అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీకి) నీటి విడుదల వాయిదా పడింది. మంగళవారం రాత్రి వరకు ఆశలు ఉన్నా చివరకు నీళ్లు విడుదల చేయడం లేదని తెలిసి హెచ్చెల్సీ అధికారులు నిట్టూర్చారు. జిల్లాలో తాగునీటికి సైతం నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బళ్లారి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తుంగభద్ర బోర్డు అధికారులతో కూడా చర్చించారు. ఆ మేరకు మంగళవారం నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు సూచప్రాయంగా తెలియజేశారు. అయితే చివరకు హెచ్చెల్సీ అధికారుల ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కోరుతూ ఇచ్చిన ఇండెంట్‌ను మాత్రమే స్వీకరించారు.
దీనిపై అనుమతులు పొందిన తర్వాత నీటిని విడుదల చేస్తామని జిల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే సోమవారం బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య నీటి విడుదలపై ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. తుంగభద్రలోని నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతు సంఘాలతో చర్చించిన అనంతరం కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు 31 తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేస్తారని సంకేతాలు పంపినట్లయింది. ఇదే జరిగితే జిల్లాలో కోలాహలంగా జరుపుకునే వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది.
ఆగస్టు 30 తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు
Published Tue, Aug 22 2017 10:03 PM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM
Advertisement