
సాక్షి, విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నేతలే కారణమని స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకుల సాయంతోనే కిడారి హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించారని టీడీపీ అనుబంధ పత్రికల్లోనే వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ హత్యలకు వైఎస్సార్‌సీపీకి ముడిపెట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీడీపీ నాయకులే ఈ హత్యకు కారణమయ్యారని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులను తుది ముట్టించడంలో ఆరితేరారన్నారు. గతంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారని గుర్తు చేశారు.
రాఘవేంద్ర రావు అనే అధికారి, పరిటాల రవి హత్యల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారని తెలిపారు. తమ పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కిడారి.. తన మరణ వాంగ్మూలంలో పార్టీ మారినందుకు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు చెప్పారని ఆయన గన్‌మెన్‌లే చెబుతున్నారని, ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారనేదానికి ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలన్నారు. మైనింగ్ కోసమే సర్వేశ్వరావు టీడీపీలో చేరాడని అనడానికి చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. మైనింగ్ గొడవల వల్లనే టీడీపీ స్థానిక నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారని తేలిందన్నారు.
రాజధాని పొలాలను తగల పెట్టినప్పుడు, తుని రైలు ఘటన సందర్భంలో వైస్సార్సీపీపై బురద చల్లారని, తునిలో రైల్‌ను చంద్రబాబే తగల బెట్టించి, తనపై కేసు పెట్టించాలని చూసారని మండిపడ్డారు. ఈ ఘటనలో నిజాలు తేలుతాయనే భయంతోనే సీఐడీ విచారణను నిలిపివేశారని ఆరోపించారు. కిడారి హత్యలో కూడా టీడీపీ నేతలు బయటపడ్డారు కాబట్టి ఈ కేసు విచారణను కూడా ఆపేస్తారని చెప్పారు. చంద్రబాబు నిఘా వ్యవస్థ నిద్రలో ఉందని, తెలంగాణలో టీడీపీని గెలిపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నిఘా వ్యవస్థ దారి మళ్లించడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఈ హత్యలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment