చింతూరు మండలంలో వాహనాన్ని సోదాలు చేస్తున్న పోలీసులు (అంతరచిత్రం) జనుమూరి శ్రీను (ఫైల్)
తూర్పుగోదావరి, అడ్డతీగల (రంపచోడవరం): అరకులో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యాకాండలో కీలకపాత్ర వహించింది అడ్డతీగల మండలం దబ్బపాలేనికి చెందిన జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో అని విశాఖ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో తూర్పు మన్యంలో కలకలం మొదలైంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో దర్యాప్తును విస్తృతం చేసిన పోలీసు అధికారులు ముగ్గురు మావోయిస్టులు ఈ హత్యాకాండలో కీలకపాత్ర వహించినట్లు పేర్లు, ఫొటోలను విడుదల చేశారు.
హత్యల్లో ప్రత్యక్ష పాత్ర ఉందంటూ విడుదల చేసిన తొలి జాబితాలోనే జనుమూరి శ్రీనుబాబు పేరు చోటు చేసుకోవడంతో మన్యంలో వాతావరణం వేడెక్కింది. పేర్లు ప్రకటించిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు కావడంతో శ్రీను ఈ ఆపరేషన్‌కి నాయకత్వం వహించాడనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేరకు పోలీసుశాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందంటున్నారు.
అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీలోని దబ్బపాలెం మూడో వీధికి చెందిన సోమయ్య, పాపాయ్యమ్మల కుమారుడు శ్రీను. ముగ్గురు సోదరులు, ఒక సోదరి కాగా శ్రీను మరో సోదరుడు వెంకటేశులు ఆలియాస్ ఆనంద్ కూడా మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ 2016లో విశాఖ జిల్లా మర్రిపాకలు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైన శ్రీను 1998 నుంచి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నాడు.
గతంలో బలిమెల వద్ద పోలీసులపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడితో పాటు మరికొన్ని హింసాత్మక ఘటనల్లో కీలకంగా వ్యహరించిన శ్రీనుబాబుపై పలు కేసులు నమోదైనట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలోని తూర్పు డివిజన్‌తో పాటు ఒడిశా మల్కన్‌గిరి డివిజన్‌లో శ్రీనుబాబు కీలకంగా వ్యవహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనుబాబు దబ్బపాలెంలోనే ప్రాథమిక విద్యాభాస్యం చేసిన అనంతరం చదువు మానేశాడు. శ్రీను మరో సోదరుడు వీరవరం సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు.
‘ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు’
చింతూరు (రంపచోడవరం): ఓ వైపు అరకు ఘటన.. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా అరకులో ప్రజా ప్రతినిధులను హతమార్చిన మావోయిస్టులు దండకారణ్య సరిహద్దుల్లో కూడా అలాంటి ఘటనలకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు చింతూరు, ఎటపాక సర్కిల్ పరిధిలోని డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ప్రధాన రహదారుల వెంబడి వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానితులను పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి విడిచి పెడుతున్నారు. దీంతోపాటు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న కల్వర్టులను కూడా బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరకు ఘటన అనంతరం దండకారణ్యంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలతో అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధానంగా ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం, చర్ల, గొల్లపల్లి, కిష్టారం, కుంట, ఏడుగురాళ్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతున్నారు. త్వరలోనే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ప్రచారం కోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
టార్గెట్‌లకు నోటీసులు
అరకు ఘటన నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో పాటు మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నందున మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అత్యవసర పనులపై వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో సూచించారు.
విస్తృత తనిఖీలు..మరో వైపు కూంబింగ్
పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మావోయిస్టుల హత్యాకాండ నేపథ్యంలో తూర్పున ప్రధాన రహదారుల వెంబడి కూడళ్లలో పోలీసులు వాహన తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధవాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment