మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ప్రస్తుత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డుంబ్రిగుడ: ఏటా జరిగే వారోత్సవాలకు ముందుగా మాటు వేసి పొంచిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా కాల్చి చంపారు. ఏవోబీలో దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా రంగంలోకి దిగి సంచరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సర్వే చేసేందుకు తరలిం చడంతో ఈ ఘాతుకం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసులు రాకపోవడంతో చివరకు కిడారి అనుచరులే మృతదేహాలను వాహనాల్లో తరలించారు. అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే హత్య జరిగితే సాయంత్రం వరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే సోమ అనుచరులు అరకు, డుమ్రిగూడ పోలీస్‌స్టేషన్లపై దాడికి దిగి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు.
గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి...
విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో మారణకాండకు పాల్పడ్డారు. క్యాబినేట్ హోదా కలిగిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పట్టపగలే కాల్చి చంపారు. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కండ్రుం పంచాయతీ సార్రాయి గ్రామంలో టీడీపీ తలపెట్టిన గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కిడారి, సోమలు అరకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో డుంబ్రిగుడ, గుంటసీమ మీదుగా కార్యకర్తలు, అనుచరులతో కలసి మూడు వాహనాల్లో బయలుదేరారు. లివిటిపుట్టు వద్ద అప్పటికే మాటువేసిన 40 మంది మహిళా మావోయిస్టులతో సహా 70 మంది సాయుధులు టీడీపీ నేతల వాహనాలను అడ్డగించారు.
గన్‌మెన్‌ల నుంచి తుపాకులు, సెల్‌ఫోన్లు తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే కిడారి వాహనంలో ఉన్న డ్రైవర్ చిట్టిబాబు, ఇద్దరు గన్‌మెన్లు, వ్యక్తిగత సహాయకుడు అప్పారావు, అరకు జెడ్పీటీసీ కూన వనజ భర్త రమేష్, అరకు మాజీ సర్పంచ్ ఛటారి వెంకటరాజులు దూరంగా వెళ్లి నిల్చున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ వాహనంలో ఉన్న గన్‌మెన్, డ్రైవర్లను కూడా మావోయిస్టులు దూరంగా పంపేశారు. అనంతరం కిడారి, సోమ చేతులు కట్టేసి కొంత దూరం తీసుకెళ్లి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద ఆగారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే సోమ పారిపోయేందుకు ప్రయత్నించగా దారుణంగా చంపేస్తామని హెచ్చరించారు. మరో వాహనంలో ఉన్న ఎంపీటీసీ లావణ్య, ఆమె భర్త చంద్రశేఖర్, కించుమండ ఎంపీటీసీ ప్రమీల తదితరులను తాము చెప్పేవరకు అక్కడినుంచి వెళ్లవద్దని ఆదేశించారు.
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదు...
ఎమ్మెల్యే కిడారిని కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టు కిందకు తీసుకెళ్లిన మావోయిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. గూడ క్వారీని నిలిపివేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఏం చేశావని నిలదీశారు. ఈ విషయాలపై ఎన్నిసార్లు చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు. తనను నిలదీస్తున్న మహిళా మావోయిస్టులతో.. ‘మీ కాళ్లు పట్టుకుంటా క్షమించేయండి మేడం...!’ అంటూ కిడారి ముందుకు పడిపోయారు. నీకేమీ కాదంటూ ముందున్న మహిళా మావోలు ఆయన్ని నిల్చోబెట్టగా ఇంతలో ఓ మహిళా మావోయిస్టు వెనుక నుంచి అతిదగ్గరగా తుపాకీతో కాల్చింది. అనంతరం ముగ్గురు మహిళా మావోయిస్టులు నాలుగు రౌండ్లు కాల్చడంతో కిడారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఏడు రౌండ్లు గాలిలోకి కాల్చారు.
అదే సమయంలో మరికొందరు మావోయిస్టులు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పది అడుగుల దూరంలో ఉన్న గుంటసీమ రోడ్డులోని పనసచెట్టు వద్దకు తీసుకువెళ్లారు. ‘నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా ఓ మావోయిస్టును దారుణంగా చంపించావు. మాదెల పంచాయతీ బట్టివలసలోని క్వారీని మూసేయమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా పారిపోయేందుకు యత్నించావు...’ అంటూ ఆయనపై తూటాల వర్షం కురిపించడంతో కుప్పకూలిపోయారు. అనంతరం మావోయిస్టులు గుంటసీమ రోడ్డు నుంచి స్వర్ణయిగుడ అటవీ ప్రాంతం మీదుగా వెళ్లిపోయారు.
మలుపులో మందుపాతర...
వాస్తవానికి లివిటిపుట్టు గ్రామ సరిహద్దులోనే ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని పేల్చి వేసేందుకు మావోయిస్టులు మలుపు వద్ద మందు పాతరలు అమర్చారు. అయితే కిడారి భారీ బందోబస్తు లేకుండా రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి వాహనాన్ని అడ్డుకున్నారు. ఘటన అనంతరం కొందరు మిలీషియా సభ్యులు మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లను తవ్వి తీసుకెళ్లారు. బాంబులు పెట్టిన చోట పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచారు.
సాయంత్రం దాకా వెళ్లని పోలీసులు
ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపగా పోలీసులు సాయంత్రం వరకు ఘటనా స్థలానికి వెళ్లేందుకు కూడా సాహసించలేదు. హత్య జరిగిన వెంటనే కిడారి పీఏ అప్పారావు డుంబ్రిగుడ ఎస్సై అమనరావుకు ఫోన్‌లో విషయం తెలియచేయగా వస్తున్నామని అన్నారే గానీ ఒక్క కానిస్టేబుల్ కూడా వెళ్లలేదు.
నాలుగు గంటలు ఘటనా స్థలంలోనే మృతదేహాలు
పోలీసులు రాకపోవడంతో సుమారు నాలుగు గంటలు వేచి చూసిన కిడారి అనుచరులు, కార్యకర్తలు చివరికి ఎమ్మెల్యే వాహనమైన ఇన్నోవాలోనే ఆయన మృతదేహాన్ని, సోమ మృతదేహాన్ని ఆయన స్కార్పియో వాహనంలో అరకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వణికిపోయిన లివిటిపుట్టు
మావోయిస్టుల మారణకాండతో లివిటిపుట్టు, సమీప గ్రామాలైన కొత్తవలస, తోటవలస, వంతర్డ, స్వర్ణాయిగూడ, సింధిపుట్టులో గిరిజనులు భయకంపితులయ్యారు. ఘటన జరిగిన లివిటిపుట్టులోని 30 కుటుంబాల్లో చాలామంది పక్క గ్రామాలకు పరుగులు దీశారు. ఈ ఘటన గురించి ప్రశ్నించిన వారికి తాము ఊళ్లో లేమని సమాధానం చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment