
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్‌లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి.
మావోయిస్టు ఆపరేషన్‌లో 150 మంది!
తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్‌లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం.
ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం
2015లో కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment