ఉద్యోగినులకు రక్ష..లైంగిక వేధింపుల నిరోధక చట్టం
విశాఖపట్నం: పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వృత్తులు చేసుకోకపోతే కుటుంబాలు సాఫీగా నడవని నేటికాలంలో మహిళా ఉద్యోగులకు వారు పనిచేసే ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు అడ్డుగోడలా నిలుస్తున్నాయి. దేశంలోని మహిళా సంఘాల ఐక్య ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2010 డిసెంబర్ 7న ‘మహిళా ఉద్యోగులపై పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు’ను ప్రతిపాదించింది. 2013లో పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 2013 డిసెంబర్ 9 నుంచి ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వచ్చింది. ఉద్యోగినులకు విధులు నిర్వహించే చోట భరోసా ఇచ్చే ఈ లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి తెలుసుకుందాం.
చట్టంలోని ముఖ్యాంశాలు లైంగిక వేధింపులంటే..?
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా లైంగిక వేధింపులు అనే పదానికి నిర్వచనం ఈ చట్టంలో పొందుపరిచారు. శారీరక సంబంధం, లైంగిక చర్యలకోసం ఒత్తిడి, లేదా బతిమాలడం(విన్నపం), అసభ్య ద్వంద్వార్థాల వ్యాఖ్యానాలు, అశ్లీల చిత్రాలు చూపించడం లేదా వారి సెల్‌ఫోన్లకు పంపించడం వంటివన్నీ లైంగిక వేధింపులుగానే పరిగణిస్తారు.
చట్టం పరిధిలోకి ఎవరొస్తారు
ప్రభుత్వ/ప్రైవేట్ కార్యాలయాల్లోని ఉద్యోగినులకే కాకుండా ఆస్పత్రులు/ కార్యాలయాలకు వచ్చే మహిళలు, ఫిర్యాదుదారులు, దినసరి వేతనాల మహిళలు, వివిధ శిక్షణల నిమిత్తం హాజరైన మహిళలు, తోటి ఉద్యోగులతో ప్రయణిస్తున్న సమయంలో, క్రీడా పోటీలకు వచ్చిన మహిళలు, కార్యాలయాలు/ఇంట్లో పనిచేసే మహిళల్లో ఏ వయసువారైనా ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది.
కార్యాలయంలో కమిటీలు ఇలా..
ప్రతి ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయం, సంస్థల్లో మహిళా ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం సభ్యుల్లో సగంమంది మహిళలతో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ అంతర్గత కమిటీ జిల్లా కమిటీలో ఓ భాగంగా పనిచేయాలి.పదిమంది కన్నా తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, కార్యాలయాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అసాధ్యం. అందువల్ల జిల్లాస్థాయిలో సంబంధిత జిల్లా అధికారి ఈ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలి.జిల్లా కమిటీల్లో సీనియర్ ఉద్యోగిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసుకోవాలి. సీనియర్ ఉద్యోగిని ముందుకు రాని పక్షంలో ఆసక్తిగల వారిని అందరి సమ్మతితో ఎంపిక చేసుకోవాలి. మహిళలకోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు చెందినవారిని కూడా చైర్‌పర్సన్‌గా, సభ్యుల్లో ఇద్దరిని నియమించుకోవచ్చు.
ఈ ఫిర్యాదుల కమిటీ బాధితురాలికి అన్ని విధాలా సహకరిస్తూ అండగా నిలుస్తుంది. ఈ అంతర్గత కమిటీ ఫిర్యాదు అందిన 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి.కమిటీ చేసిన సిఫార్సుల అమలుకోసం సంబంధిత కార్యాలయ అధికారికి, సంస్థ యజమానికి జిల్లా అధికారి 60 రోజుల సమయం ఇవ్వాలి.విచారణ జరుగుతున్న కాలంలో ఫిర్యాదుచేసిన మహిళను బెదిరించే, ప్రలోభపెట్టే అవకాశాలుంటాయి. అందువల్ల ఆమె స్వచ్ఛందంగా సెలవు కోరితే సంబంధిత అధికారి, యాజమాన్యం 60 రోజుల వరకూ సెలవు మంజూరు చేయాలి. సంబంధిత శాఖ యాజమాన్యం ఫిర్యాదుల కమిటీని వేయడంలో విఫలమైతే ఆ సంస్థ యాజమాన్యంపై, సంబంధిత అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
కార్యాలయ అధికారి, సంస్థ యాజయాన్య విధులు
మహిళలు సురక్షితమైన వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాలి.అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సంబంధించిన నోటీసు బోర్డును అందరికీ కనిపించే ప్రదేశంలోప్రదర్శించాలి.ఉద్యోగులకు ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.ఫిర్యాదుల కమిటీలకు సదుపాయాలు కల్పించడంతోపాటు సాక్షుల హాజరుకు సహకరించాలి. బాధిత మహిళ ఐపీసీ కింద కేసు పెట్టదలుచుకుంటే పూర్తిగా సహాయపడాలి.
తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు
సదరు తోటి ఉద్యోగి లేదా యజమానిపై ఫిర్యాదురాలు ఉద్దేశపూరకంగా లేదా తప్పుడు ఫిర్యాదు చేసినట్టు, తప్పుడు సాక్ష్యాలు, ధ్రువపత్రాలు సమర్పించినట్టు విచారణలో బహిర్గతమైతే సంబంధిత మహిళపై, ఆ సాక్షులపై ఈ చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.