september 15th
-
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగాను పద్మ అవార్డులకు గాను నామినేషన్లు, సిఫారసుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తోంది. నామినేషన్లకు స్వీకరించేందుకు తుది గడువును సెప్టెంబర్ 15గా కేంద్రం తాజాగా ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది. పద్మ అవార్డులను "ప్రజల పద్మ" గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈనేపథ్యంలో మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్రం కోరింది. వారి ప్రతిభ, విజయాల ఆధారంగా, కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు అందజేయనున్నామని తెలిపింది. . ఆసక్తి, అర్హతగల వారు వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. కాగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ‘పీపుల్స్ పద్మ’ అవార్డులకు నామినేట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే (జూలై ,11న) దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్ -
సెప్టెంబర్15 నుంచి వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి సెలవులు, వారాంతపు విరామం లేకుండా మొత్తం 18 సిట్టింగ్లుండే ఈ సమావేశాల తేదీలు, ఇతర వివరాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భౌతిక దూరం నిబంధనల మేరకు సభ్యులు కూర్చునేందుకు వీలుగా లోక్సభ, రాజ్యసభ చాంబర్లతోపాటు గ్యాలరీలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు ఉభయసభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లో కూర్చుంటారని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. రాజ్యసభకు చెందిన 60 మంది సభ్యులు చాంబర్లోనూ, 51 మంది గ్యాలరీల్లోనూ, మిగతా 152 మంది లోక్సభ చాంబర్లోనూ ఆసీనులవుతారు. భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇదే ప్రథమం. లోక్సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. గ్యాలరీల్లో కూర్చునే సభ్యులు కూడా సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా హెడ్ఫోన్ల వంటి వాటితోపాటు భారీ డిస్ప్లే తెరలను ఏర్పాటు చేశారు. అల్ట్రావయెలెట్ వైరస్ నాశనులను, ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుల్ వ్యవస్థను, పాలీకార్బొనేట్ తెరలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఉభయసభలను ఉదయం, సాయంత్రం షిఫ్టుల వారీగా నిర్వహిస్తారు. చివరిసారిగా పార్లమెంట్ సమావేశాలు మార్చి 23వ తేదీన కోవిడ్ కారణంగా వాయిదాపడ్డాయి. -
15 వరకే హెచ్చెల్సీకి నీరు
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయానికి సెప్టెంబర్ 15 వరకూ మాత్రమే నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్లో కృష్ణ, తుంగభద్ర వాటర్ కమిషన్ బోర్డు చైర్మన్ ఆర్.కె. గుప్తా అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జలాశయంలో 52 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, 9,940 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అదే స్థాయిలో 8,078 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. ఇన్ఫ్లో పడిపోయే∙కారణాలు కనిపిస్తుండడంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న తరహాలో వదిలితే సెప్టెంబర్ 15 నాటికి హెచ్చెల్సీ వాటా పూర్తవుతుందని లెక్కలు కట్టినట్లు తెలిసింది. త్వరలో ఆయకట్టుకు నీరు వదలాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తుంగభద్ర జలాశయం నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకూ నీటిని తీసుకుపోవడానికి కేంద్రం నుంచి స్పెషల్ పోలీస్ ఫోర్సును రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే ఎగువ ప్రాంతాల వారు నీటిని అక్రమంగా తీసుకునే అవకాశమున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో తుంగభద్ర బోర్డు మెంబర్ జగ్మోహన్గుప్తా, నీటిపారుదలశాఖ ఈఎన్సీ(తెలంగాణా) మురళీధర్, జలవనరులశాఖ ప్రభుత్వ కార్యదర్శి గురుపదస్వామి, ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.