సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. కర్ణాటక జల చౌర్యం.. టీబీ బోర్డు పక్షపాతం వెరసి ‘సీమ’లో జలయుద్ధాలకు దారితీస్తోంది. వందలాది మంది రైతులతో కలిసి పీబీసీ(పులివెందుల బ్రాంచ్ కెనాల్)కి వెళ్లే నీటిని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టీబీసీ(తాడిపత్రి బ్రాంచ్ కెనాల్)కి మళ్లిస్తే.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని నదిలోకి వదిలి రైపేరియన్ రైట్స్(సాగు హక్కుల)ను పరిరక్షించాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ ఎత్తున ఆందోళన చేశారు.
డ్యామ్‌లో నీటి లభ్యత 150 టీఎంసీల నుంచి 133 టీఎంసీలకు తగ్గిందని సాకు చూపి, తొలుత కేటాయించిన నీటిలోనే తుంగభద్ర బోర్డు ఇష్టానుసారం కోతలు వేయడంతో ‘అనంత’ రైతులు విలవిలలాడుతున్నారు.
నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. హెచ్చెల్సీ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి కేటాయించిన 26 టీఎంసీల్లో మన రాష్ట్ర సరిహద్దుకు చేరింది 15.56 టీఎంసీలే. తక్కిన 10.44 టీఎంసీలు ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలు, కర్ణాటక రైతుల జల చౌర్యానికి గురయ్యాయి.
దీంతో పీబీసీ వాటా మేరకు, చిత్రావతి ద్వారా నీరందక తాడిపత్రి పరిసర ప్రాంతాల వారు, పుట్లూరు, యల్లనూరు మండలాలు, ధర్మవరం రూరల్, తాడిమర్రి, కదిరి, పుట్టపర్తి ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నార్పల మండలంలోని తుంపెర డీప్ కట్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి పీబీసీకి వెళుతున్న నీటిని అడ్డుకుని టీబీసీకి మళ్లించారు. టీబీసీ వాటా కోసం ఎంతవరకైనా పోరాడుతామన్నారు.
మరో వైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ)కు విడుదల చేసిన నీటిని వెంటనే ఆపాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి, యల్లనూరు మాజీ ఎంపీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్నపల్లి వద్ద సీబీఆర్ సమీపంలోని బ్రిడ్జిపై ధర్నా చేశారు. సీబీఆర్ కింద భాగంలో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. రైపేరియన్ రైట్స్‌ను పరిరక్షించేందుకు సీబీఆర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని సీబీఆర్ నుంచి కిందకు విడుదల చేయాలని రైతులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద 49 చెరువులను హెచ్చెల్సీ నీటితో నింపాల్సి ఉంది. ఇందుకు 2.50 టీఎంసీల జలాలు అవసరం. కానీ.. ఆ మేరకు పీఏబీఆర్ జలాలు అందుబాటులో లేవు.
అదనపు కేటాయింపునకు ఒత్తిడి ఏదీ?
చాగల్లు రిజర్వాయర్‌కు హెచ్చెల్సీకి కేటాయించిన జలాల్లో 1.50 టీఎంసీలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీ బోర్డు నుంచి హెచ్చెల్సీకి అదనపు కేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు. అందుబాటులో ఉన్న నీళ్లతోనే చాగల్లుకు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నీటిని విడుదల చేయాలని రెండు రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో ఎంపీఆర్ నుంచి 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో టీబీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి అదనంగా నీటి కేటాయింపులు సాధించుకోక పోవడంతోనే ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.
జలజగడం
Published Tue, Jan 14 2014 2:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement