ఆమెను ముందే అదుపులోకి తీసుకున్నారా? | Woman Maoist Meen Killed in Alleged Encounter | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పులా.. ఎత్తుకుపోయి కాల్చారా?

Published Sat, Oct 13 2018 10:45 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

Woman Maoist Meen Killed in Alleged Encounter - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పోలీసులు–మావోల ఎదురుకాల్పుల ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు నేత మీనా అలియాస్‌ జిలానీ మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది కీలక నేతలు తప్పించుకున్నారని చెబుతున్న పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్‌ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపాక పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. రెండేళ్ల కిందట రామగుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏవోబీలో మావోలను చావు దెబ్బతీశామని భావిస్తున్న పోలీసులకు లివిటిపుట్టు ఘటన కోలుకోలేని షాక్‌నిచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతూ వస్తున్నారు. (చదవండి: ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ)

మావోయిస్టులు పోలీసుల కూంబింగ్‌ను లెక్కచేయకుండా ఏవోబీలోనే ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. ఒడిశాలోని జన్‌బై వద్ద నిర్మిస్తున్న గురుప్రియ వంతెనను వ్యతిరేకిస్తూ ఈనెల 2న ఏవోబీలోనే భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత 7న సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు, దళ సభ్యులు సమావేశం కాగా పోలీసులు కాల్పులు జరిపారు. కూంబింగ్‌ను కూడా లెక్క చేయకుండా మావోలు ఏవోబీలోనే మకాం వేయడం, కటాఫ్‌ ఏరియాలోని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ పోలీసులు వెళ్లలేకపోవడం, లివిటిపుట్టు ఘటన జరిగి దాదాపు మూడు వారాలవుతున్నా పోలీసుల అదుపులోకి పరిస్థితులు రాకపోవడం వెరసి వ్యూహాత్మకంగానే పోలీసులు ఎదురుకాల్పుల ఘటనను సృష్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మీనాను ముందే అదుపులోకి తీసుకున్నారా?
ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్య మీనా అలియాస్‌ జిలానీ కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యమానికి దూరంగానే ఉన్నారని చెబుతున్నారు. లివిటిపుట్టు ఆపరేషన్‌లో ఆమె పాల్గొన్నారా.. లేరా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పోలీసులు ఆమెను కిడారి, సివేరిల హత్య కేసులో 21వ నిందితురాలిగా చూపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా మీనా మల్కన్‌గిరి జిల్లాలోని ఆండ్రపల్లిలో తలదాచుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఆండ్రపల్లిని గురువారం రాత్రే ముట్టడించారని తెలుస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనారోగ్యంతో ఉన్న తాను లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పినా.. ఎన్‌కౌంటర్‌ చేసి ఎదురుకాల్పుల కథ సృష్టించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు జయంతి అలియాస్‌ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్‌ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్‌ కర్మ నెల రోజులుగా ఇదే గ్రామంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్నెన్నో అనుమానాలు?
ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్న మీనా మృతదేహాన్ని మీడియాకు, గ్రామస్తులకు పోలీసులు చూపించలేదు. గ్రామస్తులు చుట్టుముట్టినా మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం తెల్లవారుజామున మొత్తం ఏడుసార్లు మాత్రమే కాల్పుల శబ్దం వినపడిందని, ఎదురుకాల్పుల ఘటనల్లో లెక్కకు మించి కాల్పుల శబ్దాలు వస్తాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఘటన జరిగిన ఆండ్రపల్లి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనిది కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కిడారి హత్య దరిమిలా మూడు వారాలుగా మావోయిస్టులకు సవాల్‌ విసరాలని భావిస్తున్న పోలీసులు చివరికి.. అనారోగ్యంతో లొంగిపోవాలని చూస్తున్న ఓ మహిళా మావోయిస్టు నేతను ఎదురుకాల్పుల పేరిట మట్టుబెట్టి కలకలం సృష్టించేందుకు యత్నించారన్న వాదనలకే బలం చేకూరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement