లైంగికదాడులు భరించలేకే బయటకు
రాయగడ: సాటి మావోయిస్టుల వేధింపులు, వివక్ష భరించలేక ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయినట్లు ఒడిశాలోని రాయగడ ఎస్పీ కె.శివ సుబ్రహ్మణి బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నైమగిరి దళం బంటి గ్రూపులో సభ్యురాలిగా ఉన్న లక్ష్మి అలియాస్ రజిత, అలియాస్ రీణమల్లిక, అలియాస్ మితిడిక బుధవారం మధ్యాహ్నం ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈమె 2008 నుంచి 2010 వరకు గుమ్సారా డివిజన్‌లో సభ్యసాచిపండా వద్ద పని చేశారు. అనంతరం నైమగిరి దళంలోని బిక్సా అలియాస్ సునీల్‌ను వివాహం చేసుకుని అక్కడే దళ సభ్యురాలిగా చేరారు. లక్ష్మి స్వస్థలం గంజాం జిల్లా తరసింగి పోలిస్ స్టేషన్ పరిధిలోని పీటకియరి గ్రామం. తండ్రి సనియామాలిక్, తల్లి ప్రతిమా మలిక్.
వివిధ దుర్ఘటనల్లో హస్తం
లక్ష్మి గతంలో వివిధ దుర్ఘటనల్లో పాల్గొన్నారు. 2009లో గంజాం జిల్లా కొందమాల్ సరిహద్దులో కిరుబడి ఫైరింగ్, 2009లో దుర్లిబంద్ ఎక్సైజ్ ఫైర్, 2014లో రాయగడ జిల్లా దమనపంగ డీవీఎఫ్ పోలీసులు ఎదురు కాల్పులు, 2015లో రాయగడ జిల్లాలో సప్‌చంచడ కాల్పులు, 2016లో లంజిఘర్ స్టేషన్ పరిధి డొంగమట్టిలో కాల్పులు, 2016లో రాయగడ జిల్లా జర్ప గ్రామంలో ఎస్‌ఓజీ పోలీసులపై దాడి ఘటనల్లో అభియోగాలపై వివిధ పోలిస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
ప్రాధాన్యం లేకే బయటకు..
లొంగిపోవడానికి గల కారణాలను లక్ష్మి వద్ద ప్రస్తావించగా.. వంట పనులు, గ్రామాల్లో జన నాట్యమండలి కార్యక్రమాలు వంటి ప్రాధాన్యం లేని పనులు చేయడం ఇష్టం లేకే లొంగిపోయినట్లు తెలిపారు. దళంలో ఒకప్పటిలా స్నేహపూర్వక వాతావరణం లేదని వాపోయారు. గర్భిణిగా ఉన్న సమయంలో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచారని ఆరోపించారు. బికాశ్ అలియాస్ సునీల్, బంటి గ్రూపు, సబ్యసాచిపండా వంటి మావోయిస్టు నాయకులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడడం తనకు విరక్తి కలిగించిందని వివరించారు. అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పేర్కొన్నారు.