ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు | ready opening of the incompleted project | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

Published Sun, May 25 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

ready opening of the incompleted project

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ :  మండలంలోని గుడిపేట వద్ద గోదావరినదిపై 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 62 గేట్లకు పెయింటింగ్ వేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ వైపు ఉన్న గుడిపేట వైపు కరకట్ట కిలోమీటరు దూరం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుడిపేట నిర్వాసితులు పునరావాస కాలనీకి పూర్తిగా తరలి వెళ్లి.. గ్రామాన్ని ఖాళీ చేసిన వెంటనే మిగితా కరకట్ట పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో త్వరలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించనున్నట్లు తెలిసింది. జూలై, ఆగస్టులో ప్రారంభోత్సవం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పైలాన్ నిర్మాణ పనులు పూర్తి కాగా ప్రాజెక్టు వద్ద గల బారీకేడ్లకు రంగులు వేశారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో గుడిపేట గ్రామం వద్ద స్వాగత బోర్డు పనులు చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు చేరితే ప్రారంభోత్సవం సందర్భంగా గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉంది. స్పిల్‌వే పై నిర్మించిన సిమెంటు రోడ్డు ద్వారా గుడిపేట నుంచి ప్రాజెక్టు మీదుగా ఎల్లంపల్లి, ముర్మూరు గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సిద్ధమైంది.

 సాకారం కానున్న వైఎస్సార్ కల
 తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు, ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కోసం 6.5 టీఎంసీల నీరు, మంథనిలో లిఫ్‌ట ఇరిగేషన్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2004 జూలై 24న ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,443 కోట్లు కాగా.. నాలుగేళ్లలో పూర్తి కావాల్సి ఉంది. నిధుల కొరత, వైఎస్సార్ మరణానంతరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల పదేళ్ల అనంతరం నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వైఎస్సార్ కల త్వరలో నెరవేరనుంది.

 అందని పరిహారం.. కల్పించని పునరావాసం...
  ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద జిల్లాలో తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గుడిపేట, నంనూరు, రాపల్లి, చందనాపూర్, కర్ణమామిడి, కొండపల్లి, పడ్తన్‌పల్లి, సూరారం, గుళ్లకోట గ్రామాలు ఉన్నాయి. వీరికి పూర్తి స్థాయిలో పరిహారం, ఇళ్లకు డబ్బులు అందించలేదు.

 నంనూరులోని 1,018, గుడిపేటలోని 625 కుటుం బాలకు గుడిపేటలోని శివారులో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటికే 500 మంది ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉన్నారు. అభివృద్ధి పనులు చేపట్టినా.. ఇప్పటికే వర్షాలకు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ర్యాలీ వాగు నుంచి తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేసినా చుక్కనీరు అందడం లేదు.

  కొండపల్లిలో 179 ఇళ్లు, 244 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. వీరికి గ్రామ శివారులోనే 23 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టుకు సమీపంలో కాలనీ ఉందని, జాతీయ రహదారికి దగ్గరగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మూడేళ్లుగా అధికారులను కోరుతున్నారు. గత ఏడాది గ్రామస్తులకు పునరావాస కాలనీలో ప్లాట్లు అందించినా.. ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.

  రాపల్లి గ్రామంలోని 978 మంది నిర్వాసితులకు హాజీపూర్ శివారులో 90.24 ఎకరాల్లో 885 కుటుంబాలకు పునరావాస కాలనీని రూ.22.86 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. 11.5కిలోమీటర్లకు గాను 6.8 కిలోమీటర్లు సీసీ రోడ్డు పూర్తి చేశారు. 22 కిలోమీటర్లకు గాను 18కిలోమీటర్లు డ్రెయినేజీ పనులు, 6.2 కిలోమీటర్లు పైపులైన్ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.

  చందనాపూర్ నిర్వాసితుల కోసం గుడిపేట శివారులోని 27 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కాలనీ అభివృద్ధి కోసం రూ.7.45 కోట్లు కేటాయించారు. కాలనీలో 2.8కిలోమీటర్ల రోడ్లకు గాను 0.9 కిలోమీటర్లు పూర్తయింది. 4.6కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి గాను 1.81 కిలోమీటర్లు పూర్తయింది. 60 వేల లీటర్ల నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయింది. మొత్తంగా 27.5శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ మిగితా పనులు నిలిపి వేశారు.

కర్ణమామిడిలో 712 ఇళ్లు ఉండగా 1,054 కుటుంబాలు, పడ్తన్‌పల్లిలో 268 ఇళ్లు ఉండగా 336 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు 84.36 ఎకరాల స్థలాన్ని హాజీపూర్, రాంపూర్ శివారులో గుర్తించారు. ఇందులో 61.24 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని లేఔట్ రూపొందించినా.. అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. మిగితా 23.12 ఎకరాల సేకరణలో చట్టపరమైన సమస్యలున్నాయి.
 
గుళ్లకోటలో 627 ఇళ్లు ఉండగా 829 కుటుంబాలు ముంపునకు గురి కాగా.. వీరికి గుళ్లకోటలోనే 78.01 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. ఇంకా నిర్వాసితులు నిర్మాణలు చేపట్టలేదు. గ్రామంలోని వారికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
 
సూరారంలో 143 ఇళ్లు ఉండగా.. 209 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. వీరికి గ్రామ శివారులోని 26.18 ఎకరాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 60వేల లీటర్ల తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తి కాగా, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణం పనులు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement