రాజధానిపై గురి
- మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అనుమానం
- ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత ఆసరాగా ప్రజా మద్దతు పొందే ప్రయత్నాలు
- అధికార పార్టీ ముఖ్యనేతలు, సోదరులకు హెచ్చరికలు పంపినట్టు వదంతులు
రాజధాని ప్రాంతంపై మావోయిస్టులు దృష్టి సారించారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలను ఆరంభించారు. దీనిలోభాగంగానే మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ కొంతకాలం నుంచి రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు: జిల్లాలో రాజధాని ప్రకటన నుంచి భూ మాఫియా తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. అధికార పార్టీ ముఖ్యనేతల సోదరులు, తనయులు భూ దందాలకు పాల్పడుతూ అమాయకుల భూములను కబ్జా చేస్తున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతుండడంతో న్యాయం జరగక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్న బాధితులు వందల మంది ఉన్నారు. మరో వైపు ప్రభుత్వ శాఖలు సైతం అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములు కాజేయడంలో సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతోపాటు పోలీసు శాఖపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా భావించిన మావోయిస్టులు జిల్లాపై కొన్ని నెలలుగా దృష్టి సారించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే వర్షాభావ పరిస్థితు లు, రాజధాని నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు పనులు లేక అల్లాడిపోతున్నారు. కొన్నేళ్ళుగా ప్రజా మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ప్రస్తుత తరుణంలో తమకు కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని భావించి తమ కార్యకలాపాలను తిరిగి ఆరంభించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ, అలియాస్ పద్మ కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టుల కదలికలు గుర్తించని జిల్లా పోలీసులు ...
ఇసుక, భూ మాఫియాలపై దృష్టి సారించిన మావోయిస్టు నేతలు ఇక్కడ సంచరిస్తున్నారనే సమాచారం జిల్లా పోలీసులకు అందలేదని చెబుతున్నారు. ఛత్తీస్‌గడ్ నుంచి హైదరాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన సమాచారం మేరకు రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, అలియాస్ పద్మను హైదరాబాద్ ఎస్‌ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సోదరులు, తనయులకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయనే వదంతుల నేపథ్యంలో అరుణను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలిసింది.
ఇసుక, భూ మాఫియాలకు హెచ్చరికలు ...
జిల్లాలో భూ దందాలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడితోపాటు, భూ మాఫియాకు మావోయిస్టుల నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు మావోయిస్టులు దృష్టికి వచ్చిం దంటున్నారు. ఈ తరుణంలో జిల్లాలో ప్రవేశిస్తే తమకు కొన్ని వర్గాల నుంచి అయినా మద్దతు లభిస్తుందని భావించి మావోయిస్టులు ఇక్కడ సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే సోదరుడు, ఓ జెడ్పీటీసీ భర్తతోపాటు మరికొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొడుతున్నారని తెలుసుకుని వారికి హెచ్చరికట్లు పంపినట్లు సమాచారం.