TB board
-
టీబీ డ్యామ్ సామర్థ్యంపై పేచీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై కర్ణాటక మడత పేచీ పెడుతోంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, వాస్తవానికి అది 105.79 టీఎంసీలని ఆర్వీ అసోసియేట్స్ ఇటీవల నిర్వహించిన టోపోగ్రాఫికల్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో తేలిన అంశాల ఆధారంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 105.79 టీఎంసీలుగా ఆమోదించాలని గతేడాది టీబీ బోర్డు నిర్వహించిన 216వ సమావేశంలో చేసిన ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాలు ఆమోదించగా కర్ణాటక మాత్రం వ్యతిరేకించింది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, బోర్డు కార్యదర్శి నేతృత్వంలో జాయింట్ కమిటీని నియమించి సర్వేలో వెల్లడైన అంశాలపై అధ్యయనం జరపాలని బోర్డు ప్రతిపాదించింది. తొలుత దీన్ని అంగీకరించిన కర్ణాటక ఆ తర్వాత జాయింట్ కమిటీ అధ్యయనంపై దాటవేస్తూ వచ్చింది. తాజాగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై రీ–సర్వే చేయాలని డిమాండ్ చేస్తోంది. నాడు 133.. నేడు 105.79 టీఎంసీలు కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక 1953 నాటికి ఉమ్మడిగా పూర్తి చేశాయి. అప్పట్లో ఈ డ్యామ్‌లో గరిష్టంగా 132.47 టీఎంసీలను నిల్వ చేశారు. ఈ నిల్వ సామర్థ్యం ఆధారంగా తుంగభద్ర డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ప్రవాహ, ఆవిరి నష్టాలు 18 టీఎంసీలు పోనూ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన ఛానళ్ల కింద కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు పది), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. ఆ మేరకు మూడు రాష్ట్రాలకు 1953 నుంచి తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను అడ్డగోలుగా నరికి వేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు భూమి కోతకు గురై తుంగభద్ర డ్యామ్‌లోకి పూడిక చేరుతోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు టీబీ బోర్డు డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై సర్వేలు చేస్తుంది. డ్యామ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన తర్వాత తొలిసారిగా 1963లో బోర్డు సర్వే చేసింది. ఆ సర్వేలో పూడిక వల్ల డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని బోర్డు తేల్చింది. పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని దామాషా పద్ధతిలో బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో బోర్డు నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. ఆ తర్వాత 2016లో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై టోపోగ్రాఫికల్ సర్వే పనులను ఆర్వీ అసోసియేట్స్‌కు బోర్డు అప్పగించింది. ఈ సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలని తేల్చుతూ గతేడాది టీబీ బోర్డుకు నివేదిక ఇచ్చింది. 2008 సర్వేతో పోల్చితే తాజా సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగినట్లు తేలింది. మళ్లీ సర్వేకు కర్ణాటక పట్టు.. టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని వాదిస్తూ వస్తున్న కర్ణాటక సర్కార్‌కు తాజా సర్వేలో నిల్వ సామర్థ్యం పెరిగిందని తేలడం మింగుడు పడడం లేదు. దీంతో దీన్ని ఆమోదించేందుకు నిరాకరిస్తోంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం చేయాలని, 2016లో సర్వే పనులు చేపట్టారని, ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ ఫిబ్రవరి 17న బోర్డుకు లేఖ రాసింది. మళ్లీ కొత్తగా సర్వే నిర్వహించాలని కర్ణాటక పట్టుబడుతోంది. అయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం కలుగుతోంది. సర్వేలో వెల్లడైన సామర్థ్యం 105.79 టీఎంసీల ఆధారంగా నీటిని పంపిణీ చేస్తే ఏపీ, తెలంగాణకు వాటా అధికంగా వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
నీటి లెక్కలు తేల్చిన తుంగభద్ర బోర్డు
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను టీబీ బోర్డు తేల్చింది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు అంచనా వేసిన లభ్యత కంటే 7.80 టీఎంసీలు డ్యామ్‌లో అధికంగా లభించాయి. డ్యామ్‌లోని నీటిని దామాషా పద్ధతిలో దక్కిన కోటాలో ఏపీ 52.831, తెలంగాణ 5.253, కర్ణాటక 111.673 టీఎంసీలను వినియోగించుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి భారీ ఎత్తున ప్రవాహ జలాలు వచ్చినా.. రబీలో నిలిచిపోవడంపై బోర్డు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎగువన కర్ణాటక సర్కార్ అక్రమంగా భారీగా ఎత్తిపోతల పథకాలను చేపట్టడం వల్లే వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి చేరడం లేదని.. ఇది ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన టీబీ డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో 8 టీఎంసీలు పోను హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. దామాషా పద్ధతిలో.. నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభంలో జూన్ 9, 2020న డ్యామ్‌లో 163 టీఎంసీల లభ్యత ఉంటుందని బోర్డు అంచనా వేసింది. ఆ తర్వాత నవంబర్ 11న 168 టీఎంసీలు, డిసెంబర్ 20న 170.80 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు.. దామాషా పద్ధతిలో కర్ణాటకకు 111.979, ఏపీకి 53.576, తెలంగాణకు 5.245 టీఎంసీలను కేటాయించింది. ఇందులో మూడు రాష్ట్రాలు 169.757 టీఎంసీలు వాడుకున్నాయి. రబీలో డీలా.. మే 30 2020 నాటికి డ్యామ్‌లో 1,584.56 అడుగుల్లో 6.35 టీఎంసీలు నిల్వ ఉండేవి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకూ ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి 288.477 టీఎంసీల ప్రవాహం వచ్చింది. మూడు రాష్ట్రాలు 92.661 టీఎంసీలు వాడుకున్నాయి. డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తేసి 92.443 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 3.913, 2.597 వృథా అయ్యాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి.. అంటే అక్టోబర్ 1 నాటికి 1,627.90 అడుగుల్లో 82.425 టీఎంసీలు నిల్వ ఉండేవి. అక్టోబర్ 1, 2020 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ డ్యామ్‌లోకి కేవలం 3.982 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి భారీగా వచ్చేది. కానీ.. కర్ణాటక ఎగువన భారీగా అక్రమ ఎత్తిపోతల చేపట్టి.. నీటిని తోడేస్తుండటం వల్ల రబీలో డ్యామ్‌లోకి ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. రబీలో మూడు రాష్ట్రాలు 77.096 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 2.412, 1.999 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ నెల 10 నాటికి డ్యామ్‌లో 4.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
జలజగడం
ఆన్అండ్ఆఫ్లోనూ అన్యాయం చేస్తున్న టీబీ బోర్డు హెచ్ఎల్సీకి నీరు విడుదల వాయిదా కర్ణాటక రైతులకు అవసరం లేకపోవడమే కారణమట అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి రావాల్సిన నీటిని విడుదల చేయడంలో టీబీ బోర్డు అధికారులు తీవ్ర వివక్షతను చూపిస్తున్నారు. జిల్లా రైతులతో పనిలేకుండా కేవలం కర్ణాటక రైతుల సంక్షేమాన్నే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో వస్తున్న అరకొర నీటిని కూడా హెచ్చెల్సీకి విడుదల చేయకుండా వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనం. తుంగభ్రద జలాశయంలోకి నీటి లభ్యత తక్కువుగా ఉందని ఈ ఏడాది హెచ్చెల్సీకి 10 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకూ 7.25 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి అయితే జలాశయంలో నీటినిల్వ వేగంగా పడిపోతోందనే ఉద్దేశంతో ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 17వ తేదీ నుంచి హెచ్చెల్సీకి నీటిని నిలుపుదల చేశారు. తిరిగి సోమవారం(26) నుంచి విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు ప్రస్తుతం నీటి అవసరం లేనందున హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసినట్లు టీబీ బోర్డు అధికారులు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే కర్ణాటక అక్రమంగా జల చౌర్యానికి పాల్పడుతోందని చెప్పకనే చెప్పవచ్చు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతి అంటే పదిరోజులు కర్ణాటక రైతులు వాడుకుంటే మరో పది రోజులు జిల్లా రైతులు వాడుకోవాలి. కానీ మనకు రావాల్సిన సమయంలో వారికి అవసరం లేదనే కారణంతో వాయిదా వేయడం విమర్శలకు దారి తీస్తోంది. కనీసం జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరు అవసరమా లేదా అనే వివరాలను జిల్లా అధికారులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పైగా మనకు నీళ్లు విడుదల సమయంలో కూడా కర్ణాటక రైతులు వాడుకునే ప్రమాదముంది. కానీ తుంగభద్ర జలాశయం వద్ద మాత్రం జిల్లాకు విడుదల చేసిన నీటిని లెక్కలు కడుతూనే ఉంటారు. . ఇప్పటికైనా కలెక్టర్, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి సారించి తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి రావాల్సిన నీటి విషయంపై ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఆయకట్టు రైతులు విజ్జప్తి చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావును వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటి విడుదల వాయిదా వేసిన విషయం నిజమే అని అంగీకరించారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో హెచ్చెల్సీకి సోమవారం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారన్నారు. కానీ జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలతో పాటు నీటి అవసరాలు ఎక్కువుగానే ఉన్నాయని వివరించారు. కానీ తమను సంప్రదించకుండానే బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. -
ఇక రాయలసీమ ఎడారే!
టీబీ బోర్డు నిర్ణయంతో ముప్పు సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర జలాల్ని పట్టపగలే కర్ణాటక చౌర్యం చేస్తుంటే ఇన్నాళ్లూ నోరుమెదపని తుంగభద్ర(టీబీ) బోర్డు తాజాగా దానికి ఆమోదముద్ర వేసింది. కర్ణాటక పరిధిలో లోలెవల్ కెనాల్(ఎల్లెల్సీ)పై 118.2 కి.మీ.ల వద్ద అదనంగా మరో డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుకు శనివారం జరిగిన టీబీ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా కర్నూలు జిల్లా కోటాలోని రెండు టీఎంసీలను కర్ణాటక వినియోగించుకునే అవకాశముంది. దీని ఫలితంగా కర్నూలు జిల్లాలో 1,57,062 ఎకరాల ఆయకట్టు ఎడారికానున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేసమయంలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 1,90,035 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే హైలెవల్ కెనాల్(హెచ్చెల్సీ) ఆధునీకరణకు కర్ణాటక మోకాలడ్డినా నోరుమెదపలేదు. టీబీ బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈఎన్సీలు శనివారం హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది 151 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్న బోర్డు.. కర్ణాటకకు 102, ఏపీకి 45, తెలంగాణకు 4 టీఎంసీలను గతనెలలో కేటాయించింది. కానీ వర్షాభావ పరిస్థితులవల్ల నీటిలభ్యత తగ్గడంతో ఆ మేరకు కేటాయింపుల్లో కోతలు వేయాలని నిర్ణయించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీకి సెప్టెంబర్ 15 వరకు నీటిని విడుదల చేస్తామంది. -
15 వరకే హెచ్చెల్సీకి నీరు
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయానికి సెప్టెంబర్ 15 వరకూ మాత్రమే నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్‌లో కృష్ణ, తుంగభద్ర వాటర్ కమిషన్ బోర్డు చైర్మన్ ఆర్.కె. గుప్తా అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జలాశయంలో 52 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, 9,940 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అదే స్థాయిలో 8,078 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో పడిపోయే∙కారణాలు కనిపిస్తుండడంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న తరహాలో వదిలితే సెప్టెంబర్ 15 నాటికి హెచ్చెల్సీ వాటా పూర్తవుతుందని లెక్కలు కట్టినట్లు తెలిసింది. త్వరలో ఆయకట్టుకు నీరు వదలాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తుంగభద్ర జలాశయం నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకూ నీటిని తీసుకుపోవడానికి కేంద్రం నుంచి స్పెషల్ పోలీస్ ఫోర్సును రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే ఎగువ ప్రాంతాల వారు నీటిని అక్రమంగా తీసుకునే అవకాశమున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో తుంగభద్ర బోర్డు మెంబర్ జగ్‌మోహన్‌గుప్తా, నీటిపారుదలశాఖ ఈఎన్సీ(తెలంగాణా) మురళీధర్, జలవనరులశాఖ ప్రభుత్వ కార్యదర్శి గురుపదస్వామి, ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్ర బోర్డు పరిధిలోకి ఆర్డీఎస్!
► ఆనకట్ట ఎత్తు పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణ, కర్ణాటక ► చర్చలకు పిలిచినా స్పందించని ఏపీ ప్రభుత్వం ► ఆర్డీఎస్ వివాదంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు ► మూడు రాష్ట్రాలతో చర్చించాలని టీబీ బోర్డుకు లేఖ ► ఈ నెల 25న మూడు రాష్ట్రాలతో చర్చించే అవకాశం? కర్నూలు సిటీ: రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదంగా మారిన రాజోలి బండ డెవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను తుంగభద్ర బోర్డు పరిధిలోకి చేర్చేందుకు కసరత్తు జరుగుతుంది. తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ఆనకట్టతో పాటు, కాల్వల ఆధునికీకరణకు 2008లో నిధులు మంజూరు అయ్యాయి. కాల్వల ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తికాగా ఆనకట్ట పనులు మిగిలాయి. ఈ పనులు చేసేందుకు కుడి వైపు ఉన్న కర్నూలు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. సున్నితమైన ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆనకట్ట ఎత్తును పెంచేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి పాటిల్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆనకట్ట పనులు చేసేందుకు రాయచూర్ సర్కిల్ ఇంజనీర్లు సామగ్రితో ఆర్డీఎస్ దగ్గరకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన అధికారులు అక్కడికి చేరుకుని పనులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తరువాతే ముందుకు పోవాలని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఆనకట్ట ఎత్తు పెంచే పనులు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆ పనులు చేయడం వల్ల దిగువ ప్రాంతానికి ఎలాంటి నష్టం లేదంటూఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. స్పందించిన కృష్ణాబోర్డు ఆర్డీఎస్ ఆనకట్టను టీబీబోర్డు పరిధిలోకి చేర్చుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో చర్చలు జరపాలని మూడు రోజుల క్రితమే టీబీ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఈమేరకు ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించేందుకు టీబీ బోర్డు అధికారుల బృందం సోమవారం రానుంది. ఈ నెల 25వ తేదీన మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులతో చర్చలు జరిపేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్చలతోనే వివాదం పరిష్కారం ఆర్డీఎస్ ఆనకట్టపై చాలా రోజుల నుంచి రగులుతున్న వివాదంపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితే పరిష్కారమవుతుంది. సున్నితమైన సమస్యపై తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింటే బాగుండేది. ఆర్డీఎస్ టీబీ బోర్డు పరిధిలోకి పోతే నష్టం అని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఆనకట్ట వెంట్స్ మూత వేస్తే మాత్రం దిగువ ఉన్న కేసీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. - సుబ్బరాయుడు, సాగు నీటిరంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ టీబీ బోర్డుపరిధిలోకి చేర్చితే సీమకే నష్టం ! తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి మండలం రాజోలి బండ గ్రామం, కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామాల మధ్య ఆర్డీఎస్ ఆనకట్టను నిర్మించారు. ఎడమ వైపునకు ఆర్డీఎస్ కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ నుంచే కర్ణాటక, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్ట ఎత్తును మరో 6 ఇంచులు పెంచుకుంటే తమ ప్రాంతానికి కొంత మేరకైనా నీరు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరాట పడుతుండగా.. ఈవిధంగా చేస్తే దిగువకు నీరు రాదని కర్నూలు జిల్లా ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక వేళ ఆనకట్టను టీబీ బోర్డు పరిధిలోకి చేర్చితే రాయల సీమ జిల్లాలకు తీవ్రమైన సాగు, తాగు నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బోర్డు పరిధిలో ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాల్వలకు వాటా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ వివాదంపై చర్చించేందుకు చర్చలకు రావాలని తెలంగాణ ప్రభుత్వం పిలిచినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. కనీసం దీనిపై కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వివాదం పరిష్కారమయ్యేలా చూడాలని ఈ ప్రాంత రైతులు, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
జలజగడం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. కర్ణాటక జల చౌర్యం.. టీబీ బోర్డు పక్షపాతం వెరసి ‘సీమ’లో జలయుద్ధాలకు దారితీస్తోంది. వందలాది మంది రైతులతో కలిసి పీబీసీ(పులివెందుల బ్రాంచ్ కెనాల్)కి వెళ్లే నీటిని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టీబీసీ(తాడిపత్రి బ్రాంచ్ కెనాల్)కి మళ్లిస్తే.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని నదిలోకి వదిలి రైపేరియన్ రైట్స్(సాగు హక్కుల)ను పరిరక్షించాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ ఎత్తున ఆందోళన చేశారు. డ్యామ్‌లో నీటి లభ్యత 150 టీఎంసీల నుంచి 133 టీఎంసీలకు తగ్గిందని సాకు చూపి, తొలుత కేటాయించిన నీటిలోనే తుంగభద్ర బోర్డు ఇష్టానుసారం కోతలు వేయడంతో ‘అనంత’ రైతులు విలవిలలాడుతున్నారు. నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. హెచ్చెల్సీ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి కేటాయించిన 26 టీఎంసీల్లో మన రాష్ట్ర సరిహద్దుకు చేరింది 15.56 టీఎంసీలే. తక్కిన 10.44 టీఎంసీలు ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలు, కర్ణాటక రైతుల జల చౌర్యానికి గురయ్యాయి. దీంతో పీబీసీ వాటా మేరకు, చిత్రావతి ద్వారా నీరందక తాడిపత్రి పరిసర ప్రాంతాల వారు, పుట్లూరు, యల్లనూరు మండలాలు, ధర్మవరం రూరల్, తాడిమర్రి, కదిరి, పుట్టపర్తి ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నార్పల మండలంలోని తుంపెర డీప్ కట్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి పీబీసీకి వెళుతున్న నీటిని అడ్డుకుని టీబీసీకి మళ్లించారు. టీబీసీ వాటా కోసం ఎంతవరకైనా పోరాడుతామన్నారు. మరో వైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ)కు విడుదల చేసిన నీటిని వెంటనే ఆపాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి, యల్లనూరు మాజీ ఎంపీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్నపల్లి వద్ద సీబీఆర్ సమీపంలోని బ్రిడ్జిపై ధర్నా చేశారు. సీబీఆర్ కింద భాగంలో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. రైపేరియన్ రైట్స్‌ను పరిరక్షించేందుకు సీబీఆర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని సీబీఆర్ నుంచి కిందకు విడుదల చేయాలని రైతులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద 49 చెరువులను హెచ్చెల్సీ నీటితో నింపాల్సి ఉంది. ఇందుకు 2.50 టీఎంసీల జలాలు అవసరం. కానీ.. ఆ మేరకు పీఏబీఆర్ జలాలు అందుబాటులో లేవు. అదనపు కేటాయింపునకు ఒత్తిడి ఏదీ? చాగల్లు రిజర్వాయర్‌కు హెచ్చెల్సీకి కేటాయించిన జలాల్లో 1.50 టీఎంసీలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీ బోర్డు నుంచి హెచ్చెల్సీకి అదనపు కేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు. అందుబాటులో ఉన్న నీళ్లతోనే చాగల్లుకు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నీటిని విడుదల చేయాలని రెండు రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో ఎంపీఆర్ నుంచి 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో టీబీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి అదనంగా నీటి కేటాయింపులు సాధించుకోక పోవడంతోనే ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.