australian national university
-
భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్ కోర్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్‌యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌లో పని చేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇలా వెలుగు చూసింది భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్‌లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. ఐదో పొర కూర్పు ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్‌లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరు రెట్లు అధికంగా కరోనా వైరస్ వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా అతలకుతలం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ), మెల్బోర్న్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 15 దేశాలలో మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన కేసుల కంటే సగటున 6.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’లో ప్రచురించారు. ఇది యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు నివేదించిన దానికంటే చాలా ఎక్కువ. ఇటలీ విషయంలో 17 రెట్లు ఎక్కువని తెలిసింది. డేటా ప్రకారం, 15 దేశాలలో ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఆస్ట్రేలియాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే వ్యాధి వ్యాప్తి రేటు ఆగస్టు చివరిలో అధికారికంగా నివేదించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పీటీఐ తెలిపింది. 800 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 11 యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలో వాస్తవ సంఖ్య కంటే వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు అంచనా వేశారు. (చదవండి: కోవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు) ధ్రువీకరించబడిన కేసుల కంటే అధికం... ‘అనేక దేశాలలో ధ్రువీకరించబడిన కేసుల కంటే కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిని నియంత్రించడంలో, వ్యాప్తి సంభావ్యత రెండింటికీ అడ్డుగా మారింది. ఉదాహరణకు, ఒక విశ్లేషణలో 5.4 మిలియన్లకు పైగా జనాభా ఉన్నా యూకేలో సుమారు 8 శాతం జనాభాకు కరోనావైరస్ సంక్రమించింద’ని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ క్వెంటిన్ గ్రాఫ్టన్ తెలిపిన విషయాన్ని పిటిఐ వెల్లడించింది. ‘ఈ పరిశోధనలు కరోనావైరస్ మహమ్మారిపై మనం ఎలా వ్యవహరించాం, ప్రస్తుతం కరోనా బారినపడే వ్యక్తుల అనారోగ్యం, జీవితకాలంలో వారి ఆరోగ్యంపై ఏర్పడే ప్రభావాలతో పాటు, లాక్డౌన్లను ఎలా అమలు చేశాం, ఉపయోగించుకున్నాం. ఈ మహమ్మారిని నియంత్రించడంలో ఎంతవరకు ముందున్నామ’నే విషయాలను తెలుపుతుందని గ్రాఫ్టన్ చెప్పారు. కరోనావైరస్ మరణాలను పరిశీలించేందుకు "బ్యాక్కాస్టింగ్" అనే ప్రక్రియను పరిశోధకులు ఉపయోగించారు. దీనిని వ్యాధి వ్యాప్తి నుంచి లక్షణాల వరకు, వ్యాధి లక్షణాల నుంచి మరణం వరకు ఉన్న సమయంతో పోల్చారు. ఈ ప్రక్రియతో వ్యాధి వ్యాప్తి రేటును సుమారు 95 శాతం వరకు కచ్చితంగా నిర్థారించినట్టు గ్రాఫ్టన్ తెలిపారు. "సరళంగా చెప్పాలంటే, ఒక దేశంలో కోవిడ్-19తో ఎంత మంది మరణించారనే దానిపై మేము గణాంకాలను విశ్లేషించాం. ఎంత మందికి వ్యాధి సోకి చనిపోయారో అనే విషయాన్ని గత వివరాలు ఆధారంగా కనుగొన్నాం. కరోనా మరణాల సంఖ్యపై, వాస్తవ వ్యాప్తి రేటును అంచనా వేయడానికి సులభమైన పద్ధతి ఇద"ని ఇకిగై రీసెర్చ్ స్టీవెన్ ఫిప్స్ ను పీటీఐ ఉటంకించింది. -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
సోమరి.. అంతరించిపోరా మరి..
