సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులోకి 39,870 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,593 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 880 అడుగుల్లో 188.13 టీఎంసీలకు తగ్గింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 62,983 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 550.2 అడుగుల్లో 210.22 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ద్వారా కృష్ణాలోకి వరద చేరుతోంది.
పులిచింతల్లోకి 8,775 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుదుత్పత్తి చేస్తూ 10,800 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల్లో 45.77 టీఎంసీలకుగానూ 40.54 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల వరద తోడైంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 37,078 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 5,993 క్యూసెక్కులు వదులుతూ మిగలుగా ఉన్న 31,085 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
కృష్ణా ప్రధాన పాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 17,540 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 43,909 క్యూసెక్కులు చేరుతుండగా, 1,632.72 అడుగుల్లో 104.66 టీఎంసీలను నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న 37,165 క్యూసెక్కులను స్పిల్ వే 12 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంలోకి వరద ప్రవాహం కాస్త పెరగనుంది.
సాగర్‌లో 210.22 టీఎంసీల నిల్వ
Published Thu, Jul 28 2022 3:33 AM | Last Updated on Thu, Jul 28 2022 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment