సిద్ధాంతాల కోసం పోరాడిన అంబేద్కర్
గుంటూరు ఎడ్యుకేషన్
సమాజంలో పాతుకుపోయిన అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు కొనియాడారు. స్థానిక ఏసీ కళాశాలలోని జేడీ శీలం సెమినార్ హాల్లో ఆదివారం దళిత ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ముత్యం అధ్యక్షతన జరిగిన సభలో కత్తి పద్మారావు మాట్లాడుతూ కుల, మత, వర్గాలతో నిండిపోయిన సమాజాన్ని మార్చగల ఆయుధం ఒక్క విద్య మాత్రమేనని గాఢంగా నమ్మిన అంబేద్కర్ ఉన్నత చదువులతో అంతులేని విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. రాజ్యంగాన్ని రూపొందించేందుకు నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అంబేద్కర్‌ను మించిన మేధావి మరొకరు కనపించలేదన్నారు. దళితులు విద్యావంతులుగా ఎదిగినప్పుడే సమాజం వారిని గుర్తిస్తుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కార్లమార్క్స్ సిద్ధాంతాలను ప్రమాణికంగా తీసుకుని ముందుకెళ్తున్న సమయంలో అంబేద్కర్ 22 ఏళ్ల వయసులో కుల వ్యవస్థ నిర్మూలనపై రాసిన సిద్ధాంత గ్రంథం ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మరల్చిందన్నారు. కుల, మతాలు లేని నవ భారత నిర్మాణం కోసం అధ్యాపకులు కృషి చేసి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జార్జ్ విక్టర్ మాట్లాడుతూ దళితులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నప్పుడే రాజ్యాధికారాన్ని సైతం కైవసం చేసుకోగలరని చెప్పారు. దళితులు కేవలం హక్కుల గురించే గాక దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. వైజాగ్‌లోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పసల సుధాకర్ మాట్లాడుతూ సామాజిక, మానవీయ శాస్త్రాల అధ్యయనంతోనే దళితులు విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలరన్నారు. ఉన్నత విద్యతో పాటు న్యాయ శాస్త్రంలో పట్టభద్రులుగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ప్రకాష్, ఎయిడెడ్ అధ్యాపకులు పాల్గొన్నారు.