- ఎవరీయన? ఈయనా.. మన పూర్వీకుడే.. ముత్తాతలకు ముత్తాత.. ఆ ముత్తాతలకు ముత్తాతకు దగ్గరి బంధువు టైపు రిలేషనన్నమాట.. దాదాపు 19 లక్షల ఏళ్ల క్రితం వాడు.. ఈయన జాతి పేరు..హోమో ఎరెక్టస్.. - ఏం పాపం.. డల్లుగా ఉన్నాడు? ఉండడా మరి.. వీళ్లు బద్ధకస్తులట.. సోమరిపోతులట.. మేమనడం లేదు.. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. వీళ్ల జాతి అంతరించిపోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పింది. అందుకే బాబు.. కాస్త డల్లుగా ఉన్నాడు.. - పూర్తిగా చెప్పరాదా.. ఈ హోమో ఎరెక్టస్‌లు సుదూర ప్రయాణికుల టైపు. ఆఫ్రికా నుంచి శ్రీలంక, చైనా, ఇండోనేసియా, జార్జియా వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. దాదాపు 1,40,000 ఏళ్ల క్రితం ఈ జాతి అంతరించిపోయింది. దీనిపై ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా హోమో ఎరెక్టస్ నివసించిన ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో కూడా పరిశోధనలు చేశారు. ఇందులో తేలిందేమిటంటే.. వీరు బేసిక్‌గా బద్ధకస్తులు. వనరులను సమీకరించుకోవడంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకోవడం వంటి విషయాల్లో క్రియాశీలకంగా లేకపోవడం వంటి వాటి వల్ల ఈ జాతి నెమ్మదినెమ్మదిగా అంతరించిపోయిందని వారు తేల్చారు. అంతేకాదు.. వీరు తయారుచేసిన పనిముట్లు కూడా తక్కువ నాణ్యత కలిగినవి. ‘తమకు చుట్టుపక్కల ఏ రాయి దొరికితే దానితో పని కానిచ్చేసేవారు. హోమో ఎరెక్టస్‌లు తయారు చేసిన పనిముట్లు అది నాణ్యమైనదా కాదా అన్నదానితో పనిలేదు. సౌదీ అరేబియాలో మాకు దొరికిన పని ముట్లను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే.. అక్కడికి దగ్గర్లోనే ఓ కొండ ఉంది. అక్కడ నాణ్యమైన రాయి ఉంది. కానీ.. అక్కడ దొరికిన పనిముట్లలో ఆ రాయితో చేసినవి ఏమీ లేవు. అలాగని.. కొండ వద్ద తవ్విన ఆనవాళ్లూ లేవు. కొండ కింద పడిన వాటిని ఏరుకుని.. పనిముట్లు తయారుచేసుకున్నారు. దగ్గర్లో దొరుకుతున్నాయిగా.. కష్టపడటమెందుకు అనుకున్నారు’ అని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ షిప్టన్ అన్నారు. అదే తొలితరం హోమోసేపియన్లు, నియాండర్తల్‌లు వేరేగా ఉండేవారని.. వీరు కొండలు ఎక్కి మరీ, నాణ్యమైన రాళ్లను ఎంపిక చేసుకునేవారని..అవసరమైతే సుదూర ప్రాంతాలకు తరలించేవారని ఆయన చెప్పారు. ‘అంతేకాదు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హోమో ఎరెక్టస్‌లు తమ జీవిత విధానాన్ని మార్చుకోలేదు.. మూస పద్ధతులనే అనుసరిస్తూ పోయారు.. ప్లానింగ్ కూడా సరిగా ఉండేది కాదు. దీంతో క్రమేణా అంతరించిపోయారు’ అని చెప్పారు. అదండీ.. సంగతి.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడరైన మనోడి గతి.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
వారానికి 40 గంటలు పనిచేస్తారా.. అయితే!
మీరు వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 39 గంటలకు పైబడి పనిచేస్తున్నారా.. అలా అయితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం రిస్కులో పడ్డట్లే. దాదాపు 80 ఏళ్ల క్రితం అంతర్జాతీయంగా వారానికి 48 గంటల పని ఉండాలన్న పరిమితిని పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు సవరించాల్సిన అవసరం వచ్చిందని ద ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మాత్రం వారానికి 39 గంటల పని పరిమితిని విధించాలని ఏఎన్‌యూ చెప్పింది. ఎక్కువ సేపు పని చేయడం వల్ల మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుందని, అలా పనిచేస్తే సరిగా తినడానికి, తమ గురించి తాము పట్టించుకోడానికి సమయం సరిపోదని ఏఎన్‌యూ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్‌కు చెందిన హువాంగ్ డిన్ తెలిపారు. పురుషులకైతే 39 గంటలు ఓకేనని, అదే మహిళలకైతే వారానికి 34 గంటలు మాత్రమే పని పరిమితి ఉండాలని ఆయన చెప్పారు. వాళ్లు కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మరో ఐదు గంటలు తగ్గించాలన్నారు. ఇంతకుముందు అయితే ఆరోగ్యవంతులైన పురుషులకు వారానికి 47 గంటల పని పరిమితి విధించారని, వాళ్లు మహిళల కంటే కుటుంబ వ్యవహారాలు తక్కువ పట్టించుకోవడమే అందుకు కారణమని అన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో మహిళలు కూడా పురుషులతో సమానమైన నైపుణ్యాలు చూపుతున్నా.. సగటున మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని డిన్ చెప్పారు. కుటుంబ బాధ్యతల దృష్ట్యా పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేస్తే వాళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని వివరించారు. -
నానో టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ - కేన్సర్‌ను సులభంగా గుర్తించే లేజర్ల అభివృద్ధి - ముద్రించి వాడుకునేలా ‘సోలార్ సెల్స్’ టెక్నాలజీ - వేగంగా సమాచార ప్రసారానికి తోడ్పాటు సాక్షి, హైదరాబాద్ : భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ నానో టెక్నాలజీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ చెప్పారు. రెండు మూడు దశాబ్దాల క్రితం పరిచయమైన ఈ టెక్నాలజీ ఇప్పటికే కంప్యూటర్లు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై జరుగుతున్న పరిశోధనలను గమనిస్తే.. భవిష్యత్తులో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరగడం ఖాయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న ఓ కుగ్రామంలో పుట్టిన జగదీశ్... ఖమ్మంలో ప్రాథమిక విద్య, ఢిల్లీలో స్నాతకోత్తర విద్య అభ్యసించారు. ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 26 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మరింత సహకారానికున్న అవకాశాలను పరిశీలించేందుకు ఇటీవలే భారత్‌కు వచ్చిన చెన్నుపాటి జగదీశ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కేన్సర్‌ను గుర్తించే లేజర్లు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో అతి సూక్ష్మమైన లేజర్లను తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నాం. దాదాపు 300 నానోమీటర్ల వెడల్పు, ఐదు మైక్రాన్ల పొడవు మాత్రమే ఉండే ఈ లేజర్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. మూలకాల స్థాయిలో మార్పులను కూడా గుర్తించవచ్చు. అలాంటి లేజర్లు పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే కేన్సర్‌ను చాలా తొందరగా గుర్తించవచ్చు. తద్వారా మెరుగైన చికిత్స అందించడం వీలవుతుంది. అంతేకాదు ఈ నానోలేజర్లను చాలావేగంగా ఆన్/ఆఫ్ చేయవచ్చు. ఫలితంగా వీటిని మరింత వేగంగా పనిచేసే కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్ల తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు. సెకన్లలో జీబీల్లో సమాచారం డౌన్లోడ్ టెరాహెర్ట్జ్ తరంగాలను వాడడం ద్వారా భవిష్యత్తులో వైర్లెస్ కమ్యూనికేషన్ చాలా వేగంగా జరుగుతుంది. గిగాబైట్ల సమాచారాన్ని కూడా అతి తక్కువ సమయంలో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెరాహెర్ట్జ్ పౌనఃపున్యాలను మరింత సమర్థమైన భద్రతా ఏర్పాట్లకు కూడా వాడుకోవచ్చు. విమానాశ్రయాల్లో ఎక్స్‌రేలకు బదులుగా వీటిని వాడడం ద్వారా ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలను గుర్తించడం సులువు అవుతుంది. విద్యార్థులకు అండగా.. నా (జగదీశ్) చిన్నప్పుడు కిరోసిన్ దీపాల వెలుతురులో చదువుకున్నా. చదువుకోవాలని ఉన్నా తగిన అవకాశాలు ఉండేవి కావు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదన్న ఉద్దేశంతో గతేడాది చెన్నుపాటి విద్య, జగదీశ్‌ల పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు దాని ద్వారా సాయం అందిస్తున్నాం. ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది నలుగురు భారత విద్యార్థులు కూడా స్కాలర్షిప్ అందుకున్నారు. ఒకొక్కరికీ ఆరు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల సాయంతోపాటు అత్యున్నత స్థాయి పరిశోధనశాలల్లో పనిచేసేందుకు వారికి అవకాశం కల్పించాం. నానో టెక్నాలజీతో సౌర విద్యుత్ నానో టెక్నాలజీ ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందుకునేందుకు మరికొంత కాలం పట్టే అవకాశముంది. అయితే సౌరశక్తిని మరింత సమర్థంగా వాడుకునే విషయంలో ఎంతో ప్రగతి సాధించాం. భవనాల కిటికీలే సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చేలా కొన్ని పరిశోధనలు చేస్తున్నాం. కార్బన్ నానోట్యూబ్ల సాయంతో కాగితంపై అక్షరాలను ముద్రించినట్లుగా.. సోలార్ సెల్స్‌ను కూడా ముద్రించి వాడుకునే సమయం దగ్గరలోనే ఉంది. సేంద్రియ పదార్థాలతో తయారయ్యే ఈ సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని మెరుగైన స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి భారత దేశంలో యువత ఏదో ఉద్యోగం కోసం చదవడం కాకుండా.. సొంతంగా తామే నలుగురికి ఉద్యోగం కల్పించేం దుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ప్రభుత్వాలు కూడా ఇందుకు తగ్గట్టు తగిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అవకాశాలు కల్పించాలి. అమెరికాలో ఉన్న స్మాల్ బిజినెస్ రీసెర్చ్ ప్రోగ్రామ్లాంటివి అన్నిదేశాల్లో ఉండాలి. ఇతర రంగాల్లో అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మళ్లుతున్నప్పటికీ.. ఏదో ఒక కంపెనీకి పనిచేయడం కంటే, సొంతంగా కంపెనీ స్థాపిస్తే వచ్చే సంతృప్తి వేరన్నది యువత గుర్తించాలి. ఓడిపోతామన్న భయంతో చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ ఇవే విజయానికి మెట్లు. నేను కూడా ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాకే ఈ స్థాయికి చేరగలిగాను. -
180 ఏళ్ల క్రితమే గ్లోబల్ వార్మింగ్
మెల్బోర్న్: పారిశ్రామికీకరణ పేరుతో మానవుడు అవలంబిస్తున్న వింత పోకడలతో గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) నానాటికీ పెరిగిపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇప్పటిది కాదట! 180 ఏళ్ల క్రితం ఇది ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వీరు చేపట్టిన ఒక అధ్యయనంలో 1830లో నుంచి గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమైందని తేల్చారు. ఆ సమయంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమైందని ఏఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ నెరిలీ అబ్రామ్ తెలిపారు. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల ప్రాంతాల్లో 1830 సంవత్సరం లేదా అంతకంటే ముందే ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమై ఉండొచ్చని ఆమె చెప్పారు. సాధారణంగా ఈ వాతావరణ మార్పులు 20వ దశాబ్దానికి చెందినవిగా చాలా మంది భావిస్తారని కాని అంతకు పూర్వమే మార్పులు ప్రారంభమైనట్లు ఆమె వివరించారు. -
తెలుగు వ్యక్తికి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు
చెన్నుపాటి జగదీశ్‌కు అరుదైన గౌరవం మరో ఇద్దరు ప్రవాసులకు కూడా.. మెల్బోర్న్: ముగ్గురు ప్రవాస భారతీయులకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ దక్కింది. వివిధ రంగాల్లో వీరు కనబరిచిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా మొత్తం 600 మంది సమాజ సేవకులకు పురస్కారాలు దక్కగా అందులో మన వాళ్లు ముగ్గురు ఉండటం విశేషం. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీ (ఏఎన్‌యూ)లో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్, సౌత్‌వేల్స్‌లో నేత్రవైద్య నిపుణుడిగా పని చేస్తున్న జయచంద్ర, మెల్బోర్న్లో దంతవైద్యుడిగా సేవలందిస్తున్న సజీవ్ కోషీలను ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016కు గాను ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాలకు ఎంపిక చేసింది. అసమాన ప్రతిభ.. ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ నాగార్జున వర్సిటీలో గ్రాడ్యుయేషన్, 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ (టెక్నాలజీ) పూర్తి చేశారు. ఢిల్లీ వర్సిటీ నుంచి పీహెచ్డీ సంపాదించిన ఈయన.. ఆ తర్వాత కెనడాలోని కింగ్స్టన్ వర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్నారు. 1990లో ఆస్ట్రేలియా వెళ్లిన జగదీశ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలో పరిశోధన ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు సలహాదారుగా, పరిశోధకుడిగా, రచయితగా ఈయన అవిరళ కృషిని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పాతికేళ్లకు పైగా సేవలందించినందుకుగానూ తనకు దక్కిన అరుదైన గౌరవమిదని జగదీశ్ పేర్కొన్నారు. అవార్డుపై జయచంద్ర ‘నేత్రం’ జయచంద్ర వెస్ట్‌మేడ్ ఆస్పత్రి ప్రారంభించినప్పటినుంచి (1985) వెట్రియో రెటీనల్ శస్త్రచికిత్సల నిపుణుడిగా సేవలందిస్తున్నారు. నేత్రవైద్య రంగంలో అసమాన సేవలందించినందుకు, అంతర్జాతీయ స్థాయిలో నేత్ర పరిరక్షణ సంబంధిత కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నందుకు జయచంద్రకు ఈ పురస్కారం దక్కింది. తాను ఈ అవార్డుకు అర్హుడిననుకోవటం లేదని.. అయితే తనను గుర్తించినందుకు సంతోషంగా ఉందని జయచంద్ర తెలిపారు. దీంతోపాటు, దంతవైద్యంలో అందించిన సేవలకు గుర్తింపుగా.. డాక్టర్ సజీవ్ కోషీకి కూడా ఆస్ట్రేలియా అత్యున్నత పౌరపురస్కారం దక్కింది.