మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తూర్పు ప్రాంతంలో బుధవారం వన దేవతల జాతర కన్నుల పండువగా ప్రారంభమైంది. మంచిర్యాల, చెన్నూర్, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన, బెజ్జూర్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం నేత్రపర్వంగా జరిగింది. సారలమ్మ దర్శనంతో భక్తులు పులకించారు. అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
పులకించిన గోదారి సరిహద్దు..
మంచిర్యాలలోని గోదావరి తీరంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. గోదావరి తీరాన కరీంనగర్ జిల్లా గోలివాడ, మంచిర్యాల రెండు వైపుల జాతర జరుగుతుండడంతో భక్తులతో గోదావరి కిటకిటలాడింది. జిల్లా తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, వాంకిడి, కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచే కాకుండా సరిహద్దున ఉన్న మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
ఉదయం నుంచి రాత్రి వరకు గోదావరి దారులు కిక్కిరిశాయి. పిల్లాపాపలు,సామగ్రితో భక్తులు జాతరకు చేరుకున్నా రు. ఎడ్లబండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, కారు, కాలినడకన వచ్చారు. మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరం వరకు భక్తులు బారులు తీరారు.
కొలువుదీరిన సారలమ్మ
తొలి రోజు కూతురు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. మేడారం నుంచి వచ్చిన పూజారులు లక్ష్మయ్య, అనసూర్య, రాధ, సమ్మయ్య సారలమ్మకు పూజలు చేసి భక్తుల జయజయ ధ్వానాలు, బాజా భజంత్రీల మధ్య గద్దెల వరకు తీసుకొచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే భక్తులు భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకంతో పరవశించి పోయారు. మహిళలను అమ్మవారు ఆవహించగా.. గద్దెపై కొలువుదీరిన అనంతరం శివసత్తులు మామూలు స్థితికి వచ్చారు.
నేడు సమ్మక్క రాక
తొలిరోజు కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోగా గురువారం సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తె అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
గోదావరిలో పుణ్యస్నానాలు
పవిత్రమైన గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వన దేవతలను దర్శనం చేసుకునే ముందు గోదావరి నదిలో స్నానాలు చేస్తే పునీతలవుతారని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు నేరుగా గోదావదికి వెళ్లి పిల్లాపాపలతో స్నానాలు చేశారు. అనంతరం సారలమ్మను దర్శనం చేసుకోవడానికి బారులుతీరారు. నిలువెత్తు బంగారం(బెల్లం), తలనీలాలు సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రముఖుల పూజలు
సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే అధికారులు, రాజకీయ నాయకులు తొలి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, మాజీ ైచె ర్మన్ పెంట రాజయ్య, తహశీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు సంతోశ్, మసూద్‌అలీ, ఇన్‌చార్జి సీఐ కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆలయ ఈవో వామన్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయానంద్, మాజీ కౌన్సిలర్ కిషన్ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.
భక్తులకు ఏర్పాట్లు
భక్తుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన అధికారులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి నల్లాల ద్వారా భక్తులకు తాగునీరు, స్నానాలకు నల్లాలు, మహిళలు దుస్తులు మార్పుకోవడానికి ప్రత్యేక గదులు, తక్షణ వైద్య సహాయం కోసం ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. విద్యుత్ దీపాలను అమర్చారు.
పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించారు. మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రాంనగర్ నుంచి వన్‌వే ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. దుకాణాలు వెలి శాయి. ఈసారి మద్యం అమ్మకాలకు అనుమతి లభిం చకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు.
వన జాతర
Published Thu, Feb 13 2014 2:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement