సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులు గరిష్ట నీటి నిల్వలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ని్రష్కమించాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు మండలాలు, ప్రకాశం జిల్లాలపై మాత్రమే ఉంటుంది. అంటే, వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నట్టు లెక్క. ఈ దశలో రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో 439.361 టీఎంసీలకుగాను 378.738 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో జలాశయాల్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉండటం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 527.86 టీఎంసీలకుగాను 514.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నవంబర్ మూడో వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉండటం కూడా ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.
రైతుల ప్రయోజనాలే పరమావధి
► నీటి సంవత్సరం ప్రారంభంలోనే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో వరద జలాలను ఒడిసిపట్టి.. ప్రాజెక్టులను నింపడం ద్వారా ఖరీఫ్, రబీల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
► గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఆయా ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులను విడుదల చేశారు.
► దాంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీలను ఇప్పుడు నిల్వ చేశారు. గత ఏడాది ఈ సమయానికి 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.
► సోమశిల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో 77 టీఎంసీల నీరు నిల్వ చేశారు. కండలేరు రిజర్వాయర్‌లో చరిత్రలో తొలిసారిగా 68.03 టీఎంసీలకు గాను 60.28 టీఎంసీలను నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ కేవలం 47 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం.
► వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగాను తొలి సారిగా 14.299 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 8.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గండికోట రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీలకుగాను 18 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 12 టీఎంసీలు ఉన్నాయి. పైడిపాళెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగాను 5.90 టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏటా 45 టీఎంసీలను నిల్వ చేశారు.
► వరద జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వరుసగా రెండో ఏటా ఖరీఫ్‌లో ఆయకట్టులో కోటి ఎకరాలకు ప్రభుత్వం నీటిని అందించింది. రబీలోనూ రికార్డు స్థాయిలో (గతేడాది రబీలో 22 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు) ఆయకట్టుకు నీటిని అందించే దిశగా అడుగులు వేస్తోంది.
యాజమాన్య పద్ధతులతో నీటి వృథాకు అడ్డుకట్ట
నీటి విలువ, వ్యవసాయం విలువ, రైతుల శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్లే రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం. ఖరీఫ్‌లో ఒక్క ఎకరా ఎండకుండా సుమారు కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాం. రబీలోనూ రికార్డు స్థాయిలో నీళ్లందించడానికి చర్యలు చేపట్టాం. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జల వనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment