వరుసగా మూడో రోజు భూకంపం
రాత్రివేళ మరో రెండుసార్లు ప్రకంపనలు
ఈ నెలలో నాలుగోసారి
భయాందోళనలో ప్రజలు
ముండ్లమూరు (దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరులో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఉదయం 10:24 గంటల సమయంలో భూకంప రాగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. సోమవారం రాత్రి మరో రెండుసార్లు ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లో భూమి కంపించింది. రాత్రి 8:16 గంటలకు, 8:19 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. నివాసాల్లోని ప్రజలు, దుకాణాల్లోని వ్యాపారులు ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి ఏం జరిగిందోననే భయంతో బయటకు పరుగులు తీశారు. మ్యాప్‌లో ముండ్లమూరు–ఉమామహేశ్వరపురం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఒకే సమయంలో భూకంపం రావడం, రాత్రి మరో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేవారు సైతం ప్రతిరోజు వస్తున్న భూకంపంపై ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరులో ఈ నెలలో 4, 21, 22, 23 తేదీల్లో భూకంపం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లలో ఉండాలంటే భయపడుతున్నారు. చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. ముండ్లమూరులో ఏర్పడిన భూకంపం గుండ్లకమ్మ నది ప్రాంతంలో కేంద్రీకృతమై వచ్చిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శనివారం ఉదయం 10:35 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. ఆదివారం ఉదయం 10:41 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.1గా, సోమవారం 10.24 గంటల సమయంలో నమోదైన భూకంప తీవ్రత 1.8గా నమోదైంది.
పరిశోధన చేయాలి
ముండ్లమూరులో వరుసగా మూడుసార్లు భూకంపం రావడంపై శాస్త్రవేత్త రాఘవన్ కొన్ని వివరాలు అందజేశారు. వరుసగా మూడుసార్లు ఒకే సమయంలో ఎందుకు వచ్చిందో పరిశోధన చేస్తే తెలుస్తుందన్నారు. అక్కడకు దగ్గరలో రిజర్వాయర్లు, గుండ్లకమ్మ వంటి నదుల్లో రీసెర్చ్ చేయాల్సి ఉందన్నారు. ముండ్లమూరు ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని హైడ్రోశాస్మసిటీగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ‘భూకంపం స్వామ్ లోపల వీక్ జోన్ ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే తరుచూ ఇదే ప్రాంతంలో ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంది’ అన్నారు. ఈ ప్రాంతంలో పరిశోధన చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.
కలెక్టర్‌కు నివేదించాం
భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కలెక్టర్ అడిగిన నివేదికలు పంపించాం. దానిపై కలెక్టర్ నుంచి వచ్చే ఉత్తర్వులు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.– శ్రీకాంత్, తహసీల్దార్
ఆందోళనగా ఉంది
ఉదయం 10.30 గంటల సమయంలో మూడు రోజులుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. రోజూ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. – శ్రీనివాసరావు, వ్యాపారి, ముండ్లమూరు
బెంచీలు బాగా ఊగాయి
చాలా భయం వేసి చెట్టు కిందే కూర్చుని చదువుకుంటున్నాం. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్కూల్‌లో పిల్లలంతా బయటకు పరుగులు తీశాం. మూడు రోజులుగా ఇదే జరుగుతోంది. పిల్లలందరూ భయంతో ఉన్నారు. – నవ్యశ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment