సమాచారం చెప్పడం లేదంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుం దని భావించిన గ్రేహౌండ్స్ బలగాలు గాల్లో కాల్పులు జరిపాయి. దీంతో గిరిజనులు చెదురుమదురు కావడంతో పోలీసు వాహనాలు ముందుకు వెళ్లాయి. అగ్రనేతలు తప్పించుకున్నారు: విశాఖ ఎస్పీ ఏవోబీలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలని, ఆ రోజు ఆపరేషన్‌లో ఆమె కీలకంగా పాల్గొన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల ఘటన మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆమె మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న నలుగురిని అక్కడకు తరలించామని చెప్పారు. ఏవోబీలో నిరంతరాయంగా కూంబింగ్ చేస్తున్నామన్నారు. 50 ఘటనల్లో మీనా: మల్కన్‌గిరి ఎస్పీ మీనా గత 20 ఏళ్లుగా ఏవోబీలో డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తోందని మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా చెప్పారు. జిల్లాలోని రామగుడ ఎన్కౌంటర్, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ అపహరణ, ఇన్ఫార్మర్స్ నెపంతో హత్యలు ఇలా సుమారు 50 ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందన్నారు. మీనాపై ఆంధ్రా ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు. మల్కన్‌గిరికి తరలింపు ఘటనా స్థలంలో మహిళా మావోలు.. జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళా మావోయిస్టులూ కటాఫ్ ఏరియా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురితోపాటు మీనా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
ఆరుగురు మావోలు హతం చర్ల/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతిచెందారు. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన ఒక మావోను పోలీసులు అరెస్ట్ చేశారు. దంతెవాడ జిల్లా ఆరంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్రెంపారా గ్రామ సమీప అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా రిజర్వు పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. జవాన్లు దాడిని దీటుగా తిప్పికొట్టారు. గంటకుపైగా ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి ఆరుగురు మావోల మృతదేహాలను, ఒక ఏకే 47, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో ఒకరిని మలన్‌గిరి ఏరియా కమిటీ కార్యదర్శిగా, మరొకరిని ఆ కమిటీ సభ్యురాలిగా గుర్తించారు. నక్సల్స్ కాల్పుల్లో కానిస్టేబుళ్లు నిర్మల్ నేతమ్, సుక్రమ్ గాడ్వేలు చనిపోయారని తెలిపారు. గాయపడిన సబ్ ఇన్స్పెక్టర్లు డోగేందర్ పాల్ పాత్రో, సింగ్‌రాణా రాణా, కానిస్టేబుల్ ముకేష్ తట్టిలతోపాటు ఒక మావోయిస్టును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. -
లైంగికదాడులు భరించలేకే బయటకు
రాయగడ: సాటి మావోయిస్టుల వేధింపులు, వివక్ష భరించలేక ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయినట్లు ఒడిశాలోని రాయగడ ఎస్పీ కె.శివ సుబ్రహ్మణి బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నైమగిరి దళం బంటి గ్రూపులో సభ్యురాలిగా ఉన్న లక్ష్మి అలియాస్ రజిత, అలియాస్ రీణమల్లిక, అలియాస్ మితిడిక బుధవారం మధ్యాహ్నం ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈమె 2008 నుంచి 2010 వరకు గుమ్సారా డివిజన్లో సభ్యసాచిపండా వద్ద పని చేశారు. అనంతరం నైమగిరి దళంలోని బిక్సా అలియాస్ సునీల్‌ను వివాహం చేసుకుని అక్కడే దళ సభ్యురాలిగా చేరారు. లక్ష్మి స్వస్థలం గంజాం జిల్లా తరసింగి పోలిస్ స్టేషన్ పరిధిలోని పీటకియరి గ్రామం. తండ్రి సనియామాలిక్, తల్లి ప్రతిమా మలిక్. వివిధ దుర్ఘటనల్లో హస్తం లక్ష్మి గతంలో వివిధ దుర్ఘటనల్లో పాల్గొన్నారు. 2009లో గంజాం జిల్లా కొందమాల్ సరిహద్దులో కిరుబడి ఫైరింగ్, 2009లో దుర్లిబంద్ ఎక్సైజ్ ఫైర్, 2014లో రాయగడ జిల్లా దమనపంగ డీవీఎఫ్ పోలీసులు ఎదురు కాల్పులు, 2015లో రాయగడ జిల్లాలో సప్చంచడ కాల్పులు, 2016లో లంజిఘర్ స్టేషన్ పరిధి డొంగమట్టిలో కాల్పులు, 2016లో రాయగడ జిల్లా జర్ప గ్రామంలో ఎస్ఓజీ పోలీసులపై దాడి ఘటనల్లో అభియోగాలపై వివిధ పోలిస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ప్రాధాన్యం లేకే బయటకు.. లొంగిపోవడానికి గల కారణాలను లక్ష్మి వద్ద ప్రస్తావించగా.. వంట పనులు, గ్రామాల్లో జన నాట్యమండలి కార్యక్రమాలు వంటి ప్రాధాన్యం లేని పనులు చేయడం ఇష్టం లేకే లొంగిపోయినట్లు తెలిపారు. దళంలో ఒకప్పటిలా స్నేహపూర్వక వాతావరణం లేదని వాపోయారు. గర్భిణిగా ఉన్న సమయంలో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచారని ఆరోపించారు. బికాశ్ అలియాస్ సునీల్, బంటి గ్రూపు, సబ్యసాచిపండా వంటి మావోయిస్టు నాయకులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడడం తనకు విరక్తి కలిగించిందని వివరించారు. అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పేర్కొన్నారు. -
రాజధానిపై గురి
- మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు - కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అనుమానం - ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత ఆసరాగా ప్రజా మద్దతు పొందే ప్రయత్నాలు - అధికార పార్టీ ముఖ్యనేతలు, సోదరులకు హెచ్చరికలు పంపినట్టు వదంతులు రాజధాని ప్రాంతంపై మావోయిస్టులు దృష్టి సారించారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలను ఆరంభించారు. దీనిలోభాగంగానే మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ కొంతకాలం నుంచి రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు: జిల్లాలో రాజధాని ప్రకటన నుంచి భూ మాఫియా తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. అధికార పార్టీ ముఖ్యనేతల సోదరులు, తనయులు భూ దందాలకు పాల్పడుతూ అమాయకుల భూములను కబ్జా చేస్తున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతుండడంతో న్యాయం జరగక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్న బాధితులు వందల మంది ఉన్నారు. మరో వైపు ప్రభుత్వ శాఖలు సైతం అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములు కాజేయడంలో సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతోపాటు పోలీసు శాఖపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా భావించిన మావోయిస్టులు జిల్లాపై కొన్ని నెలలుగా దృష్టి సారించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే వర్షాభావ పరిస్థితు లు, రాజధాని నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు పనులు లేక అల్లాడిపోతున్నారు. కొన్నేళ్ళుగా ప్రజా మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ప్రస్తుత తరుణంలో తమకు కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని భావించి తమ కార్యకలాపాలను తిరిగి ఆరంభించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ, అలియాస్ పద్మ కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు గుర్తించని జిల్లా పోలీసులు ... ఇసుక, భూ మాఫియాలపై దృష్టి సారించిన మావోయిస్టు నేతలు ఇక్కడ సంచరిస్తున్నారనే సమాచారం జిల్లా పోలీసులకు అందలేదని చెబుతున్నారు. ఛత్తీస్గడ్ నుంచి హైదరాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన సమాచారం మేరకు రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, అలియాస్ పద్మను హైదరాబాద్ ఎస్ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సోదరులు, తనయులకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయనే వదంతుల నేపథ్యంలో అరుణను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇసుక, భూ మాఫియాలకు హెచ్చరికలు ... జిల్లాలో భూ దందాలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడితోపాటు, భూ మాఫియాకు మావోయిస్టుల నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు మావోయిస్టులు దృష్టికి వచ్చిం దంటున్నారు. ఈ తరుణంలో జిల్లాలో ప్రవేశిస్తే తమకు కొన్ని వర్గాల నుంచి అయినా మద్దతు లభిస్తుందని భావించి మావోయిస్టులు ఇక్కడ సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే సోదరుడు, ఓ జెడ్పీటీసీ భర్తతోపాటు మరికొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొడుతున్నారని తెలుసుకుని వారికి హెచ్చరికట్లు పంపినట్లు సమాచారం. -
రాలిన తారలు
ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు జిల్లా వాసులు మడగూడెంలో సారక్క అంత్యక్రియలు నేడు పైడిపల్లికి చేరనున్న సృజన మృతదేహం వరంగల్/ కొత్తగూడ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మావోరుుస్టులు మృతిచెందారు. వీరిని కొత్తగూడ మండలం మడగూడేనికి చెందిన దనసరి సారక్క అలియూస్ అనిత, హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజనగా గుర్తించారు. మావోరుుస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియూస్ హరిభూషణ్ స్వగ్రామం మడగూడెంకు చెందిన సారక్క యేడాది క్రితమే దళంలో చేరింది. కొద్దిరోజులు కొత్తగూడ ఏరియా దళ కమాండర్ భద్రు దళంలో పనిచేసి, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి బదిలీ అయింది. ఉద్యమంలో ఓనమాలు నేర్చుకునే క్రమంలోనే రాష్ట్ర సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. మృతదేహాన్ని భద్రాచలం ఆస్పత్రి మార్చురీ నుంచి మడగూడెం గ్రామానికి తరలించి బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ, పద్మకుమారి, శాంతమ్మ, సత్యజ్యోతి, భారతి, విమల, డప్పు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు ప్రభాకరన్న, బూర్క చిన్నవెంకటయ్య, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క తదితరులు సారక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఇంటర్ చదువుతూనే ఉద్యమంలోకి.. హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజన(26) 2006 లో సీకేఎం కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడే మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై ఏపీసీఎల్సీలో చేరింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అరెస్టు అయి కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత 2007లో అజ్ఞాతంలోకి వెళ్లిన సృజన అప్పటి నుంచి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కొత్తకొండ భీమయ్య, శాంత తెలిపారు. సృజన తల్లి శాంత మావోయిస్టు బంధుమిత్రుల కమిటీలో సభ్యురాలు. మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లా కమిటీలో సభ్యురాలైన సృజన అలియాస్ కుమెన్ అలియాస్ రాగో అలియాస్ నవత పేర్లతో పని చేసినట్లు తెలిసింది. ఆమెపై ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున సృజన మృతదేహం పైడిపల్లికి వస్తుందని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మేనమామ బాటలోనే.. జిల్లాలో నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ అరుున పైడిపల్లికి చెందిన పీపుల్స్‌వార్ నేత, దివంగత జున్ను చిన్నాలుకు కొత్తకొండ సృజన స్వయూనా మేనకోడలు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పీపుల్స్‌వార్‌లో చేరిన చిన్నాలు 1979లో మృతిచెందారు. ఆయన చెల్లెలు శాంత రెండవ కూతరు సృజన విప్లవ భావాలు పుణికి పుచ్చుకుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి నిషేధం ఎత్తివేయడంతో పౌరహక్కుల సంఘం నేతలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఏపీసీఎల్సీ నేతలతో 2006 డిసెంబర్లో కొత్తగూడెంలో అరెస్టు అరుు కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. విడుదలయ్యూక సుమారు ఆరు నెలల పాటు ఇంటి వద్దనే ఉంది. 2007లో అజ్ఞాతంలోకి వెళ్లి ఇక తిరిగి రాలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన సృజన మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. -
కీలక మహిళా మావోయిస్టు అరెస్టు
రాయ్‌పూర్: ఛత్తీస్గడ్ పోలీసులు గురువారం కీలక మహిళా మావోయిస్టును అరెస్టు చేశారు. ఆమెపై రూ.మూడు లక్షల రివార్డు కూడా ఉంది. దంతెవాడ జిల్లాలోని దుర్లి గ్రామంలో ఆమెను అదుపులోకి తీసుకున్నామని, మావోయిస్టు కేడర్‌లో ఆమె ఎక్కువ ప్రభావం చూపగల మహిళ అని పోలీసులు తెలిపారు. దుర్లి ప్రాంతానికి కీలక మహిళా మావోయిస్టు సోమ్లీ తేలం(27) కొన్ని పనుల నిమిత్తం వస్తుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడికి వెళ్లి మాటు వేశారు. ఆమె వచ్చిందని తెలుసుకున్న వెంటనే ఆ గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టి సోమ్లీని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై దోపిడీ, హత్య, దాడులు వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే చాలా కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.