
సాగర్ తీరంలో భూ‘ప్రకంపనలు’
పెద్దశబ్దం రావడంతో ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు, పాఠశాల తరగతి గదుల్లోని విద్యార్థులు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా హాలియా, పెద్దవూర మార్గాల్లో వెళ్లే వాహనాలు కూడా కదుపునకు లోనయ్యాయి. ఏమైందోనని వాహనదారులు కొంతసేపు వాహనాలను రోడ్డుపై నిలిపేశారు. పెద్దశబ్దం రావడానికి ముందు రెండుసార్లు ఉరుముల శబ్దం వచ్చింది. పేలిన శబ్దం వచ్చిందని ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు వచ్చిన ప్రజలు, ఉద్యోగులు.. ఆ తర్వాత భూకంపం వచ్చిందని తెలిసి భయాందోళన చెందారు.
గతంలో కూడా సాగర్ తీరంలో భూ ప్రకంపనలు వచ్చినా రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత స్వల్పంగానే నమోదైంది. హాలియా మండలంలోని అనుములవారిగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో భవనం పగుళ్లు ఏర్పడడంతో పాటు ప్రహరీ పగుళ్లు తీసింది. హాలియా ఎంఆర్‌సీ ఉన్నత పాఠశాల భవనంలోని తొమ్మిదో తరగతి గది శ్లాబ్ పైకప్పు భాగంలో మూడు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్దవూర మండలంలోని పెద్దవూర, బట్టుగూడెం, రామన్నగూడెం తండా, కొత్తలూరు గ్రామాల్లో అక్కడక్కడా ఇళ్ల గోడలు, ప్రహరీ గోడలకు పగుళ్లకు వచ్చాయి. గుర్రంపోడు మండలం మొసంగిలోని ప్రాథమిక పాఠశాలలో తరగతిలో పెచ్చులు ఊడి కిందపడ్డాయి.
ఎర్రెడ్లగూడెం గ్రామంలో పది ఇళ్ల గోడలు నెర్రెలు తీశాయి. కంపన కేంద్రం పిన్నవూర నాగార్జునసాగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ సాగర్ పరిసర ప్రాంతంలో మాత్రం ఎక్కడ భూమి కంపించలేదు. పిన్నవూర కేంద్రంగా ఏర్పడిన కంపనంతో 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భూకంప తరంగాలు ప్రభావం చూపాయి.