టీబీ డ్యామ్‌ సామర్థ్యంపై పేచీ | Karnataka Govt Demands re-survey on water storage capacity of TB Dam | Sakshi
Sakshi News home page

టీబీ డ్యామ్‌ సామర్థ్యంపై పేచీ

Published Tue, May 4 2021 3:42 AM | Last Updated on Tue, May 4 2021 3:42 AM

Karnataka Govt Demands re-survey on water storage capacity of TB Dam - Sakshi

సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యంపై కర్ణాటక మడత పేచీ పెడుతోంది. డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, వాస్తవానికి అది 105.79 టీఎంసీలని ఆర్వీ అసోసియేట్స్‌ ఇటీవల నిర్వహించిన టోపోగ్రాఫికల్‌ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో తేలిన అంశాల ఆధారంగా డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యాన్ని 105.79 టీఎంసీలుగా ఆమోదించాలని గతేడాది టీబీ బోర్డు నిర్వహించిన 216వ సమావేశంలో చేసిన ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాలు ఆమోదించగా కర్ణాటక మాత్రం వ్యతిరేకించింది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, బోర్డు కార్యదర్శి నేతృత్వంలో జాయింట్‌ కమిటీని నియమించి సర్వేలో వెల్లడైన అంశాలపై అధ్యయనం జరపాలని బోర్డు ప్రతిపాదించింది. తొలుత దీన్ని అంగీకరించిన కర్ణాటక ఆ తర్వాత జాయింట్‌ కమిటీ అధ్యయనంపై దాటవేస్తూ వచ్చింది. తాజాగా డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యంపై రీ–సర్వే చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

నాడు 133.. నేడు 105.79 టీఎంసీలు
కర్ణాటకలోని హోస్పేట్‌ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక 1953 నాటికి ఉమ్మడిగా పూర్తి చేశాయి. అప్పట్లో ఈ డ్యామ్‌లో గరిష్టంగా 132.47 టీఎంసీలను నిల్వ చేశారు. ఈ నిల్వ సామర్థ్యం ఆధారంగా తుంగభద్ర డ్యామ్‌ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రవాహ, ఆవిరి నష్టాలు 18 టీఎంసీలు పోనూ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన ఛానళ్ల కింద కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు పది), ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. ఆ మేరకు మూడు రాష్ట్రాలకు 1953 నుంచి తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను అడ్డగోలుగా నరికి వేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు భూమి కోతకు గురై తుంగభద్ర డ్యామ్‌లోకి పూడిక చేరుతోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు టీబీ బోర్డు డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యంపై సర్వేలు చేస్తుంది.

డ్యామ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన తర్వాత తొలిసారిగా 1963లో బోర్డు సర్వే చేసింది. ఆ సర్వేలో పూడిక వల్ల డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని బోర్డు తేల్చింది. పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద రోజులు తగ్గడంతో డ్యామ్‌ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని దామాషా పద్ధతిలో బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో బోర్డు నిర్వహించిన సర్వేలో డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. ఆ తర్వాత 2016లో డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యంపై టోపోగ్రాఫికల్‌ సర్వే పనులను ఆర్వీ అసోసియేట్స్‌కు బోర్డు అప్పగించింది. ఈ సర్వేలో డ్యామ్‌  నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలని తేల్చుతూ గతేడాది టీబీ బోర్డుకు నివేదిక ఇచ్చింది. 2008 సర్వేతో పోల్చితే తాజా సర్వేలో డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగినట్లు తేలింది.

మళ్లీ సర్వేకు కర్ణాటక పట్టు..
టీబీ డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని వాదిస్తూ వస్తున్న కర్ణాటక సర్కార్‌కు తాజా సర్వేలో నిల్వ సామర్థ్యం పెరిగిందని తేలడం మింగుడు పడడం లేదు. దీంతో దీన్ని ఆమోదించేందుకు నిరాకరిస్తోంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం చేయాలని, 2016లో సర్వే పనులు చేపట్టారని, ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ ఫిబ్రవరి 17న బోర్డుకు లేఖ రాసింది. మళ్లీ కొత్తగా సర్వే నిర్వహించాలని కర్ణాటక పట్టుబడుతోంది. అయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం కలుగుతోంది. సర్వేలో వెల్లడైన సామర్థ్యం 105.79 టీఎంసీల ఆధారంగా నీటిని పంపిణీ చేస్తే ఏపీ, తెలంగాణకు వాటా అధికంగా వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement