వారానికి 40 గంటలు పనిచేస్తారా.. అయితే!
వారానికి 40 గంటలు పనిచేస్తారా.. అయితే!
Published Sat, Feb 4 2017 3:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
మీరు వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 39 గంటలకు పైబడి పనిచేస్తున్నారా.. అలా అయితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం రిస్కులో పడ్డట్లే. దాదాపు 80 ఏళ్ల క్రితం అంతర్జాతీయంగా వారానికి 48 గంటల పని ఉండాలన్న పరిమితిని పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు సవరించాల్సిన అవసరం వచ్చిందని ద ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మాత్రం వారానికి 39 గంటల పని పరిమితిని విధించాలని ఏఎన్‌యూ చెప్పింది. ఎక్కువ సేపు పని చేయడం వల్ల మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుందని, అలా పనిచేస్తే సరిగా తినడానికి, తమ గురించి తాము పట్టించుకోడానికి సమయం సరిపోదని ఏఎన్‌యూ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్‌కు చెందిన హువాంగ్ డిన్ తెలిపారు.
పురుషులకైతే 39 గంటలు ఓకేనని, అదే మహిళలకైతే వారానికి 34 గంటలు మాత్రమే పని పరిమితి ఉండాలని ఆయన చెప్పారు. వాళ్లు కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మరో ఐదు గంటలు తగ్గించాలన్నారు. ఇంతకుముందు అయితే ఆరోగ్యవంతులైన పురుషులకు వారానికి 47 గంటల పని పరిమితి విధించారని, వాళ్లు మహిళల కంటే కుటుంబ వ్యవహారాలు తక్కువ పట్టించుకోవడమే అందుకు కారణమని అన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో మహిళలు కూడా పురుషులతో సమానమైన నైపుణ్యాలు చూపుతున్నా.. సగటున మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని డిన్ చెప్పారు. కుటుంబ బాధ్యతల దృష్ట్యా పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేస్తే వాళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని వివరించారు.
Advertisement