తుంగభద్ర జలాశయానికి సెప్టెంబర్ 15 వరకూ మాత్రమే నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయానికి సెప్టెంబర్ 15 వరకూ మాత్రమే నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్‌లో కృష్ణ, తుంగభద్ర వాటర్ కమిషన్ బోర్డు చైర్మన్ ఆర్.కె. గుప్తా అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జలాశయంలో 52 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, 9,940 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అదే స్థాయిలో 8,078 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.
ఇన్‌ఫ్లో పడిపోయే∙కారణాలు కనిపిస్తుండడంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న తరహాలో వదిలితే సెప్టెంబర్ 15 నాటికి హెచ్చెల్సీ వాటా పూర్తవుతుందని లెక్కలు కట్టినట్లు తెలిసింది. త్వరలో ఆయకట్టుకు నీరు వదలాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తుంగభద్ర జలాశయం నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకూ నీటిని తీసుకుపోవడానికి కేంద్రం నుంచి స్పెషల్ పోలీస్ ఫోర్సును రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే ఎగువ ప్రాంతాల వారు నీటిని అక్రమంగా తీసుకునే అవకాశమున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో తుంగభద్ర బోర్డు మెంబర్ జగ్‌మోహన్‌గుప్తా, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(తెలంగాణా) మురళీధర్, జలవనరులశాఖ ప్రభుత్వ కార్యదర్శి గురుపదస్వామి, ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.