సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయానికి వరదతోపాటు పూడిక కూడా పోటెత్తుతోంది. రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సగటున వంద అడుగుల ఎత్తున కొండలా పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం ఏటా తగ్గిపోతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించినప్పుడు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా పూడిక పేరుకుపోవడంతో 215.81 టీఎంసీలకు తగ్గింది. అయితే ఇప్పుడు నిల్వ సామర్థ్యం ఇంతకూడా ఉండే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత సోమవారం అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్(ఏడీసీపీ) పరికరంతో హైడ్రోమెట్రిక్ సర్వే నిర్వహించగా పూడిక మరింత పేరుకుపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర అధ్యయన బాధ్యతను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అప్పగించాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను భారీ ఎత్తున నరకడం వల్ల భూమి కోతకు గురై వరదల సమయంలో శ్రీశైలంలోకి పూడిక చేరుతోందని విశ్లేషిస్తున్నారు.
నాడు పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ..
కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద 308.06 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని 1960లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో చేపట్టారు. 1981 నాటికి నిర్మాణం పూర్తయింది. సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ, స్టెబులిటీ ప్రొటోకాల్ ప్రకారం అప్పుడు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 308.06 టీఎంసీలను నిల్వ చేశారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యంపై 2001–02లో అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ పూడిక వల్ల 264.83 టీఎంసీలకు తగ్గినట్లు తేల్చింది. అంటే నిల్వ సామర్థ్యం 43.23 టీఎంసీలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అనంతరం 2009–10లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే దాదాపు దశాబ్దం వ్యవధిలో పూడిక ప్రభావం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 49.02 టీఎంసీలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి చూస్తే నీటి నిల్వ సామర్థ్యం 92.25 టీఎంసీలు తగ్గినట్లు వెల్లడవుతోంది.
ఆయకట్టుకు నీళ్లు సవాలే..
శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు కాగా రిజర్వాయర్ ఎగువన కృష్ణా నది మట్టం (బెడ్ లెవల్) సగటున 500 అడుగులు ఉంటుంది. తాజాగా నిర్వహించిన హైడ్రోమెట్రిక్ సర్వేలో నది మట్టం 600 అడుగులకు పెరిగినట్లు తేలింది. అంటే సగటున వంద అడుగుల మేర పూడిక పేరుకుపోయినట్లు స్పష్టమవుతోంది. పూడిక కొండలా మారడంతో నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీల కంటే మరింత తగ్గే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 25 టీఎంసీల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయంపై ఆధారపడి ఏపీలో తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులున్నాయి. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గితే ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీడబ్ల్యూసీకి అప్పగించాం..
శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక వల్ల నిల్వ సామర్థ్యం ఇప్పటికే 308.06 టీఎంసీల నుంచి 215.81 టీఎంసీలకు తగ్గింది. వంద అడుగుల ఎత్తున పూడిక పేరుకుపోయినట్లు హైడ్రోమెట్రిక్ సర్వేలో తేలింది. ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కూడా ఉండే అవకాశం లేదు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించాం.
– మురళీనాథ్‌రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్
Comments
Please login to add a commentAdd a comment