Water storage capacity
-
సాగర్‌లో 210.22 టీఎంసీల నిల్వ
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులోకి 39,870 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,593 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 880 అడుగుల్లో 188.13 టీఎంసీలకు తగ్గింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 62,983 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 550.2 అడుగుల్లో 210.22 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ద్వారా కృష్ణాలోకి వరద చేరుతోంది. పులిచింతల్లోకి 8,775 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుదుత్పత్తి చేస్తూ 10,800 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల్లో 45.77 టీఎంసీలకుగానూ 40.54 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల వరద తోడైంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 37,078 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 5,993 క్యూసెక్కులు వదులుతూ మిగలుగా ఉన్న 31,085 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన పాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 17,540 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 43,909 క్యూసెక్కులు చేరుతుండగా, 1,632.72 అడుగుల్లో 104.66 టీఎంసీలను నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న 37,165 క్యూసెక్కులను స్పిల్ వే 12 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంలోకి వరద ప్రవాహం కాస్త పెరగనుంది. -
పులిచింతల ప్రాజెక్టు వద్ద భూప్రకంపనలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణ వైపు చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై మొదటిసారి 2.3, రెండోసారి 2.7, మూడో సారి 3.0గా నమోదైనట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా వైపు జడపల్లిమోటుతండా, కంచుబోడుతండాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. పులిచింతలలో పెరుగుతున్న నీటి నిల్వ స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు అనంతరం పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వను పెంచుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 139.33 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో నీరు 9.307 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, పూర్తి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 36.47 టీఎంసీలు అవసరం. స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేసే సమయానికి 5 టీఎంసీలున్న నీరు ఆదివారం రాత్రికి 9.307 టీఎంసీలకు చేరడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును బయటకు తీయడానికి మరికొంత సమయం పడుతుందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ విలేకరులతో చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 210.5133 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 50,662 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతోంది. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.799 టీఎంసీల నీరున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. పులిచింతల నుంచి ఒక గేటు ద్వారా 12,341 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 17,148 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లను మూసివేసి, కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. -
టీబీ డ్యామ్ సామర్థ్యంపై పేచీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై కర్ణాటక మడత పేచీ పెడుతోంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, వాస్తవానికి అది 105.79 టీఎంసీలని ఆర్వీ అసోసియేట్స్ ఇటీవల నిర్వహించిన టోపోగ్రాఫికల్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో తేలిన అంశాల ఆధారంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 105.79 టీఎంసీలుగా ఆమోదించాలని గతేడాది టీబీ బోర్డు నిర్వహించిన 216వ సమావేశంలో చేసిన ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాలు ఆమోదించగా కర్ణాటక మాత్రం వ్యతిరేకించింది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, బోర్డు కార్యదర్శి నేతృత్వంలో జాయింట్ కమిటీని నియమించి సర్వేలో వెల్లడైన అంశాలపై అధ్యయనం జరపాలని బోర్డు ప్రతిపాదించింది. తొలుత దీన్ని అంగీకరించిన కర్ణాటక ఆ తర్వాత జాయింట్ కమిటీ అధ్యయనంపై దాటవేస్తూ వచ్చింది. తాజాగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై రీ–సర్వే చేయాలని డిమాండ్ చేస్తోంది. నాడు 133.. నేడు 105.79 టీఎంసీలు కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక 1953 నాటికి ఉమ్మడిగా పూర్తి చేశాయి. అప్పట్లో ఈ డ్యామ్‌లో గరిష్టంగా 132.47 టీఎంసీలను నిల్వ చేశారు. ఈ నిల్వ సామర్థ్యం ఆధారంగా తుంగభద్ర డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ప్రవాహ, ఆవిరి నష్టాలు 18 టీఎంసీలు పోనూ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన ఛానళ్ల కింద కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు పది), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. ఆ మేరకు మూడు రాష్ట్రాలకు 1953 నుంచి తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను అడ్డగోలుగా నరికి వేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు భూమి కోతకు గురై తుంగభద్ర డ్యామ్‌లోకి పూడిక చేరుతోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు టీబీ బోర్డు డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై సర్వేలు చేస్తుంది. డ్యామ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన తర్వాత తొలిసారిగా 1963లో బోర్డు సర్వే చేసింది. ఆ సర్వేలో పూడిక వల్ల డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని బోర్డు తేల్చింది. పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని దామాషా పద్ధతిలో బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో బోర్డు నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. ఆ తర్వాత 2016లో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై టోపోగ్రాఫికల్ సర్వే పనులను ఆర్వీ అసోసియేట్స్‌కు బోర్డు అప్పగించింది. ఈ సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలని తేల్చుతూ గతేడాది టీబీ బోర్డుకు నివేదిక ఇచ్చింది. 2008 సర్వేతో పోల్చితే తాజా సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగినట్లు తేలింది. మళ్లీ సర్వేకు కర్ణాటక పట్టు.. టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని వాదిస్తూ వస్తున్న కర్ణాటక సర్కార్‌కు తాజా సర్వేలో నిల్వ సామర్థ్యం పెరిగిందని తేలడం మింగుడు పడడం లేదు. దీంతో దీన్ని ఆమోదించేందుకు నిరాకరిస్తోంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం చేయాలని, 2016లో సర్వే పనులు చేపట్టారని, ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ ఫిబ్రవరి 17న బోర్డుకు లేఖ రాసింది. మళ్లీ కొత్తగా సర్వే నిర్వహించాలని కర్ణాటక పట్టుబడుతోంది. అయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం కలుగుతోంది. సర్వేలో వెల్లడైన సామర్థ్యం 105.79 టీఎంసీల ఆధారంగా నీటిని పంపిణీ చేస్తే ఏపీ, తెలంగాణకు వాటా అధికంగా వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
పూడిక నష్టం 100 టీఎంసీలు!
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయానికి వరదతోపాటు పూడిక కూడా పోటెత్తుతోంది. రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సగటున వంద అడుగుల ఎత్తున కొండలా పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం ఏటా తగ్గిపోతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించినప్పుడు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా పూడిక పేరుకుపోవడంతో 215.81 టీఎంసీలకు తగ్గింది. అయితే ఇప్పుడు నిల్వ సామర్థ్యం ఇంతకూడా ఉండే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత సోమవారం అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్(ఏడీసీపీ) పరికరంతో హైడ్రోమెట్రిక్ సర్వే నిర్వహించగా పూడిక మరింత పేరుకుపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర అధ్యయన బాధ్యతను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అప్పగించాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను భారీ ఎత్తున నరకడం వల్ల భూమి కోతకు గురై వరదల సమయంలో శ్రీశైలంలోకి పూడిక చేరుతోందని విశ్లేషిస్తున్నారు. నాడు పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ.. కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద 308.06 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని 1960లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో చేపట్టారు. 1981 నాటికి నిర్మాణం పూర్తయింది. సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ, స్టెబులిటీ ప్రొటోకాల్ ప్రకారం అప్పుడు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 308.06 టీఎంసీలను నిల్వ చేశారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యంపై 2001–02లో అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ పూడిక వల్ల 264.83 టీఎంసీలకు తగ్గినట్లు తేల్చింది. అంటే నిల్వ సామర్థ్యం 43.23 టీఎంసీలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అనంతరం 2009–10లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే దాదాపు దశాబ్దం వ్యవధిలో పూడిక ప్రభావం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 49.02 టీఎంసీలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి చూస్తే నీటి నిల్వ సామర్థ్యం 92.25 టీఎంసీలు తగ్గినట్లు వెల్లడవుతోంది. ఆయకట్టుకు నీళ్లు సవాలే.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు కాగా రిజర్వాయర్ ఎగువన కృష్ణా నది మట్టం (బెడ్ లెవల్) సగటున 500 అడుగులు ఉంటుంది. తాజాగా నిర్వహించిన హైడ్రోమెట్రిక్ సర్వేలో నది మట్టం 600 అడుగులకు పెరిగినట్లు తేలింది. అంటే సగటున వంద అడుగుల మేర పూడిక పేరుకుపోయినట్లు స్పష్టమవుతోంది. పూడిక కొండలా మారడంతో నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీల కంటే మరింత తగ్గే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 25 టీఎంసీల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయంపై ఆధారపడి ఏపీలో తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులున్నాయి. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గితే ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీకి అప్పగించాం.. శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక వల్ల నిల్వ సామర్థ్యం ఇప్పటికే 308.06 టీఎంసీల నుంచి 215.81 టీఎంసీలకు తగ్గింది. వంద అడుగుల ఎత్తున పూడిక పేరుకుపోయినట్లు హైడ్రోమెట్రిక్ సర్వేలో తేలింది. ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కూడా ఉండే అవకాశం లేదు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించాం. – మురళీనాథ్‌రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ -
పోలవరం ఎత్తు తగ్గించలేదు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యం తగ్గించలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించారన్న ప్రచారం అపోహేనని కొట్టేశారు. ఆయన మంగళవారం పీపీఏ సభ్యులు మోహన్ శ్రీరామ్‌దాస్(డీఈ), అమిత్‌సింగ్(సీఈ–పవర్ సెక్టార్)లతో కలిసి పోలవరం పనుల్ని పరిశీలించారు. స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీట్ పనులు, స్పిల్‌వే పనులు, గ్యాప్–3 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను చూశారు. పనుల పురోగతిని ప్రాజెక్టు ఎస్ఈ ఎం.నాగిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఏకే ప్రధాన్ విలేకరులతో మాట్లాడుతూ డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)కు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందని, నీటి నిల్వసామర్థ్యం 194.6 టీఎంసీలు ఉంటుందని స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం 41.5 మీటర్ల ఎత్తు మేరకు నీటిని నిల్వ చేస్తారని చెప్పారు. రిజర్వాయర్ ప్రొటోకాల్ ప్రకారం, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తయ్యే క్రమాన్నిబట్టి నీటి నిల్వ సామర్థ్యం ఏటా పెరుగుతుందని తెలిపారు. నాలుగైదేళ్లలో పూర్తిస్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేస్తారని చెప్పారు. ఇప్పటికే కాంక్రీట్, హెడ్ వర్క్స్ పనులు 76 శాతం పూర్తయ్యాయన్నారు. మొత్తం ఆర్ అండ్ ఆర్, అన్ని పనులు కలిపి 41 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా.. కష్టమైన సమయంలో కూడా పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ఈఈ ఆదిరెడ్డి, డీఈలు బాలకృష్ణ, రామేశ్వర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. పీపీఏ సీఈ ప్రధాన్, సభ్యులు బుధవారం కూడా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. -
జల సిరులు.. కొత్త రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులు గరిష్ట నీటి నిల్వలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ని్రష్కమించాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు మండలాలు, ప్రకాశం జిల్లాలపై మాత్రమే ఉంటుంది. అంటే, వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నట్టు లెక్క. ఈ దశలో రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో 439.361 టీఎంసీలకుగాను 378.738 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో జలాశయాల్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉండటం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 527.86 టీఎంసీలకుగాను 514.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నవంబర్ మూడో వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉండటం కూడా ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రైతుల ప్రయోజనాలే పరమావధి ► నీటి సంవత్సరం ప్రారంభంలోనే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో వరద జలాలను ఒడిసిపట్టి.. ప్రాజెక్టులను నింపడం ద్వారా ఖరీఫ్, రబీల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ► గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఆయా ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులను విడుదల చేశారు. ► దాంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీలను ఇప్పుడు నిల్వ చేశారు. గత ఏడాది ఈ సమయానికి 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ► సోమశిల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో 77 టీఎంసీల నీరు నిల్వ చేశారు. కండలేరు రిజర్వాయర్‌లో చరిత్రలో తొలిసారిగా 68.03 టీఎంసీలకు గాను 60.28 టీఎంసీలను నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ కేవలం 47 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం. ► వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగాను తొలి సారిగా 14.299 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 8.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గండికోట రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీలకుగాను 18 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 12 టీఎంసీలు ఉన్నాయి. పైడిపాళెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగాను 5.90 టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏటా 45 టీఎంసీలను నిల్వ చేశారు. ► వరద జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వరుసగా రెండో ఏటా ఖరీఫ్‌లో ఆయకట్టులో కోటి ఎకరాలకు ప్రభుత్వం నీటిని అందించింది. రబీలోనూ రికార్డు స్థాయిలో (గతేడాది రబీలో 22 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు) ఆయకట్టుకు నీటిని అందించే దిశగా అడుగులు వేస్తోంది. యాజమాన్య పద్ధతులతో నీటి వృథాకు అడ్డుకట్ట నీటి విలువ, వ్యవసాయం విలువ, రైతుల శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్లే రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం. ఖరీఫ్‌లో ఒక్క ఎకరా ఎండకుండా సుమారు కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాం. రబీలోనూ రికార్డు స్థాయిలో నీళ్లందించడానికి చర్యలు చేపట్టాం. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జల వనరుల శాఖ -
కడలి వైపు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: గోదావరి సముద్రం వైపు కదలిపోతుంటే దానికి దీటుగా కృష్ణమ్మ కూడా కడలి వైపు పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మంగళవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 21.74 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్ హైఅలర్ట్‌ను ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 57.89 టీఎంసీలు.. నారాయణపూర్ నుంచి 50.98 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా ఉపనది భీమాలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో ఉజ్జయిని జలాశయం నుంచి 0.94 టీఎంసీని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 64.37 టీఎంసీల ప్రవాహం వస్తుండగా 65 గేట్లు ఎత్తి దిగువకు 63.21 టీఎంసీల ప్రవాహాన్ని కిందకు వదిలారు. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 10.02 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 76.30 టీఎంసీల వరద ప్రవాహం వస్తుండగా.. 76.37 టీఎంసీల వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. దాంతో సాగర్ 26 గేట్లు ఎత్తి 46.31 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 23.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా దిగువకు 36.67 టీఎంసీల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ భద్రత దృష్టా వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,36,873 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 30,767 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న పోలీసులు కంచికచర్ల (నందిగామ): కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు లంక భూముల్లో నివాసముంటున్న రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లిన పోలీస్ అధికారులు మంగళవారం వరదనీటిలో చిక్కుకున్నారు. కృష్ణానది లంక భూముల్లో సుమారు 40 కుటుంబాల రైతులు ఉంటున్నారు. లంక భూముల్లో నివాసముంటున్న రైతులను గ్రామానికి చేరవేసేందుకు నందిగామ రూరల్ సర్కిల్ సీఐ కె.సతీశ్, ఎస్ఐ జి.శ్రీహరిబాబు కొంతమంది విలేకరులతో కలసి వెళ్లారు. వారు వెళ్లే సమయంలో కృష్ణానదికి వరదనీరు రాకపోవటంతో ఎక్కువమంది రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మిగిలిన ఐదు కుటుంబాల రైతులను తరలించే సమయంలో వరద ఉధృతి తీవ్రరూపం దాల్చింది. దీంతో వారు వరదల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రాజకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇబ్రహీంపట్నం నుంచి మూడు బోటులను తెప్పించి వారిని కాపాడేందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న రైతులు, సీఐ, ఎస్‌ఐలతోపాటు విలేకరులు గుదే వరప్రసాద్, తోట క్రాంతికుమార్‌లను బోట్లపై సురక్షితంగా గ్రామానికి తీసుకువచ్చారు. -
కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఇక జలాశయాల గణన
ఖమ్మంఅర్బన్: జనాభా.. జంతు.. పశు.. ఇప్పుడు జలాశయాల గణన. వీటన్నింటి తరహాలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఐదేళ్లకోసారి చేపట్టే చిన్ననీటి వనరుల గణనతోపాటు ఈసారి జలాశయాల నమోదుకు పూనుకుంది. గతంలో ఐబీ(ఇరిగేషన్) అధికారులు చేపట్టిన తరహాలోనే జియో ట్యాగింగ్ ద్వారా జలాశయాల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల సహాయంతో గణన చేపట్టబోతున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, జిల్లాస్థాయిలో కలెక్టర్.. గణాంకాధికారుల పర్యవేక్షణలో చేపట్టే గణనలో మత్స్య శాఖ, చిన్ననీటిపారుదల శాఖ అధికారి, మండల వ్యవసాయాధికారి, ఏఎస్ఓలు భాగస్వాములవుతారు. గతంలో నీటిపారుదల శాఖ అధికారులు కేవలం చెరువుల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేశారు. ఈసారి మాత్రం చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు తదితర వాటి వివరాలను నమోదు చేస్తారు. చెరువు, కుంట వైశాల్యం.. దాని కింద సాగవుతున్న భూమి.. తాగునీటి అవసరాలు ఏ మేరకు తీరుస్తుంది.. ఎన్ని గ్రామాలు, కాలనీలకు ఉపయోగపడుతుంది.. ఇలాంటి వివరాలన్నీ జియో ట్యాగింగ్ విధానంలో పొందుపరిచిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ట్యాంక్‌లు, చెక్‌డ్యాంలు, కుంటలు, జలాశయాల సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ సూచనల మేరకే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆయా చెరువుల వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుంది.. దానికి అందే నీటివనరులు ఏమిటి.. ఆయకట్టు, తాగునీటి అవసరాలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది.. ప్రస్తుతం జలాశయం పరిస్థితి.. అభివృద్ధి చేస్తే ఎంతమేర ఉపయోగం వంటి సమగ్ర వివరాలు ఈ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో నమోదు కానున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడి నుంచైనా జలాశయాల సమాచారం ఎవరైనా తెలుసుకునేందుకు సులువుగా ఉంటుంది. గణన విధానం.. జలాశయాల గణన విధానంలో జలాశయం విస్తీర్ణం, ఆయకట్టు, విస్తీర్ణంలో వినియోగపు వివరాలు, ఉపయోగంలో లేని జలాశయాలు తదితర ప్రభుత్వ వనరుల వివరాలు, గ్రామ రికార్డుల్లో పహాణీ, అడంగల్, సెటిల్మెంట్ రిజిస్టర్, ఫైనల్ పట్టీలతో రెవెన్యూ శాఖ నుంచి రికార్డులను సేకరించి.. నమోదు చేయాల్సి ఉంటుంది. జలాశయం ఉనికి వివరాల సర్వే, సబ్ డివిజన్ నంబర్, గ్రామ నక్షా, మ్యాప్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. జలాశయం విస్తీర్ణం, అడంగల్ పహాణీ నుంచి పొందాల్సి ఉంటుంది. అవగాహన సదస్సులు జలాశయాల నమోదుపై మండలాలవారీగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి.. జియో ట్యాగింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అందులో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు.. ఇన్చార్జ్ ఏఎస్ఓ సుమన్, నీటిపారుదల శాఖ ఏఈ శివ, మండల వ్యవసాయాధికారి భాస్కర్‌రావు, ఏపీఓ అమ్మాజాన్ తదితరులు అవగాహన కల్పించారు. -
