ఆపరేషన్ ఆర్కేలో మైండ్‌గేమ్ ఎవరిది?
అభిప్రాయం
ప్రజల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనల విషయంలో తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు.
మనుషుల స్వభావాలు, ఉద్దే శాల గురించి ప్రస్తావించడానికి జంతువుల పోలిక తీసుకురావడం చిరకాలంగా ఉన్నదే. ప్రపంచ సాహిత్యం నిండా ఇది కని పిస్తుంది. మన పంచతంత్రం కథలు అందుకు మంచి ఉదా హరణ. వర్గ సమాజంలో మను షుల స్వభావాలు వాళ్ల ప్రయోజ నాల వల్ల, వాళ్ల స్వార్థం వల్ల మారిపోతూ ఉంటాయి. కానీ జంతువుల సహజాతాలు మనుషుల సంపర్కంలోకి వస్తే తప్ప మారిపోయే అవకాశం లేదు. తొండ ముదిరి ఊసర వెల్లి కావడం, రంగులు మార్చడం, గొంగడి పురుగు సీతా కోక చిలుకగా మారటం ప్రకృతి సిద్ధ్ధమైన పరిణామాలు, సహజాతాలు. ఇందులో మంచి, చెడు అని అనేది ఏమీ లేదు. ఇది ఒక పరిణామం. వర్గసమాజంలోని మానవు లకు ఇటువంటి పోలిక తేవడానికి వీల్లేదు.
ఏజెన్సీలో ‘ఊసరవెల్లి’ పేరుతో వెలసిన ఈ పోస్టర్ల సందర్భమే చూద్దాం. ప్రచురించినది ప్రగతిశీల ఆదివాసీ యువత - ఏ తొండ ఊసరవెల్లిగా మారిన రూపానికి ఇది మారుపేరు? ఇది ఆంధ్ర ఎస్‌ఐబీ తొండ ముదిరిన ఊస రవెల్లి రూపమా? లేక చంద్రబాబు రాజ్యాంగ యంత్ర ఊసరవెల్లి రూపమా? పదహారేళ్లుగా జల్-జంగల్-జమీన్ కోసం, ప్రాదేశిక హక్కుల కోసం గ్రామ విప్లవ అధికారాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలపై, వాళ్ల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనలపై తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. ఈ రంగులు మార్చడం పాలక వర్గాలకు సహజమే.
రామ్‌ఘడ్ ఎన్‌కౌంటర్ గురించి నేను అక్టోబర్ 24 నుంచి ఇస్తూ వస్తున్న ప్రకటనలే నిర్దిష్టంగా చూద్దాం. అక్టో బర్ 24వ తేదీ అంతా ఆంధ్రా డీజీపీ దాన్ని ‘ఆపరేషన్ ఆర్కే’ అన్నాడు. ఆర్కే గాయపడి పోలీసుల అదుపులోనే ఉండే అవకాశం ఉందని, సీఆర్‌బి, తెలంగాణ పార్టీ భావిం చినందువల్ల తెలుసుకునే ప్రయత్నం చేశాను. తమ అదు పులో లేడని పోలీసు అధికారులు ప్రొ. హరగోపాల్‌కు, బాధ్యత గల వారికి చెప్పినప్పుడు అదుపులో లేకపోవచ్చు గానీ, వాళ్ల నిఘాలో ఉండే అవకాశం ఉందని చెప్పాను. నేను వాడిన మాట ‘పోలీసుల నిఘా’, ‘విసినిటి’, అంటే వాళ్ల కనుసన్నల్లో ఉండే ప్రాంతం అనే అర్థంలో. వదంతులు, ప్రచారాలు చాలా జరిగాయి. విషాహారం పెట్టారని, ఆహారంలో మత్తు మందు చల్లారని వంటివి. ఆర్కే గాయపడడమే కాదు అట్లా పోలీసుల చేతుల్లో పడ్డా డని కూడా. అప్పటికే తన కొడుకు పృథ్వీ (మున్నా)ను ఈ ఎన్‌కౌంటర్‌లో కోల్పోయి, మృతదేహాన్ని తీసుకువెళ్లిన కన్న తల్లి శిరీష ఈ ప్రచారాలతో, ఈ ప్రకటనతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆర్కే తమ అదుపులో ఉంటే కోర్టులో హాజరు పరచాలని కోరింది.
