ఖమ్మంఅర్బన్: జనాభా.. జంతు.. పశు.. ఇప్పుడు జలాశయాల గణన. వీటన్నింటి తరహాలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఐదేళ్లకోసారి చేపట్టే చిన్ననీటి వనరుల గణనతోపాటు ఈసారి జలాశయాల నమోదుకు పూనుకుంది. గతంలో ఐబీ(ఇరిగేషన్) అధికారులు చేపట్టిన తరహాలోనే జియో ట్యాగింగ్ ద్వారా జలాశయాల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల సహాయంతో గణన చేపట్టబోతున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, జిల్లాస్థాయిలో కలెక్టర్.. గణాంకాధికారుల పర్యవేక్షణలో చేపట్టే గణనలో మత్స్య శాఖ, చిన్ననీటిపారుదల శాఖ అధికారి, మండల వ్యవసాయాధికారి, ఏఎస్‌ఓలు భాగస్వాములవుతారు.
గతంలో నీటిపారుదల శాఖ అధికారులు కేవలం చెరువుల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేశారు. ఈసారి మాత్రం చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు తదితర వాటి వివరాలను నమోదు చేస్తారు. చెరువు, కుంట వైశాల్యం.. దాని కింద సాగవుతున్న భూమి.. తాగునీటి అవసరాలు ఏ మేరకు తీరుస్తుంది.. ఎన్ని గ్రామాలు, కాలనీలకు ఉపయోగపడుతుంది.. ఇలాంటి వివరాలన్నీ జియో ట్యాగింగ్ విధానంలో పొందుపరిచిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ట్యాంక్‌లు, చెక్‌డ్యాంలు, కుంటలు, జలాశయాల సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
స్టాండింగ్ కమిటీ సూచనల మేరకే..
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆయా చెరువుల వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుంది.. దానికి అందే నీటివనరులు ఏమిటి.. ఆయకట్టు, తాగునీటి అవసరాలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది.. ప్రస్తుతం జలాశయం పరిస్థితి.. అభివృద్ధి చేస్తే ఎంతమేర ఉపయోగం వంటి సమగ్ర వివరాలు ఈ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడి నుంచైనా జలాశయాల సమాచారం ఎవరైనా తెలుసుకునేందుకు సులువుగా ఉంటుంది.
గణన విధానం..
జలాశయాల గణన విధానంలో జలాశయం విస్తీర్ణం, ఆయకట్టు, విస్తీర్ణంలో వినియోగపు వివరాలు, ఉపయోగంలో లేని జలాశయాలు తదితర ప్రభుత్వ వనరుల వివరాలు, గ్రామ రికార్డుల్లో పహాణీ, అడంగల్, సెటిల్మెంట్ రిజిస్టర్, ఫైనల్ పట్టీలతో రెవెన్యూ శాఖ నుంచి రికార్డులను సేకరించి.. నమోదు చేయాల్సి ఉంటుంది. జలాశయం ఉనికి వివరాల సర్వే, సబ్ డివిజన్ నంబర్, గ్రామ నక్షా, మ్యాప్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. జలాశయం విస్తీర్ణం, అడంగల్ పహాణీ నుంచి పొందాల్సి ఉంటుంది.
అవగాహన సదస్సులు
జలాశయాల నమోదుపై మండలాలవారీగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి.. జియో ట్యాగింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. అందులో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు.. ఇన్‌చార్జ్ ఏఎస్‌ఓ సుమన్, నీటిపారుదల శాఖ ఏఈ శివ, మండల వ్యవసాయాధికారి భాస్కర్‌రావు, ఏపీఓ అమ్మాజాన్ తదితరులు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment