అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణ వైపు చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై మొదటిసారి 2.3, రెండోసారి 2.7, మూడో సారి 3.0గా నమోదైనట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా వైపు జడపల్లిమోటుతండా, కంచుబోడుతండాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.
పులిచింతలలో పెరుగుతున్న నీటి నిల్వ
స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు అనంతరం పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వను పెంచుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 139.33 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో నీరు 9.307 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, పూర్తి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 36.47 టీఎంసీలు అవసరం. స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేసే సమయానికి 5 టీఎంసీలున్న నీరు ఆదివారం రాత్రికి 9.307 టీఎంసీలకు చేరడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును బయటకు తీయడానికి మరికొంత సమయం పడుతుందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ విలేకరులతో చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 210.5133 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 50,662 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతోంది. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.799 టీఎంసీల నీరున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. పులిచింతల నుంచి ఒక గేటు ద్వారా 12,341 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 17,148 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లను మూసివేసి, కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు వద్ద భూప్రకంపనలు
Published Mon, Aug 9 2021 2:48 AM | Last Updated on Mon, Aug 9 2021 8:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment