పెంపుడు తల్లిదండ్రులతో తన్విత
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప – రాజేందర్‌ల దత్త పుత్రిక తన్వితకు తాత్కాలికంగా విముక్తి లభించింది. 160 రోజుల పాటు ఖమ్మం బాలల సదనంలో ఉన్న తన్విత.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బుధవారం రాత్రి బాలల సదనం నుంచి పెంపుడు తల్లి వేముల స్వరూప చెంతకు చేరింది.
తన్వితను తనకే అప్పగించాలని, కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు తనవద్దే ఉంచే లా ఆదేశించాలని స్వరూప కోర్టును అభ్యర్థించింది. ఆమె ఫిర్యాదును విచారించిన కోర్టు.. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి తన్వితను బాలల సదనంలో ఉంచటం కంటే పెంపుడు తల్లి విన్నపం మేరకు ఆమెకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది...
తన్విత కన్న తల్లిదండ్రులు భావ్‌సింగ్ – ఉమ ఇల్లెందులోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తూ స్టేషన్‌బస్తీలో నివాసం ఉండేవారు. వారికి తొ లి సంతానంగా పాప జన్మించింది. ఆ తర్వా త ఉమ మరోసారి గర్భం దాల్చడంతో రెండో సంతానంలోనూ పాప పుడితే ఎలా అనే సందేహం వచ్చింది.
ఈ విషయాన్ని స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి దృష్టికి తెచ్చారు. ఉమకు అబార్షన్ చేయించాలని కోరారు. అయితే అప్పటికే ఆమెకు ఆరో నెల రావడంతో అబార్షన్ సాధ్యం కాదని ఆర్‌ఎంపీ సూచించారు. ఒకవేళ ఆడబిడ్డ పుడితే సంతానం లేని వారికి ఇస్తారా అని ఆ వైద్యుడు అడగడంతో భావ్‌సింగ్ అంగీకరించాడు.
కాగా, వేముల స్వ రూప – రాజేందర్ దంపతులు కూడా ఎక్కడైనా పాప దొరికితే పెంచుకుంటామని ఆర్‌ఎ ంపీ వైద్యుడి వద్ద పలుమార్లు ప్రస్తావించారు. దీంతో ఆర్‌ఎంపీ ఉమకు పుట్టబోయే బిడ్డను స్వరూపకు అప్పగించేలా లైన్ క్లియర్ చేశారు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2015 జనవరి 28న ఉమ ప్రసవించింది.
అదే రోజున రాజేందర్ దంపతులకు పాపను అప్పగించారు. ప్రసూతి ఖర్చులు రూ. 20 వేలు, భావ్‌సింగ్‌కు నగదు రూ. 5 వేలు అప్పగించి దత్తత అగ్రిమెంటు రాయించుకుని పాపను తీసుకెళ్లారు.
రెండున్నర ఏళ్ల తర్వాత తమ బిడ్డ తమకే కావాలని ఉమ అక్టోబర్ 22న ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ బి.రాజు విచారణ చేపట్టారు. ఈ కేసును స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్. దయామణికి, అప్పటి సూపర్‌వైజర్ కమలాదేవి, బాలల సంరక్షణాధికారి శివకుమారిలకు అప్పగించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు తన్వితను ఖమ్మం బాలల సదనానికి అప్పగించారు.
ఆనందంగా ఉంది
నాకు దూరంగా ఖమ్మం బాలల సదనంలో 160 రోజుల పాటు ఉన్న చిన్నారి తన్వితను నా సంరక్షణలో ఉంచాలని కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉంది. పాప నా వద్దకు చేరాలని ఎన్నో మొక్కలు మొక్కాను, ప్రతీ రోజు తల్లడిల్లాను.
అన్నపానీయాలు మానేశాను. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ నాకే చెందాలని ఎంతోమంది అండగా నిలిచారు. మానవతా ధృక్పథంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. – స్వరూప
Comments
Please login to add a commentAdd a comment