సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్‌లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు.
విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే..
♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు.
♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది.
♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది.
♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్‌లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది.
♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్‌లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం.
♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం.
♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి.
♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment