భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచ దేశాల పరిశోధన
నేటి నుంచి 9 రోజులపాటు వర్క్‌షాప్
చౌటుప్పల్: ప్రకృతి విపత్తులు, సునామీలు, భూకంపాలను ముందుగా పసిగట్టేందుకు, భూగర్భంలోని ఖనిజ, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం 150 కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోభాగంగా భూ అయస్కాంత క్షేత్ర పరిశీలనకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం శివారులో ఉన్న 105 ఎకరాల విస్తీర్ణంలో 2012లో ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ అత్యంత ఆధునికమైన డిజిటల్ మాగ్నటోమీటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ అయస్కాంత క్షేత్ర మార్పులపై ప్రతి నిమిషానికి 120 నమూనాలు నమోదవుతాయి. వీటి ఆధారంగా నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి.
వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధ్రువాలు తారుమారు
వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధృవాలు పరస్పరం మారుతున్నాయి. గతంలో 70 వేల ఏళ్ల క్రితం ఇలా జరిగింది. సాధారణంగా 50 వేల ఏళ్లకోసారి ఇలా మారుతుంటాయి. ఆ సమయంలో భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ఈ వర్క్‌షాప్‌లో పరిశోధనలు చేయనున్నారు.
-వైజే.భాస్కర్‌రావు, డెరైక్టర్, ఎన్‌జీఆర్‌ఐ