నూరేళ్ల ‘పోచారం’
నిజాంల కాలంలో నిర్మాణం.. ఇప్పటికీ చెక్కుచెదరని కట్టడం ⇒నిర్మాణ వ్యయం రూ. 27.11 లక్షలు ⇒నిర్మాణ సమయం 1917 – 1922 ⇒నీటి నిల్వ సామర్థ్యం : 21 మీటర్లతో 1.52 టీఎంసీలు ⇒ఆయకట్టు 10,500 ఎకరాలు ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పోచారం అభయారణ్యం కూడా ఉండడంతో సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కామారెడ్డి నుంచి ఎస్.వేణుగోపాలచారి: ప్రకృతి రమణీయతకు మారుపేరు పోచారం ప్రాజెక్టు పరిసరాలు. ఎప్పుడూ పర్యాటకు లతో అలరారే ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏడాదికేడాది తగ్గుతూ వస్తోంది. కామా రెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో గల మంచిప్ప వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1917లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్త యింది. 21 అడుగుల ఎత్తుతో 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు ఆనకట్టను నిర్మిం చారు. నిర్మాణంలో రాళ్లు, డంగుసున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా అప్పట్లోనే 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ తవ్వించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. అప్పటి హైదరాబాద్ స్టేట్‌లో తొలి మానవ నిర్మిత ప్రాజెక్టుగా ఇది పేరుగాంచింది. నిర్మించి వందేళ్లయినా చెక్కు చెదరకపోవడం గమనార్హం. నీటి నిల్వ సామర్థ్యం.. మొదట 3.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. యేటా పూడిక పేరుకుపోవ డంతో నీటి నిల్వ సామర్థ్యం 1.52 టీఎంసీలకు పడిపోతోంది. ఏ, బీ జోన్లుగా ఆయకట్టు.. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. ప్రాజెక్టు నీటిని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో గల వ్యవసాయ భూములకు అందిస్తారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ప్రధానకాలువ డిస్ట్రిబ్యూటరీ 01 నుంచి 48 వరకు ‘ఏ’జోన్గానూ, 49 నుంచి 73వ డిస్ట్రిబ్యూటరీ వరకు ‘బీ’జోన్గానూ విభజించారు. యేటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీ సీజన్లో ఒక ఏడాది ‘ఏ’ జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు మాత్రమే నీటిని అందిస్తారు. వైఎస్సార్ ఇచ్చిన నిధులతో.. వైఎస్సార్ 2001లో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పర్యటించారు. పోచారం ప్రాజెక్టు పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. అధికారంలోకి వస్తే పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణకు నిధులిస్తామని హామీ ఇచ్చారు. అధికారం లోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. రూ.14.30 కోట్లు మంజూరు చేశారు. ⇒ 2006 ఏప్రిల్ 7న వైఎస్సార్ సీఎం హోదాలో నాగిరెడ్డిపేటకు వచ్చి పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. -
జలకళ ఉట్టిపడాలె
♦ దత్తత గ్రామాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపు ♦ మే 15లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి ♦ రెండు ఊర్లలోనూ ఒకేరోజు గృహప్రవేశం ♦ నేను వస్తా... పెద్ద పండుగ జేసుకుందాం ♦ సీఎం కేసీఆర్ వెల్లడి ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో పర్యటన ♦ డబుల్ ఇళ్లు, చెరువు, కుంటల పనుల పరిశీలన గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఇక జలకళ ఉట్టిపడాలె.. ఇప్పుడున్న చెరువులు, కుంటల సామర్థ్యం పెంచుకుంటున్నం... ఈ పనులు పూర్తయితే మీకు ఢోకా ఉండదు. భూగర్భజలం పెరుగుతది... మరో రెండున్నరేళ్లయితే గోదావరి నదే మీ తలాపునకు వస్తది.. అప్పుడైతే మీకు 365 రోజులూ సాగు నీరొస్తది’... అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తన దత్తత గ్రామాలైనజగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, చెరువు, కుంటల అభివృద్ధి, కుడ్లేరు వాగు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ముందుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని ఎర్రకుంట వద్దకు చేరుకున్నారు. గతంలో 1.7 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ఫీట్స్) నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ చెరువును ప్రస్తుతం 25 ఎంసీఎఫ్‌టీకి పెంచుతున్నట్టు ఇరిగేషన్ ఎస్ఈ పద్మారావు, ఈఈ ఆనంద్, కన్సల్టెంట్ మల్లయ్యలు సీఎంకు వివరించారు. కుంటను అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులను ఇప్పటికే వేగవంతం చేశామన్నారు. ఈ చెరువు నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల వందలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరగడమేగాకుండా సుమారు 50 ఎకరాలకుపైగా భూములకు ప్రత్యక్షంగా నీరందే అవకాశముందని వారు సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా కుంట కు సంబంధించిన పనుల మ్యాపును కేసీఆర్ పరిశీలించారు. ఆ తరువాత మసిరెడ్డికుంట, లింగరాజ్‌కుంట పనులను సీఎం పరిశీలించారు. ఆ తరువాత నర్సన్నపేటలో రూ.28 కోట్లతో చేపడుతోన్న కుడ్లేరువాగు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వాగుపై నిర్మించనున్న ఐదు చెక్‌డ్యాంల నీటి నిల్వ సామర్థ్యం 47 ఎంసీఎఫ్టీలుగా ఉందని అధికారులు సీఎంకు వివరిం చారు. ఎర్రవల్లి సమీపంలో నిర్మించను న్న పాండురంగసాగర్ చెరువు పనుల వివరాలను సైతం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన చెరువు, కుంటల అభివృద్ధి ద్వారా ఈ రెండు గ్రామాల్లో 200 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. గతంలో వీటి నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 8 ఎంసీఎఫ్‌టీలు మాత్రమేనని చెప్పారు. ఈ పనులను మే 15లోగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఎర్రవల్లి, నర్సన్నపేటలో జలకళ ఉట్టిపడేలా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండున్నరేళ్లలోపు 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వర్గల్ మండలం పాములపర్తిలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తెప్పించి ఆ నీటితో ఇక్కడి చెరువులన్నీ నింపేస్తామన్నారు. ఒకేసారి ఇండ్లళ్లకు పోదాం.. ఎర్రవల్లి గ్రామంలో నమూనాగా పూర్తి చేసిన రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ‘ఇండ్లు ఎట్లున్నయ్..?’ అంటూ స్థానికులను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గదులు, వరండా, బాత్రూమ్లు, స్లాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో నామూనా ఇంటిని పరిశీలించి సభకు వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశం ఎదురుపడ్డాడు. ‘ఏమ్ సేట్ ఎట్లుంది ఇల్లు’ అంటూ సీఎం అతణ్ణి పలుకరించారు. వెంకటేశం రెండు చెతులు జోడించి బాగున్నాయ్ సారూ... అంటూ అనందం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతను మోస్తున్న జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని అభినందనల్లో ముంచెత్తారు. ఎర్రవల్లి తరహాలోనే కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరుకు కూడా ఇండ్లు ఇచ్చినా అక్కడి అధికారులు ఇంకా కట్టలేకపోతున్నారన్నారు. ‘మన జేసీ చానా హుషారున్నడు... అందుకే ఇండ్లు తొందరగా కట్టిస్తుండు’ అంటూ కితాబిచ్చారు. అదే విధంగా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. మే నెల 15 వరకు రెండు గ్రామాల్లో వందశాతం ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ‘పనులు పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఇండ్లళ్లకు (గృహప్రవేశాలు)పోదాం.... నేను కూడా ఒస్త... పెద్ద పండుగ జేసుకుందాం’...అని చెప్పారు. ఈ లోపు ప్రతి ఇంటికి వివిధ రకాల పచ్చని మొక్కలను పంపిణీ చేయాలని జేసీకి సూచించారు. సర్పంచ్‌లు రాజీనామా చేసే పరిస్థితి రాదనుకుంటున్న.... ‘ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో జూన్ నుంచి ఒక్కరు కూడా బిందెలు పట్టుకుని రోడ్డు మీదికి వస్తే సర్పంచ్‌లు రాజీనామాలు చేయాలి. అలాగే జెడ్పీటీసీ కూడా రాజీనామా చేయాలి. ఆ పరిస్థితి రానియ్యకుండా మన అధికారులు పనులు చేస్తారని, గ్రామస్తులు కూడా సహకరిస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
‘నారింజ’ కోసం నయా ప్లాన్
జహీరాబాద్: నారింజ... జహీరాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మూడు వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో కోటి రూపాయలు వెచ్చించి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు. కానీ సెంటు భూమిని తడపకపోవడంతో పేరుకే ప్రాజెక్టుగా నిలిచిపోయింది. అట్టహాసంగా ప్రాజెక్టు ప్రారంభించినా, నీరు పారక రైతులే కాల్వలు పూడ్చేశారు. పాలకుల అలసత్వంతో ప్రాజెక్టు పూడికతో నిండిపోయింది. దీంతో నాలుగు దశాబ్దాలుగా నారింజ నీళ్లు రైతన్నలను ఊరిస్తూనే ఉన్నాయి. కళ్లు తెరచిన కొత్త సర్కార్ సాగునీటికి కటకటలాడుతున్న మెతుకుసీమ రైతాంగానికి సాగునీరిచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్న కొత్త సర్కార్‌కు నారింజ ప్రాజెక్టు కళ్లముందు కనిపించింది. పైగా జిల్లాకు చెందిన హరీష్‌రావే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో నారింజ నీళ్లను సాగుకు తరలించేందుకు ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నారింజ ప్రాజెక్టును ఉన్నతాధికారులతో సర్వే చేయించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పలువురు పలు రకాల సూచనలు చేస్తుండడంతో సర్కార్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విషయమై సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు వీలుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌తో సర్వే చేయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులో నీటిని ఏ మేరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర నీరు నిల్వ ఉంటుంది, పూడిక తీయించినట్లయితే ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, పూడికతీత కోసం ఏ మేరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుం దనే విషయాలపై ప్రభుత్వం సమాచారం సేకరించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి లో ఉన్నతాధికారులతో సర్వే చేయించిన అనంతరమే నారింజ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. నారింజ నీటిని రైతులకు అందించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వెంటనే కాల్వలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.5.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాల్వల నిర్మాణంతో ప్రయోజనమేమిటనే వాదనలు తెరపైకి రావడంతో ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడడంతో కాల్వలు నిర్మాణానికి నోచుకోలేదు. కళ్లముందే తరలిపోతుంటే... జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా ఉన్న నారింజ వాగు కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్‌గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. అయితే ఈ నీరంతా వృథాగా కర్ణాటకకు తరలి వెళ్తుండడంతో, జహీరాబాద్ ప్రాంతం రైతులు కూడా నారింజ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు కం బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే గత నాలుగు దశాబ్దాల కాలంగా నారింజ జలాలు రైతులకు అందని ద్రాక్షలా మారాయి. లక్ష్యం ఘనం...ఫలితం శూన్యం నారింజ ప్రాజెక్టు లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ప్రాజెక్టు కింద 3 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కూడి కాల్వ కింద 550 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 2,450 ఎకరాలుగా గుర్తించారు. 2 కిలోమీటర్ల మేర పొడవున్న కుడి కాల్వ కింద న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామాలున్నాయి. 13 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ కింది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్పల్లి, మాడ్గి గ్రామాలను గుర్తించారు. అయినప్పటికీ ఏ ఒక్క కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో ఆయా గ్రామాల్లోని గుంట భూమి కూడా సాగులోకి రాలేదు. ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలను తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాల్వలను తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాల్వలను అప్పట్లోనే రైతులు పూడ్చి వేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ)గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న రెంటు తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని తొలగించి కొత్తగా తూములను ఏర్పాటు చేయాల్సి ఉంది. మట్టితో నిండిపోయిన కాల్వలను తిరిగి తవ్వించాల్సిన అవసరం ఉంది. కాల్వలు అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పూడిక తీస్తేనే ప్రయోజనం ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు పూడికతో నిండిపోయి ఉంది. పూడికను తీస్తేనే ఉపయోగకరంగాా ఉంటుందని పరిసర గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండిపోతోందనీ, దీంతో మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తోందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులోని పూడికను తీయించినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అంతే కాకుండా పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బోర్ల కింద సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రాజెక్టులోని పూడిక తీసేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ తర్వాతే కాల్వల ద్వారా నీటిని అందించేందుకు వీలుగా నిర్మాణం పనులు చేపట్టాలంటున్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని గుడిపేట వద్ద గోదావరినదిపై 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 62 గేట్లకు పెయింటింగ్ వేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ వైపు ఉన్న గుడిపేట వైపు కరకట్ట కిలోమీటరు దూరం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుడిపేట నిర్వాసితులు పునరావాస కాలనీకి పూర్తిగా తరలి వెళ్లి.. గ్రామాన్ని ఖాళీ చేసిన వెంటనే మిగితా కరకట్ట పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో త్వరలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించనున్నట్లు తెలిసింది. జూలై, ఆగస్టులో ప్రారంభోత్సవం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పైలాన్ నిర్మాణ పనులు పూర్తి కాగా ప్రాజెక్టు వద్ద గల బారీకేడ్లకు రంగులు వేశారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో గుడిపేట గ్రామం వద్ద స్వాగత బోర్డు పనులు చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు చేరితే ప్రారంభోత్సవం సందర్భంగా గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉంది. స్పిల్‌వే పై నిర్మించిన సిమెంటు రోడ్డు ద్వారా గుడిపేట నుంచి ప్రాజెక్టు మీదుగా ఎల్లంపల్లి, ముర్మూరు గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సిద్ధమైంది. సాకారం కానున్న వైఎస్సార్ కల తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు, ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కోసం 6.5 టీఎంసీల నీరు, మంథనిలో లిఫ్ట ఇరిగేషన్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2004 జూలై 24న ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,443 కోట్లు కాగా.. నాలుగేళ్లలో పూర్తి కావాల్సి ఉంది. నిధుల కొరత, వైఎస్సార్ మరణానంతరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల పదేళ్ల అనంతరం నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వైఎస్సార్ కల త్వరలో నెరవేరనుంది. అందని పరిహారం.. కల్పించని పునరావాసం... ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద జిల్లాలో తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గుడిపేట, నంనూరు, రాపల్లి, చందనాపూర్, కర్ణమామిడి, కొండపల్లి, పడ్తన్‌పల్లి, సూరారం, గుళ్లకోట గ్రామాలు ఉన్నాయి. వీరికి పూర్తి స్థాయిలో పరిహారం, ఇళ్లకు డబ్బులు అందించలేదు. నంనూరులోని 1,018, గుడిపేటలోని 625 కుటుం బాలకు గుడిపేటలోని శివారులో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటికే 500 మంది ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉన్నారు. అభివృద్ధి పనులు చేపట్టినా.. ఇప్పటికే వర్షాలకు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ర్యాలీ వాగు నుంచి తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేసినా చుక్కనీరు అందడం లేదు. కొండపల్లిలో 179 ఇళ్లు, 244 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. వీరికి గ్రామ శివారులోనే 23 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టుకు సమీపంలో కాలనీ ఉందని, జాతీయ రహదారికి దగ్గరగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మూడేళ్లుగా అధికారులను కోరుతున్నారు. గత ఏడాది గ్రామస్తులకు పునరావాస కాలనీలో ప్లాట్లు అందించినా.. ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. రాపల్లి గ్రామంలోని 978 మంది నిర్వాసితులకు హాజీపూర్ శివారులో 90.24 ఎకరాల్లో 885 కుటుంబాలకు పునరావాస కాలనీని రూ.22.86 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. 11.5కిలోమీటర్లకు గాను 6.8 కిలోమీటర్లు సీసీ రోడ్డు పూర్తి చేశారు. 22 కిలోమీటర్లకు గాను 18కిలోమీటర్లు డ్రెయినేజీ పనులు, 6.2 కిలోమీటర్లు పైపులైన్ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. చందనాపూర్ నిర్వాసితుల కోసం గుడిపేట శివారులోని 27 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కాలనీ అభివృద్ధి కోసం రూ.7.45 కోట్లు కేటాయించారు. కాలనీలో 2.8కిలోమీటర్ల రోడ్లకు గాను 0.9 కిలోమీటర్లు పూర్తయింది. 4.6కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి గాను 1.81 కిలోమీటర్లు పూర్తయింది. 60 వేల లీటర్ల నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయింది. మొత్తంగా 27.5శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ మిగితా పనులు నిలిపి వేశారు. కర్ణమామిడిలో 712 ఇళ్లు ఉండగా 1,054 కుటుంబాలు, పడ్తన్‌పల్లిలో 268 ఇళ్లు ఉండగా 336 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు 84.36 ఎకరాల స్థలాన్ని హాజీపూర్, రాంపూర్ శివారులో గుర్తించారు. ఇందులో 61.24 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని లేఔట్ రూపొందించినా.. అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. మిగితా 23.12 ఎకరాల సేకరణలో చట్టపరమైన సమస్యలున్నాయి. గుళ్లకోటలో 627 ఇళ్లు ఉండగా 829 కుటుంబాలు ముంపునకు గురి కాగా.. వీరికి గుళ్లకోటలోనే 78.01 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. ఇంకా నిర్వాసితులు నిర్మాణలు చేపట్టలేదు. గ్రామంలోని వారికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. సూరారంలో 143 ఇళ్లు ఉండగా.. 209 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. వీరికి గ్రామ శివారులోని 26.18 ఎకరాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 60వేల లీటర్ల తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తి కాగా, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం పనులు సాగుతున్నాయి.