balasadan
-
తల్లి వేధింపుల నుంచి విముక్తి
ఆకివీడు: ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న బండారు దుర్గాభవాని అనే బాలికను స్థానిక బాలసదన్ సంరక్షణా కేంద్రంలో గురువారం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ చైర్మన్ మధులత చేర్పిం చారు. వేల్పూరుకు చెందిన బండారు పూర్ణిమ, శివ దంపతులకు నూకాంబిక, దుర్గాభవాని అనే ఇద్దరు కుమార్తెలు. తాపీ పనిచేస్తున్న తండ్రి మరణంతో నూకాంబిక, దుర్గాభవాని ఉండిలోని ఓ ఆర్కెస్ట్రాలో చేరి వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నారు. అయితే పిల్లలిద్దరినీ తన ఇంటికి రావాలని తల్లి పూర్ణమ్మ ఒత్తిడి చేయగా అందుకు నూకాంబిక, దుర్గాభవాని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పూర్ణమ్మ ఫిర్యాదు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించామని, నూ కాంబిక, దుర్గాభవానిని విచారించామని మ ధులత చెప్పారు. మేజర్ అయిన నూకాంబిక ఇష్టప్రకారం ఆర్కెస్ట్రా యజమానుల వద్ద ఉండేలా, మైనర్‌గా ఉన్న దుర్గాభవానిని ఆమె ఇష్టం మేరకు బాలసదన్‌లో చేర్పించామన్నారు. అక్కడే ఉంచి చదువు చెప్పిస్తామన్నారు. దుర్గాభవానిని బాలసదన్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మికి అప్పగించామని మధులత వివరించారు. -
పెంపుడు తల్లి చెంతకే...
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప – రాజేందర్ల దత్త పుత్రిక తన్వితకు తాత్కాలికంగా విముక్తి లభించింది. 160 రోజుల పాటు ఖమ్మం బాలల సదనంలో ఉన్న తన్విత.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బుధవారం రాత్రి బాలల సదనం నుంచి పెంపుడు తల్లి వేముల స్వరూప చెంతకు చేరింది. తన్వితను తనకే అప్పగించాలని, కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు తనవద్దే ఉంచే లా ఆదేశించాలని స్వరూప కోర్టును అభ్యర్థించింది. ఆమె ఫిర్యాదును విచారించిన కోర్టు.. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి తన్వితను బాలల సదనంలో ఉంచటం కంటే పెంపుడు తల్లి విన్నపం మేరకు ఆమెకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగింది... తన్విత కన్న తల్లిదండ్రులు భావ్‌సింగ్ – ఉమ ఇల్లెందులోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తూ స్టేషన్‌బస్తీలో నివాసం ఉండేవారు. వారికి తొ లి సంతానంగా పాప జన్మించింది. ఆ తర్వా త ఉమ మరోసారి గర్భం దాల్చడంతో రెండో సంతానంలోనూ పాప పుడితే ఎలా అనే సందేహం వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి దృష్టికి తెచ్చారు. ఉమకు అబార్షన్ చేయించాలని కోరారు. అయితే అప్పటికే ఆమెకు ఆరో నెల రావడంతో అబార్షన్ సాధ్యం కాదని ఆర్ఎంపీ సూచించారు. ఒకవేళ ఆడబిడ్డ పుడితే సంతానం లేని వారికి ఇస్తారా అని ఆ వైద్యుడు అడగడంతో భావ్‌సింగ్ అంగీకరించాడు. కాగా, వేముల స్వ రూప – రాజేందర్ దంపతులు కూడా ఎక్కడైనా పాప దొరికితే పెంచుకుంటామని ఆర్ఎ ంపీ వైద్యుడి వద్ద పలుమార్లు ప్రస్తావించారు. దీంతో ఆర్ఎంపీ ఉమకు పుట్టబోయే బిడ్డను స్వరూపకు అప్పగించేలా లైన్ క్లియర్ చేశారు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2015 జనవరి 28న ఉమ ప్రసవించింది. అదే రోజున రాజేందర్ దంపతులకు పాపను అప్పగించారు. ప్రసూతి ఖర్చులు రూ. 20 వేలు, భావ్‌సింగ్‌కు నగదు రూ. 5 వేలు అప్పగించి దత్తత అగ్రిమెంటు రాయించుకుని పాపను తీసుకెళ్లారు. రెండున్నర ఏళ్ల తర్వాత తమ బిడ్డ తమకే కావాలని ఉమ అక్టోబర్ 22న ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ బి.రాజు విచారణ చేపట్టారు. ఈ కేసును స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్. దయామణికి, అప్పటి సూపర్వైజర్ కమలాదేవి, బాలల సంరక్షణాధికారి శివకుమారిలకు అప్పగించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు తన్వితను ఖమ్మం బాలల సదనానికి అప్పగించారు. ఆనందంగా ఉంది నాకు దూరంగా ఖమ్మం బాలల సదనంలో 160 రోజుల పాటు ఉన్న చిన్నారి తన్వితను నా సంరక్షణలో ఉంచాలని కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉంది. పాప నా వద్దకు చేరాలని ఎన్నో మొక్కలు మొక్కాను, ప్రతీ రోజు తల్లడిల్లాను. అన్నపానీయాలు మానేశాను. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ నాకే చెందాలని ఎంతోమంది అండగా నిలిచారు. మానవతా ధృక్పథంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. – స్వరూప -
గుడ్డలు కుక్కి... చేతులు విరిచి
ఖమ్మం క్రైం: అనారోగ్యంతో తల్లి చనిపోవటంతో పసిబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు.. తల్లి లాంటి అమ్మమ్మ వారిని సముదాయించాల్సింది పోయి.. మద్యం మత్తులో వారిని చితకబాదింది. ఏడాదిన్నర బిడ్డ తల్లి కోసం ఏడుస్తుండటంతో ఆ చిన్నారి చేతులను విరిచేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ ప్రాంతంలోని కాల్వొడ్డుకు చెందిన షేక్ సోందు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. భార్య సైదాబీ తన ముగ్గురు ఆడపిల్లలు హుస్సేన్‌బీ(6), ఆసియా(3), జైనా(ఏడాదిన్నర), తల్లి కాశీంబీతో కలసి వెంకటగిరి ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లతో నివాసం ఏర్పాటు చేసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో సైదాబీ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లికోసం ఏడుస్తుండటంతో.. మద్యం మత్తులో ఉన్న అమ్మమ్మ కాశీంబీ వారిని తీవ్రంగా కొట్టింది. భయపడిన చిన్నారి ఆసియా ఏడుపు ఆపింది. మరో చిన్నారి జైనా ఏడుపు ఆపకపోవటంతో చితక్కొట్టింది. పక్కనున్న వారి గద్దించడంతో కొట్టడం ఆపేసింది. చుట్టుపక్కల వారు పడుకున్న తర్వాత కాశీంబీ తల్లిపాల కోసం ఏడుస్తున్న జైనా నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణంగా చేతులు విరిచేసింది. భయంతో ఆసియా ఓ మూలన నక్కి పడుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సైదాబీ మృతదేహం చూసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు వేలాడుతున్న చిన్నారి చేతులను చూసి కాశీంబీని గద్దించారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా.. ఆశియా తన చెల్లెలిని రాత్రి నుంచి కొడుతూనే ఉందని చెప్పింది. స్థానికులు స్వచ్ఛంద సంస్థ అన్నం ఫౌండేషన్‌కు ఫోన్ చేయడంతో ఆ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుతో పాటుగా వన్‌టౌన్ సీఐ రమేశ్ వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చింతకాని హాస్టల్లో ఉంటోన్న పెద్ద కుమార్తె హుస్సేన్‌బీని తీసుకొచ్చి గంజేషాహిద్ మసీద్ కమిటీ వారు సైదాబీకి అంత్యక్రియలు నిర్వహించారు. జైనా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, హుస్సేన్‌బీ.. ఆసియాలను అన్నం ఫౌండేషన్ చేరదీసింది. వారు ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడి.. ఆ చిన్నారులను బాలసదన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ పారిపోయింది. -
భద్రత డొల్ల!
ఒంగోలు టౌన్: బాలసదన్‌లో భద్రత డొల్ల అని తేలిపోయింది. మూడు సీసీ కెమెరాలు, ముగ్గురు సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ ఇద్దరు మైనర్ వివాహితులు అక్కడ నుంచి తప్పించుకుపోవడం సంచలనం సృష్టించింది. వారు తప్పించుకుపోయారని చెబుతున్న ప్రాంతాన్ని చూస్తే విస్తుపోవాల్సిందే. మనిషి దూరలేని సందు నుంచి ఇద్దరు బాలికలు తప్పించుకుపోవడం చర్చనీయాంశమైంది. బాలసదన్‌కు భద్రత, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఇట్టే స్పష్టమవుతోంది. ఒంగోలు నగరంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ఆనుకొని బాలసదన్ నిర్మించారు. ప్రస్తుతం ఇందులో పదేళ్లలోపు వయస్సు కలిగిన బాలికలు 32 మంది ఉన్నారు. వారంతా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. వారితోపాటు ఇద్దరు బాలికలను ఇటీవల తీసుకువచ్చారు. గిద్దలూరుకు చెందిన ఓ బాలిక ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఆమెను తీసుకురాగా ప్రేమ వివాహం చేసుకున్న వేటపాలేనికి చెందిన మరో బాలికను కూడా ఈ ఏడాది జనవరి మొదటి వారంలో తీసుకువచ్చారు. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వీరిద్దరూ శుక్రవారం ఒకేసారి అక్కడ నుంచి తప్పించుకుపోయారు. అంతకు ముందు నుంచి వారు బాలసదన్ ప్రాంగణం మొత్తం కలియతిరిగి తప్పించుకునేందుకు పథక రచన చేసుకొని, అధికారులు, సిబ్బంది, తోటి బాలికల కళ్లు గప్పి పారిపోవడంతో సంచలనం కలిగించింది. ఇటీవల ఈ బాలికలను కలిసేందుకు వారి తల్లిదండ్రులు వచ్చారు. పారిపోయేందుకు వారు కూడా ఉపాయం చెప్పి ఉంటారన్న అనుమానాలను ఆ శాఖ అధికారులు వెలుబుచ్చుతున్నారు. ఇదేనా భద్రత? బాలసదన్‌లో ప్రస్తుతం 35 మంది బాలికలు ఉన్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత వారు అక్కడే భోజనం చేసి పడుకుంటారు. బాలసదన్ ప్రాంగణంలోనే శిశుగృహ ఉంది. ఇందులో ప్రస్తుతం తొమ్మిది మంది శిశువులు ఉన్నారు. శిశుగృహ మొదటి అంతస్తులో ఉంది. అక్కడ ఆరుగురు ఆయాలు, ఒక ఏఎన్ఎం, ఒక సోషల్ వర్కర్ ఉన్నారు. 35 మంది బాలికలు ఉన్న బాలసదన్‌కు మాత్రం తగినంత సిబ్బంది లేరు. ప్రస్తుతం బాలసదన్‌కు సూపరింటెండెంట్, మేట్రిన్, కుక్, వాచ్ ఉమెన్, సేవిక, హెల్పర్ ఉన్నారు. ఒకొక్కరే ఉండటంతో అక్కడ ఉండే బాలికలకు భద్రత ప్రమాదంలో ఉన్నట్లుగానే ఉంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం కలుగుతోంది. పోలీసు రక్షణ కావాలంటూ ఇక్కడ నుంచి పోలీసు శాఖకు, అగంతకులు చొరబడకుండా ఉండేందుకు చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే విషయమై మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కానీ, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. నాలుగు సీసీ కెమెరాలకు మూడే రన్నింగ్.. బాలసదన్‌లో నాలుగు సీసీ కెమెరాలకుగాను ప్రస్తుతం మూడు పనిచేస్తున్నాయి. వెనుకవైపు మార్గంలో కూడా ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేసే విషయమై ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇద్దరు బాలికలు పారిపోయిన తరువాత ఆ శాఖ అధికారులు తప్పులను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. -
బాలసదన్‌కు బాలిక అప్పగింత
ధర్మవరం అర్బన్: ధర్మవరం రైల్వేస్టేషన్లో తప్పిపోయిన చిన్నారి అంజలిని వైఎస్సార్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కత్తే పెద్దన్న సాయంతో ఓ యువకుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తప్పిపోయిన బాలికను విచారించగా తన పేరు అంజలి అని చెబుతోంది. బాలిక పూర్తి వివరాలు తెలియకపోవడంతో పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దన్న పట్టణంలోని బాలసదన్ వసతి గృహంలో బాలికను శుక్రవారం రాత్రి 11గంటలకు అప్పగించాడు. అనంతరం ఉదయం ఆ బాలికను అనంతపురం హోంకేర్కు పంపినట్లు తెలిపారు. -
ప్రేమజంట వివాదం.. బాలిక ఆత్మహత్యాయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ ప్రేమజంట మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమజంటకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసులు బాలికను బాలసదన్‌కు తరలించారు. అక్కడుకు వెళ్లిన బాలిక మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.