పోలీసుల నిఘావరణలో, వాళ్ల నిఘా కనుసన్నల్లో ఉండే అవకాశం ఉందనే మాట వాడాను తప్ప, వాళ్ల అదుపులో ఉన్నాడని గానీ, వాళ్లు చిత్రహింసలు పెడుతున్నారని గానీ నేను ఏ సందర్భంలో కూడా ఆరోపించలేదు. అదు పులో ఉండటం అంటే ఎన్‌కౌంటర్ చేయడమే అని నాకు తెలుసు. ఇంత పెద్ద సంఘటనలో ఆర్కే అదుపులో ఉన్నా డని అనుమానించడానికి, ఆందోళన చెందడానికి ఆస్కారం ఉంది గనుక కోర్టు ఈ ఆరోపణను విచారించడానికి ఏదైనా చట్టబద్ధమైన ఆధారాన్ని చూపండని హైకోర్టులో న్యాయ మూర్తులు కూడా అన్నప్పుడు మాత్రమే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ నన్ను సంప్రదించి అందుకు రెండు వారాల సమయం తీసుకున్నారు. ఆ రాత్రే ఆర్కే క్షేమం అని తెలియడం వల్ల ఇంక ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొల గించాలని వెంటనే మీడియాకు ‘ఆర్కే క్షేమం’ అని తెలి పాను. పోలీసు దిగ్బంధంలో చిక్కుకుపోయిన మేం ప్రజ లకు చెప్పడంలో కొంత ఆలస్యం జరిగింది అంటూ ఏఓబీ కార్యదర్శి జగబంధు చేసిన ప్రకటనబట్టి కూడా.. పోలీసు దిగ్బంధం అంటే పోలీసుల అదుపులో అన్నట్లే కదా.
మనుషులు పోలీసు యంత్రాంగంగా, ప్రభుత్వంగా మారినప్పుడు వాస్తవాలను చెప్పే బాధ్యత నిర్వహించడం లేదన్నదే నేను ఈ మైండ్ గేమ్ ఆడుతున్న రాజ్యంపై 1969 నుంచి కూడా చేస్తున్న ఆరోపణ. ఈ సందర్భంగా ఏ పాపం ఎరుగని ఊసరవెల్లి లాంటి ప్రాణుల పోలిక తేవడం మరొక నేరమని నేను ఆరోపించదల్చుకున్నాను. నాకు ఊసరవెల్లి పోలిక తీసుకువచ్చారు గానీ ఈ ఆరో పణ చేస్తున్న వాళ్లకు (వాళ్లెవరైనా సరే అది రాజ్య ప్రాయోజి తమైందని నేను భావిస్తున్నాను) నేను మ్యాకవెల్లి పోలిక చెప్పదల్చుకున్నాను. మన దేశంలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన రోజులలో, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తనను మెకాలే అంటున్నాం. వర్శిటీల ఏర్పాటుకు ఈ దేశ బుద్ధిజీవుల భావాలను వలసీకరించాలనే ప్రయత్నాలకూ ఈయననే వ్యూహకర్త అని చెపుతారు.
మన దేశంలో గిరీశం వంటి ఆషాడభూతులు తయారు కావడానికి ఇటువంటి మ్యాకవెల్లిల ఆలోచనలే మూలం. ప్రపంచ బ్యాంక్ సీఈఓలు.. ప్రజలు ఎన్నుకుంటున్న ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం మనకు మ్యాకవెల్లి, గిరీశాల పోలికలు రోజూ తటస్థిస్తూనే ఉంటాయి. కనుక ఇకనైనా మనుషుల భాషలో మాట్లాడుకుందాం. మనకు అర్థం కాని భాష మాట్లాడి, మన భాష అర్థం కాని ప్రాణు లను వాటి మానాన వాటిని వదిలేద్దాం. తాను పొత్తు పెట్టు కున్న బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జంతు ప్రేమికు రాలు మేనకా గాంధీ గురించైనా ఈ సూచనను చంద్రబాబు నాయుడు పాటిస్తాడని ఆశిస్తాను.
వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు