పెంచిన చేతులనే కాటేశారు
పెంచిన చేతులనే కాటేశారు
Published Sat, Jan 28 2017 12:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డల్లా సాకిన ఆ తండ్రుల పాలిట వారు కాలయములయ్యారు. ఆస్తికోసం మమతానురాగాలకు సమాధి కట్టారు. ఏలూరులో ఓ దత్త పుత్రిక, నల్లజర్లలో ఓ పెంపుడు కొడుకు పెంచిన చేతులనే కాటేశారు. తండ్రులను కడతేర్చారు.
దత్తపుత్రిక దారుణం
ఏలూరు(సెంట్రల్) : ఆస్తికోసం తండ్రిని కడతేర్చిన దత్తపుత్రికతోపాటు ఆమెకు సహకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఏలూరు సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వివరించారు. ఆయన కథనం ప్రకారం... బయ్యారపు వెంకయ్య(65) స్థానిక శనివారపుపేట ఇందిరా కాలనీలో ఉండేవాడు. వెంకయ్య 20 ఏళ్లక్రితం మాదేపల్లికి చెందిన తన మిత్రుడు నున్న లక్షీ్మనారాయణ కుమారై ఉషారాణిని దత్తత తీసుకున్నాడు. ఉషారాణికి 2008లో విజయ్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. వారికి ఇద్దరు సంతానం. ఉషారాణి నాలుగేళ్ల క్రితం భర్తకు దూరమై తండ్రి వద్దే ఉంటోంది. వట్లూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ షాజహాన్ అలియాస్ సల్మాన్ ఖాన్‌తో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి వెంకయ్య ఆస్తిపై కన్నేసింది. ప్రియుడు షాజహాన్‌తో కలిసి వెంకయ్యను కడతేర్చేందుకు పథకం పన్నింది. దీంతో ఉషారాణి, షాజహాన్ అతని మిత్రులైన దుగ్గిరాలకు చెందిన కానూరి ఏసు, పత్తేబాదకు చెందిన గరికిపాటి మణికంఠ కలిసి డిసెంబర్ 18న వెంకయ్య ఇంట్లో నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తరువాత అనుమానం రాకుండా మృతదేహాన్ని తీసుకువెళ్లి పడమట లాకుల వద్ద రైలు పట్టాలపై పడవేశారు. దీనిపై రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
విచారణలో వెలుగు చూసిన నిజాలు
రైలు పట్టాలపై దొరికిన వెంకయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో హత్యగా వైద్యులు నిర్ధారించారు. దీంతో రైల్వే పోలీసులు కేసును త్రీటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. త్రీటౌన్ పోలీసులు వెంకయ్య కుటుంబ సభ్యులను విచారించారు. ఉషారాణి కుమారైలు తాతయ్యను తన తల్లి, మరి కొందరు కలిసి చంపారని చెప్పారు. దీంతో పోలీసులు అప్పట్లోనే ఉషారాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె హత్యకు సహకరించిన వారి పేర్లను పోలీసులకు వెల్లడించింది. దీంతో నలుగురినీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్సై సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు.
పెంచిన కొడుకు అమానుషం
కొవ్వూరు రూరల్ /నల్లజర్ల : పెంచిన తండ్రిని ఓ కొడుకు తన భార్యతో కలిసి పాశవికంగా హత్యచేశాడు. ఈ నెల 11న రాత్రి నల్లజర్ల మండలం కొత్తగూడెంలో జరిగిన ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం సీఐ జి. మధుబాబు శుక్రవారం వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన శిఖా కృష్ణమూర్తి(52)కి పిల్లలు లేరు. దీంతో తన అన్న లక్ష్మణరావు నాలుగో కుమారుడిని వెంకటదుర్గారావు దత్తత తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం కృష్ణమూర్తి భార్య వెంకటరమణ మృతి చెందింది. దీంతో కృష్ణమూర్తి కొడుకు వద్దే ఉంటున్నాడు. కృష్ణమూర్తి పేరున ఉన్న ఎకరంన్నర పొలాన్ని తన పేర రాయాలని తరచూ దుర్గారావు ఒత్తిడి తెస్తున్నాడు. తన తదనంతరమే అది దుర్గారావుకు చెందుతుందని కృష్ణమూర్తి తేల్చిచెప్పాడు. దీంతో ఎలాగైనా కృష్ణమూర్తిని కడతేర్చాలని దుర్గారావు పన్నాగం పన్నాడు. ఈనెల 11న రాత్రి మద్యం సీసాలో నిద్రమాత్రలు కలిపి తండ్రికి ఇచ్చాడు. దానిని తాగి పడుకున్న కృష్ణమూర్తిని దుర్గారావు, అతని భార్య వెంకటలక్ష్మి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గొనె సంచిలో కుక్కి బైక్‌పై మధ్యలో పెట్టుకుని విజ్జేశ్వరం సమీపంలోకి తీసుకెళ్ళి ముళ్ల పొదల్లో పడేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన తండ్రి కనపడటం లేదంటూ గ్రామంలోని బంధువుల ఇళ్లకు దుర్గారావు వెళ్లాడు. వారం తర్వాత మృతదేహం వాసన వస్తే తమ గుట్టు బయట పడుతుందని భావించి మళ్ళీ భార్యభర్తలిద్దరూ 18న రాత్రి కిరోసిన్ తీసుకెళ్ళి చీకట్లో మృతదేహాన్ని తగలబెట్టారు. అనంతరం 21న తండ్రి కనపడటం లేదంటూ దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 26న ఈవిషయమై దుర్గారావుకు, లక్ష్మణరావు ముగ్గురు కుమారులకు మధ్య వివాదం జరిగింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అతను శుక్రవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, అనంతపల్లి ఎస్సై వి.వెంకటేశ్వరరావు మృతదేహం తగలబెట్టిన స్థలాన్ని పరిశీలించారు. సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులకు ముందే అనుమానం
ఈ ఘటనపై పోలీసులకు ముందే అనుమానం వచ్చింది. దుర్గారావు ఫిర్యాదు చేసిన నాటి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. దీంతో దుర్గారావు ఊరు వదిలిపోయాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానిక వీఆర్‌వో వద్ద తానే హత్య చేశానని వెంకట దుర్గారావు లొంగిపోయా డు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement