విశాఖపట్నం, పాడేరు: మావోయిస్టుల చేతిలో హతమైన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ కుటుంబాల్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పాడేరులో కిడారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమన్నారు. తమ ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రజల్లో అశాంతిని తొలగించి, శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యాలను, లోపాల్ని గుర్తించేందుకు విచారణ చేపడతామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుల్ని కోల్పోవడం పార్టీకి, ప్రజలకు నష్టమన్నారు. ఈ లోటు తీర్చలేదని అన్నారు. పార్టీ పరంగా ఆయా కుటుంబాలను ఆదుకోడానికి సీఎంతో చర్చిస్తామన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే తమ సిద్ధాంతమని చెప్పుకునే మావోయిస్టులు వారి కోసం పనిచేస్తున్న నాయకుల్ని హతమార్చడం ఏమి సిద్ధాంతమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీనిని ఖండించాలన్నారు. వీరి అంత్యక్రియలు జరిగిన చోట స్థూపాల్ని నిర్మించి, స్మృతి వనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కిడారి,సీవేరి సోమల కుటుంబాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు.
సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి ఆహర్నిశలు పాటుపడుతున్న కిడారిని మావోయిస్టులు హతమార్చడం బాధకరమని అన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్.జవహర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం పనిచేస్తున్న నాయకుల్ని చంపడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రజలే తీర్పు ఇస్తారని, దీనిపై పౌరహక్కుల సంఘాలు కూడా స్పందించాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
స్వచ్ఛంద బంద్
పాడేరు: కిడారి మృతికి సంతాపంగా పాడేరుతోపాటు మన్యంలోని అన్ని ప్రాంతాల వర్తకులు తమ దుకాణాలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగే వరకు పాడేరులో బంద్ వాతావరణం ఏర్పడింది. పట్టణ ప్రజలంతా కిడారి పార్థ్దివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
ప్రముఖుల నివాళి..
మావోయిస్టు కాల్పుల్లో మృతి చెందిన తమ అభిమాన నేత కిడారి సర్వేశ్వరరావు పార్థ్దివ దేహాన్ని సోమవారం పాడేరులో పలువురు ప్రముఖులు, ప్రజలు సందర్శించి నివాళి అర్పించారు. అరకులో శవ పరీక్షలు ముగిసిన అనంతరం కిడారి భౌతికకాయాన్ని పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. కడసారి చూపు కోసం మన్యం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, అధికారులు, ఉద్యోగ వర్గాలు, రాజకీయ పార్టీల నేతలు తరలి వచ్చారు. నివాళి అర్పించారు.
కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ..
కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు పరామర్శించి ఓదార్చారు. మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని, అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్సీలు మాధవ్, గుమ్మడి సంధ్యరాణి, పప్పల చలపతిరావు, గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, అనిత, గిడ్డి ఈశ్వరి, బండారు సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, జీసీసీ ఎండీ బాబురావు నాయుడు, ఐటీడీఏ పీవో డి.కె. బాలాజీ, అడిషనల్ డిజిలు హరిష్‌రావు గుప్తా, వెంకటేశ్వర్లు, డిఐజి శ్రీకాంత్, శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, పాడేరు, నర్సీపట్నం ఏఎస్పీలు అమిత్‌బర్దర్, ఆరిఫ్ హఫీజ్‌లు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌పార్టీ, బీజేపీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధిక సంఖ్యలో హజరయ్యారు.
సివేరి సోమకు కన్నీటి వీడ్కోలు
అరకులోయ: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల మృతదేహాలకు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయాన్నే పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమ మృతదేహాన్ని అరకులోయ పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, అధికారులు మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భౌతికకాయాన్ని వీధుల్లో ఊరేగించి ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు.
బొర్రా గుహలు మూత
అనంతగిరి(అరకులోయ): ప్రముఖ పర్యాటక కేందం బొర్రాగుహలు సోమవారం మూతపడ్డాయి. అనంతగిరి, కాశీపట్నం, డముకు, ములియగుడ ప్రాంతాలల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లోని వారంతా అభిమాన నాయకుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్దఎత్తున అరకులోయ, పాడేరు తరలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment