ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు?
ఈక్వాలిటీ అంటే ఇదేనా?
రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి.
మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి.
- ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్
మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది!
‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది.
– ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ
మాట వెనక్కి తీసుకోవాలి!
ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి.
ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్
ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్‌లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా
Comments
Please login to add a commentAdd a comment