ఇక మహిళలపైనా లైంగిక వేధింపుల ఫిర్యాదులు | UGC notifies new rules - male students can now lodge sexual harassment complaints | Sakshi
Sakshi News home page

ఇక మహిళలపైనా లైంగిక వేధింపుల ఫిర్యాదులు

Published Tue, Jun 7 2016 3:25 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

ఇక మహిళలపైనా లైంగిక వేధింపుల ఫిర్యాదులు - Sakshi

ఇక మహిళలపైనా లైంగిక వేధింపుల ఫిర్యాదులు

న్యూడిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో మహిళలు,  ట్రాన్స్‌జెండర్లు లైంగికంగా వేధించినట్లయితే వారిపై మగవాళ్లు (విద్యార్థులు, అధ్యాపకులు) సంబంధిత అధికారులకు ఇక నుంచి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇటీవల నోటిఫై చేసింది. బాధితులు లేదా వారి తరఫున మూడో పార్టీ, అంటే బంధువులు, స్నేహితులు, సహచరులు సంఘటన జరిగిన మూడు నెలల్లోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితులు అనారోగ్యానికి గురైన సందర్భాల్లో మాత్రం మూడు నెలల తర్వాత కూడా ఫిర్యాదును అనుమతిస్తారు.

ఈ లైంగిక ఫిర్యాదులను విచారించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలు తమకు అందిన ఫిర్యాదులపై మూడు నెలల లోపల దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక ఆధారంగా నేరం చేసిన విద్యార్థిని, విద్యార్థులను సంబంధిత కాలేజీ లేదా యూనివర్శిటీ నుంచి సస్పెండ్‌ చేస్తారు.

అధ్యాపకులు నేరానికి పాల్పడిన పక్షంలో సర్వీసు నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. తమను ఆడవాళ్లు వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువైన నేపథ్యంలో యూజీసీ ఈ తాజా మార్గదర్శకాలను రూపొందించి నోటిఫై చేసింది. 2007లో మొదటి సారి ఇలాంటి రెండు ఫిర్యాదులు ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో దాఖలయ్యాయి. రామ్‌జాస్‌ కాలేజీలో ఓ మహిళా టీచరు తమను లైంగికంగా వేధిస్తోందంటూ ఇద్దరు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement