జలకళ ఉట్టిపడాలె | cm kcr meeting in gajwel | Sakshi
Sakshi News home page

జలకళ ఉట్టిపడాలె

Published Sat, Mar 5 2016 4:27 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

జలకళ ఉట్టిపడాలె - Sakshi

జలకళ ఉట్టిపడాలె

దత్తత గ్రామాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపు
మే 15లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి
రెండు ఊర్లలోనూ ఒకేరోజు గృహప్రవేశం
నేను వస్తా... పెద్ద పండుగ జేసుకుందాం
సీఎం కేసీఆర్ వెల్లడి ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో పర్యటన
డబుల్ ఇళ్లు, చెరువు, కుంటల పనుల పరిశీలన

గజ్వేల్/జగదేవ్‌పూర్:  ‘ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఇక జలకళ ఉట్టిపడాలె.. ఇప్పుడున్న చెరువులు, కుంటల సామర్థ్యం పెంచుకుంటున్నం... ఈ పనులు పూర్తయితే మీకు ఢోకా ఉండదు. భూగర్భజలం పెరుగుతది... మరో రెండున్నరేళ్లయితే గోదావరి నదే మీ తలాపునకు వస్తది.. అప్పుడైతే మీకు 365 రోజులూ సాగు నీరొస్తది’... అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తన దత్తత గ్రామాలైనజగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, చెరువు, కుంటల అభివృద్ధి, కుడ్లేరు వాగు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ముందుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని ఎర్రకుంట వద్దకు చేరుకున్నారు. గతంలో 1.7 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్‌ఫీట్స్) నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ చెరువును ప్రస్తుతం 25 ఎంసీఎఫ్‌టీకి  పెంచుతున్నట్టు ఇరిగేషన్ ఎస్‌ఈ పద్మారావు, ఈఈ ఆనంద్, కన్సల్టెంట్ మల్లయ్యలు సీఎంకు వివరించారు. కుంటను అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులను ఇప్పటికే వేగవంతం చేశామన్నారు. ఈ చెరువు నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల వందలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరగడమేగాకుండా సుమారు 50 ఎకరాలకుపైగా భూములకు ప్రత్యక్షంగా నీరందే అవకాశముందని వారు సీఎంకు  నివేదించారు.

ఈ సందర్భంగా కుంట కు సంబంధించిన పనుల మ్యాపును కేసీఆర్ పరిశీలించారు. ఆ తరువాత మసిరెడ్డికుంట,  లింగరాజ్‌కుంట పనులను సీఎం పరిశీలించారు. ఆ తరువాత నర్సన్నపేటలో రూ.28 కోట్లతో చేపడుతోన్న కుడ్లేరువాగు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వాగుపై నిర్మించనున్న ఐదు చెక్‌డ్యాంల నీటి నిల్వ సామర్థ్యం 47 ఎంసీఎఫ్‌టీలుగా ఉందని అధికారులు సీఎంకు వివరిం చారు. ఎర్రవల్లి సమీపంలో నిర్మించను న్న పాండురంగసాగర్ చెరువు పనుల వివరాలను సైతం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన చెరువు, కుంటల అభివృద్ధి ద్వారా ఈ రెండు గ్రామాల్లో 200 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. గతంలో వీటి నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 8 ఎంసీఎఫ్‌టీలు మాత్రమేనని చెప్పారు. ఈ పనులను మే 15లోగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఎర్రవల్లి, నర్సన్నపేటలో జలకళ ఉట్టిపడేలా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండున్నరేళ్లలోపు 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వర్గల్ మండలం పాములపర్తిలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తెప్పించి ఆ నీటితో ఇక్కడి చెరువులన్నీ నింపేస్తామన్నారు.

 ఒకేసారి ఇండ్లళ్లకు పోదాం..
ఎర్రవల్లి గ్రామంలో నమూనాగా పూర్తి చేసిన రెండు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ‘ఇండ్లు ఎట్లున్నయ్..?’ అంటూ స్థానికులను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గదులు, వరండా, బాత్‌రూమ్‌లు, స్లాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో నామూనా ఇంటిని పరిశీలించి సభకు వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశం ఎదురుపడ్డాడు. ‘ఏమ్ సేట్ ఎట్లుంది ఇల్లు’ అంటూ సీఎం అతణ్ణి పలుకరించారు. వెంకటేశం రెండు చెతులు జోడించి బాగున్నాయ్ సారూ... అంటూ అనందం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతను మోస్తున్న జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని అభినందనల్లో ముంచెత్తారు.

ఎర్రవల్లి తరహాలోనే కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరుకు కూడా ఇండ్లు ఇచ్చినా అక్కడి అధికారులు ఇంకా కట్టలేకపోతున్నారన్నారు. ‘మన జేసీ చానా హుషారున్నడు... అందుకే ఇండ్లు తొందరగా కట్టిస్తుండు’ అంటూ కితాబిచ్చారు. అదే విధంగా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. మే నెల 15 వరకు రెండు గ్రామాల్లో వందశాతం ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ‘పనులు పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఇండ్లళ్లకు (గృహప్రవేశాలు)పోదాం.... నేను కూడా ఒస్త... పెద్ద పండుగ జేసుకుందాం’...అని చెప్పారు. ఈ లోపు ప్రతి ఇంటికి వివిధ రకాల పచ్చని మొక్కలను పంపిణీ చేయాలని జేసీకి సూచించారు.

 సర్పంచ్‌లు రాజీనామా చేసే పరిస్థితి రాదనుకుంటున్న....
‘ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో జూన్ నుంచి ఒక్కరు కూడా బిందెలు పట్టుకుని రోడ్డు మీదికి వస్తే సర్పంచ్‌లు రాజీనామాలు చేయాలి. అలాగే జెడ్పీటీసీ కూడా రాజీనామా చేయాలి. ఆ పరిస్థితి రానియ్యకుండా మన అధికారులు పనులు చేస్తారని, గ్రామస్తులు కూడా సహకరిస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని సీఎం అన్నారు.  కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement