రైను (ఫైల్) , స్వరూప (ఫైల్)
సాక్షి, అమరావతి/ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలో మావోయిస్టులు రైను, స్వరూప ఉన్నారా? లేదా అనేదానిపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని జంత్రి వద్ద 2016, అక్టోబర్ 24న జరిగిన కోవర్టు దాడిలో రైను, స్వరూపలతోపాటు 27మంది కామ్రేడ్స్ అమరులయ్యారంటూ 2016, అక్టోబర్ 26న సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం రైను, స్వరూపలు ఈ నెల 23న లివిటిపుట్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని వారి ఫొటోలతో సహా అధికారిక ప్రకటన చేశారు. అటు జగన్ ప్రకటన, ఇటు పోలీసుల ప్రకటన అయోమయానికి గురిచేసేలా ఉండటం గమనార్హం. హత్యల్లో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు.
వారిలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి అలియాస్ చంద్రి అలియాస్ రింకీ, తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెంకు చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైను, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణల ఫొటోలు, వివరాలతో సహా పోలీసులు విడుదల చేశారు. 2016లో మావోయిస్టు జగన్.. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 27 మంది కామ్రేడ్స్‌ను కోల్పోయామని వారి పేర్లతో సహా ప్రకటించారు. వీరిలో స్వరూప, రైను కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారో? లేదో? పోలీసులు లేదా మావోయిస్టులైనా నిర్ధారించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment