hlc water
-
ఆగస్టు 30 తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీకి) నీటి విడుదల వాయిదా పడింది. మంగళవారం రాత్రి వరకు ఆశలు ఉన్నా చివరకు నీళ్లు విడుదల చేయడం లేదని తెలిసి హెచ్చెల్సీ అధికారులు నిట్టూర్చారు. జిల్లాలో తాగునీటికి సైతం నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బళ్లారి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తుంగభద్ర బోర్డు అధికారులతో కూడా చర్చించారు. ఆ మేరకు మంగళవారం నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు సూచప్రాయంగా తెలియజేశారు. అయితే చివరకు హెచ్చెల్సీ అధికారుల ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కోరుతూ ఇచ్చిన ఇండెంట్‌ను మాత్రమే స్వీకరించారు. దీనిపై అనుమతులు పొందిన తర్వాత నీటిని విడుదల చేస్తామని జిల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే సోమవారం బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య నీటి విడుదలపై ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. తుంగభద్రలోని నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతు సంఘాలతో చర్చించిన అనంతరం కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు 31 తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేస్తారని సంకేతాలు పంపినట్లయింది. ఇదే జరిగితే జిల్లాలో కోలాహలంగా జరుపుకునే వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది. -
హెచ్చెల్సీకి నీటి సాధన రైతుల విజయం
∙అఖిలపక్ష నాయకులు అనంతపురం సప్తగిరి సర్కిల్: హెచ్చెల్సీకి నీటి కేటాయింపు అన్నది రైతులు సాధించిన నైతిక విజయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, ౖరైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ఏపీసీసీ అధికార ప్రతినిధి రమణ తెలిపారు. సోమవారం వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, రైతులు ఎగువపల్లి వద్ద నిర్వహించిన డీఈ కార్యాలయ ముట్టడిపై అధికారులు స్పందించారన్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 31 వరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారని వారు తెలిపారు. జిల్లాలో కరువును రూపుమాపేందుకు ఉన్నతా«ధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, అఖిలపక్ష నాయకులకు, వివిధ శాఖల అ«ధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓపికను పరీక్షించొద్దు
– ఈ నెల 20 నుంచి ఆయకట్టుకు నీరివ్వకపోతే చావోరేవో తేల్చుకుంటాం – హెచ్చెల్సీ ఎస్ఈకి మాజీ ఎంపీ అనంత అల్టిమేటం – రైతులతో కలిసి ఆందోళన అనంతపురం సెంట్రల్ : ‘రెండేళ్లుగా ఆయకట్టుకు నీరివ్వడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ కింద హక్కుదారులుగా ఉన్న రైతులను కాదని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించొద్దు. ఈనెల 20 నుంచి ఆయకట్టుకు నీరు వదిలితే పొలాల్లోకి పార తీసుకొని వెళతాం. లేకుంటే చావోరేవో తేల్చుకుంటా’మని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన lకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన శింగనమల నియోజకవర్గ పార్టీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, ఆయకట్టు రైతులతో కలిసి స్థానిక హెచ్చెల్సీ కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) శేషగిరిరావును కలిశారు. ఆయకట్టుకు నీరివ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఎస్ఈతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ... ‘గతంలో అనేక కరువులు చూశాం. అప్పట్లో ఎంత కష్టమైనా ఆయకట్టుకు నీరొచ్చాయి. కానీ ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హెచ్చెల్సీ పరిధిలో లేకపోయినప్పటికీ కొందరు అధికారబలంతో కళ్లెదుటే అక్రమంగా నీటిని తీసుకెళుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పొలాలకు, వారి పరిసర ప్రాంతాలకు లబ్ధి కలిగేలా వ్యవహరిస్తున్నార’ని మండిపడ్డారు. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల నుంచి జిల్లాకు నీటిని తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీల కే సీ కెనాల్ వాటాను మన జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించారని గుర్తు చేశారు. కానీ మీ అలసత్వంతో ఈ ఏడాది ఇప్పటికే 1.8 టీఎంసీ నీటిని కర్నూలు జిల్లా వారు తీసుకుపోతున్నారన్నారు. రెండేళ్లుగా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఎంపీ సౌత్, నార్త్‌కెనాల్, తాడిపత్రి బ్రాం^Œ lకెనాల్‌కు నీరివ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. ఈ ఏడాది కూడా నీరు విడుదల చేయకపోతే ఈ ప్రాంతంలో పండ్లతోటలు ఏఒక్కటీ మిగలవని హెచ్చరించారు. ఆయకట్టును కాదని చెరువులకు నీరెలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయకట్టు తర్వాత మిగులు జలాలుంటేనే చెరువులకు ఇవ్వాలన్నారు. తుంగభద్ర నుంచి ప్రస్తుత వాటా 10 టీఎంసీలు, కేసీ కెనాల్ వాటా 3 టీఎంసీలు, ఇటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేటాయించిన 9 టీఎంసీలతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని జనవరి నెలాఖరు వరకూ తీసుకొచ్చి హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ కింద సాగైన పంటలను కాపాడడంతో పాటు ఎంపీ సౌత్,నార్త్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ తదితర వాటి కింద ఆయకట్టులో ఆరుతడి పంటలకైనా నీరు వదలాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రెయిన్గన్ల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో వేరుశనగను కాపాడినట్లు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు గొప్పలు చెబుతున్నారని, అలాంటిది హెచ్చెల్సీ కింద 60 వేల ఎకరాల్లో పంటను కాపాడలేరా అని ప్రశ్నించారు. ఎస్ఈ శేషగిరిరావు స్పందిస్తూ కలెక్టర్‌తో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ జయరామిరెడ్డి, పుట్లూరు,బుక్కరాయసముద్రం సింగిల్‌విండోల అధ్యక్షులు రాఘవరెడ్డి, నాగలింగారెడ్డి, పార్టీ మండల మాజీ కన్వీనర్ బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు నారాయణరెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు ఆకులేడు రామచంద్రారెడ్డి, చెన్నంపల్లి రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
15 వరకే హెచ్చెల్సీకి నీరు
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయానికి సెప్టెంబర్ 15 వరకూ మాత్రమే నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్‌లో కృష్ణ, తుంగభద్ర వాటర్ కమిషన్ బోర్డు చైర్మన్ ఆర్.కె. గుప్తా అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జలాశయంలో 52 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, 9,940 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అదే స్థాయిలో 8,078 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో పడిపోయే∙కారణాలు కనిపిస్తుండడంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న తరహాలో వదిలితే సెప్టెంబర్ 15 నాటికి హెచ్చెల్సీ వాటా పూర్తవుతుందని లెక్కలు కట్టినట్లు తెలిసింది. త్వరలో ఆయకట్టుకు నీరు వదలాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తుంగభద్ర జలాశయం నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకూ నీటిని తీసుకుపోవడానికి కేంద్రం నుంచి స్పెషల్ పోలీస్ ఫోర్సును రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే ఎగువ ప్రాంతాల వారు నీటిని అక్రమంగా తీసుకునే అవకాశమున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో తుంగభద్ర బోర్డు మెంబర్ జగ్‌మోహన్‌గుప్తా, నీటిపారుదలశాఖ ఈఎన్సీ(తెలంగాణా) మురళీధర్, జలవనరులశాఖ ప్రభుత్వ కార్యదర్శి గురుపదస్వామి, ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.